Amaerica Health System
America Health System: : కరోనావైరస్ తాకిడికి అమెరికాలోని హాస్పిటల్స్ మరోసారి ఒత్తిడికి గురవుతున్నాయి. హాస్పిటల్స్ లోకి భారీ స్థాయిలో రోగులు క్యూ కడుతున్నారు. గతేడాది జనవరి 14న రికార్డు స్థాయిలో లక్షా 42వేల 273మంది ఆసుపత్రుల్లో చేరినట్లు తెలుస్తుండగా.. తాజాగా సోమవారం ఒమిక్రాన్, ఇతర వేరియంట్ల ప్రభావంతో లక్షా 41వేల 385 మంది హాస్పిటల్స్ లో అడ్మిట్ అయ్యారు. మంగళవారం 2021 రికార్డు స్థాయి సంఖ్యను దాటేస్తుంది.
ప్రమాద ఘంటికలు..
అమెరికాలో ఒమిక్రాన్ నిపుణుల అంచనాలకు తగ్గట్లుగానే పెరుగుతూ ఉంటే.. హాస్పిటల్స్‌లో చేరేవారి సంఖ్య ఇంకొన్ని వారాల్లోనే 2లక్షల 75వేల నుంచి 3లక్షల మధ్యలో ఉండొచ్చని భావిస్తున్నారు. జనవరి చివరి నాటికి కేసులు మరింత పెరగొచ్చని నిపుణులు చెబుతున్నారు. సోమవారం కొలొరాడో, ఒరిగాన్,లూసియానా, మేరీల్యాండ్, వర్జీనియాల్లో పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించారు.
అమెరికాలో కరోనా బారిన పడే ఆసుపత్రి సిబ్బంది సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. ఫలితంగా వైద్య సిబ్బంది కొరత కనిపిస్తుంది. అమెరికాలో12వందల హాస్పిటల్స్‌లో కనిపిస్తున్న ఈ సమస్య.. దేశంలోని 24 శాతం ఆసుపత్రులకు సమానం. ఈ విషయాన్ని అమెరికా డిపార్ట్‌మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీస్ ధ్రువీకరించింది.
ఇది కూడా చదవండి : ‘మహానటి’కి కరోనా
ఒమిక్రాన్ కారణంగా వైద్య సిబ్బంది కరోనా బారిన పడటంతో కాలిఫోర్నియా డిపార్ట్‌మెంట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ కీలక నిర్ణయం తీసుకొంది. కొవిడ్ లక్షణాలు లేకపోతే.. ఎన్-95 మాస్కులు ధరించి విధులకు హాజరుకావాలని సూచించింది. ఈ ఆదేశాలు జనవరి 8వ తేదీ నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకూ తాత్కాలికంగా అమల్లో ఉంటాయని పేర్కొంది. దీనిపై కాలిఫోర్నియా నర్సెస్ అసోసియేషన్ అధ్యక్షురాలు తీవ్రంగా స్పందించారు. ‘వైరస్ సోకిన వైద్య సిబ్బంది విధుల్లోకి వస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అధికారులు అసంబద్ధమైన చర్యను చేపట్టారు’ అంటూ మండిపడ్డారు.