Trump: అఫ్ఘానిస్తాన్ సంక్షోభం.. బైడెన్ రాజీనామాకు ఇదే సమయం.. ట్రంప్ పిలుపు

అప్ఘానిస్తాన్ సంక్షోభంపై డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాలిబన్ల అప్ఘాన్ ఆక్రమణ నేపథ్యంలో అధ్యక్షుడు జో బైడెన్ రాజీనామా చేయాలని పిలుపునిచ్చారు

Donald Trump Calls For Joe Biden To Resign Over Afghanistan Crisis

Donald Trump : అప్ఘానిస్తాన్ సంక్షోభంపై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాలిబన్లు అప్ఘాన్ ను ఆక్రమించుకున్న నేపథ్యంలో తన వారసుడు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వెంటనే రాజీనామా చేయాలని ట్రంప్ పిలుపునిచ్చారు. అఫ్ఘానిస్తాన్‌లో తాలిబన్ల ఆక్రమణతో బైడెన్ అవమానంతో రాజీనామా చేయాల్సిన సమయం వచ్చిందని ట్రంప్ ఒక ప్రకటనలో వ్యాఖ్యానించారు. యునైటెడ్ స్టేట్స్‌లో కోవిడ్ -19 కేసులు పెరుగుదల, దేశీయ ఇమ్మిగ్రేషన్, ఆర్థిక పరిస్థితుల విషయంలో బైడెన్ విధానాలపై ట్రంప్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

అప్ఘానిస్తాన్ తాలిబన్ల గుప్పిట్లోకి వెళ్లడంతో దాదాపు 20 సంవత్సరాల తర్వాత అమెరికా సైన్యం దేశం నుంచి వైదొలిగింది. తాలిబాన్ ఉగ్రవాదులు అఫ్ఘానిస్తాన్‌ను స్వాధీనం చేసుకోవడంతో అక్కడి ప్రభుత్వం చేతులేత్తేసింది. అమెరికా దండయాత్రతో చేతులేత్తేసిన తాలిబన్లు 20 సంవత్సరాల తర్వాత మెరుపు వేగంతో అప్ఘానిస్తా‌న్‌ను తిరిగి స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో దేశం నుంచి అమెరికన్ దళాలను ఉపసంహరించుకోవాలని బైడెన్ నిర్దేశించారు. ఆగస్టు 31 గడువుకు రెండు వారాల ముందే ఆదివారం కాబూల్‌ను తాలిబన్లు తమ ఆధీనంలోకి తీసుకోవడం గమనార్హం.
Taliban : అఫ్ఘాన్‌లో మళ్లీ తాలిబన్ల రాజ్యం!

ట్రంప్ హయాంలోనే 2020లో దోహాలో తాలిబన్‌లతో అమెరికా ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఉగ్రవాదుల నుంచి వివిధ భద్రతా హామీలకు బదులుగా మే 2021 నాటికి అమెరికా తన సైన్యాలన్నింటినీ ఉపసంహరించుకోవాల్సి ఉంది. ఈ ఏడాది ప్రారంభంలో బైడెన్ అధికారం చేపట్టినప్పుడు ఈ ఒప్పంద హామీ ప్రకారం సైన్యం ఉపసంహరణ గడువును పొడిగించారు. దీనిపై ఎలాంటి షరతులు విధించలేదు. బైడెన్ చర్యలపై ట్రంప్ పదపదే విమర్శలు చేస్తూనే ఉన్నారు. అదే తాను ఇంకా దేశా అధ్యక్షుడిగా ఉండి ఉంటే.. చాలా భిన్నమైన విజయవంతంగా ఉండేదని ట్రంప్ అభిప్రాయపడ్డారు. అఫ్ఘానిస్తాన్‌ విషయంలో జో బిడెన్ చేసింది ఇక చాలు.. ఇది అమెరికన్ చరిత్రలో గొప్ప ఓటములలో ఒకటిగా నిలిచిపోతుందని ట్రంప్ వ్యాఖ్యానించారు.

అప్ఘాన్‌లో సైన్య ఉపసంహరణకు దోహా ఒప్పందంపై ట్రంప్ చర్చలు జరిపిన అనంతరం అమెరికా ప్రజలలో ఎక్కువమందిలో యుద్ధాలకు ఇది ముగింపుగా భావించారని బైడెన్ ప్రభుత్వం ఎత్తిచూపింది. అయితే ఈ ఉపసంహరణ విషయంలో బైడెన్ విఫలం కావడంతో ఆయనపై తీవ్ర విమర్శలకు దారితీసింది. అఫ్ఘాన్ ప్రభుత్వం త్వరగా కూలిపోతుందనే భయందోళనల మధ్య అమెరికా రాయబార కార్యాలయాన్ని ఖాళీ చేయాల్సి వచ్చింది.