జవాన్ల మధ్య చిచ్చు పెట్టిన టెంటు తొలగించారు.. అసలేం జరిగింది? 

  • Publish Date - June 17, 2020 / 09:12 AM IST

తూర్పు లడఖ్ వద్ద భారత్, చైనా దళాల మధ్య జరిగిన ఘర్షణకు కారణమైన టెంట్ తొలగించినట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ టెంటు వద్ద జరిగిన ఘర్షణలో అనేక మంది జవాన్లు మంచుతో కూడిన గాల్వన్ నదిలో పడిపోయారు. వీరిలో 20 మంది భారతీయ జవాన్లు అమరులయ్యారు. సరిహద్దు వద్ద కొన్నివారాలుగా ఉద్రికత్త కొనసాగుతోంది. భారత్‌–చైనా జవాన్ల మధ్య ఘర్షణ, పలువురి మృతికి టెంట్‌ వద్ద జరిగిన గొడవే కారణమని సమాచారం.

LACకు ఒక వైపున భారత భూభాగంలోనే చైనా సైనికులు టెంట్‌ వేశారు. గాల్వన్‌ లోయ ప్రాంతంలో భారత భూభాగంలో పెట్రోలింగ్‌ పాయింట్‌ 14 దగ్గర చైనా పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ(PLA) టెంట్‌ వేసిందనే సమాచారం అందింది. వెంటనే అప్రమత్తమైన భారత జవాన్లు రంగంలోకి దిగారు. ఈ నేపథ్యంలోనే టెంటు ఇరు దేశాల సైనికుల మధ్య ఘర్షణకు దారితీసింది. ఈ ఘటనలో భారత జవాన్లలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు కొన్ని నివేదికలు సూచిస్తున్నాయి.

ఈ సోమవారమే (జూన్ 15) భారతీయ పెట్రోలింగ్ పార్టీ 15వేల అడుగుల గాల్వన్ నది లోయలో ఒక చైనా గుడారాన్ని తొలగించడానికి వెళ్లినట్టు తెలిసింది. జూన్ 6న ఇరు పక్షాల లెఫ్టినెంట్ జనరల్ ర్యాంకు అధికారుల మధ్య చర్చలు కూడా జరిగాయి. ఆ తర్వాతే అక్కడి డేరాను తొలగించడానికి చైనా అంగీకరించింది. చైనా సైనికులు ఇండియన్ కల్నల్ బిఎల్ సంతోష్ బాబును లక్ష్యంగా చేసుకోవడంతో ఈ ఘర్షణకు దారి తీసిందని వర్గాలు తెలిపాయి. ఆ టెంట్‌ను వెంటనే తొలగించాలని భారత జవాన్లు సూచించగానే, పెట్రోలింగ్‌ పాయింట్‌ 14 పై భాగం నుంచి చైనా జవాన్లు రాళ్లు విసిరారు.

ఇనుప రాడ్లతో దాడికి పాల్పడ్డారు. దాదాపు 6 గంటలపాటూ జరిగిన తోపులాటలో పక్కనే ఉన్న గాల్వన్‌ లోయలో కొందరు జవాన్లు పడిపోయారు. ఈ ఘటనలో గాయపడిన భారత జవాన్లను మిలటరీ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘర్షణలో ఇప్పటివరకు కల్నల్ స‌హా 20 మంది భార‌త సైనికులు మరణించారు. తాజాగా మరో నలుగురి జవాన్ల పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. చైనా సరిహద్దులో శాంతికి కట్టుబడి ఉన్నట్లు భారతదేశం తెలిపింది.

Read: వీరుల మ‌ర‌ణాల‌ను భార‌త్ వెల్ల‌డిస్తుంది..చైనా ఎందుకు దాస్తుందంటే