Taliban : అఫ్ఘాన్‌లో మళ్లీ తాలిబన్ల రాజ్యం!

అంతా అనుకున్నట్లే జరిగింది. అఫ్ఘానిస్తాన్‌లో మళ్లీ తాలిబన్ల రాజ్యం వచ్చింది. తాలిబన్లు అప్ఘానిస్తాన్ మొత్తాన్ని తమ గుప్పిట్లోకి తెచ్చుకున్నారు.

Taliban : అఫ్ఘాన్‌లో మళ్లీ తాలిబన్ల రాజ్యం!

Taliban Sweep Into Afghan Capital After Government Collapses

Taliban sweep into Afghan capital  : అంతా అనుకున్నట్లే జరిగింది. అఫ్ఘానిస్తాన్‌లో మళ్లీ తాలిబన్ల రాజ్యం వచ్చింది. తాలిబన్లు అప్ఘానిస్తాన్ మొత్తాన్ని తమ గుప్పిట్లోకి తెచ్చుకున్నారు. ఊహించినదానికంటే వేగంగా కాబూల్‌ను స్వాధీనం చేసుకున్నారు తాలిబన్లు. తాలిబన్ జెండాను ఎగురవేశారు. ఒక్కో ప్రావిన్స్‌ను ఆక్రమించుకుంటూ తాలిబన్లు ముందుకు దూసుకొచ్చారు. చేసేది ఏమి లేక అఫ్ఘానిస్తాన్‌ ప్రభుత్వం తాలిబన్లకు లొంగిపోయింది. అధ్యక్ష పదవికి ఘనీ రాజీనామా చేశారు. మాజీ రక్షణ మంత్రి అలీ అహ్మద్ జలాలీని తాత్కాలిక అధ్యక్షుడిగా నియమించారు తాలిబన్లు. ప‌ది రోజులుగా దేశంలోని ప్రధాన న‌గ‌రాల‌ను ఆక్రమిస్తూ తాలిబన్లు కాబూల్‌లోకి దూసుకెళ్లారు. అఫ్ఘానిస్తాన్ ప్రభుత్వం చేతులెత్తేసింది. తాలిబన్లకు అధికారాన్ని పూర్తిగా అప్పగించేందుకు తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మాజీ రక్షణ మంత్రి అలీ అహ్మద్ జలాలీ తాత్కాలిక అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. పూర్తి స్థాయిలో పాలనపగ్గాలు చేతికి చిక్కిన తర్వాత తాలిబన్ కమాండర్‌ అబ్దుల్‌ ఘని బరాదర్‌ అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుతం అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన అష్రాఫ్‌ ఘనీ భవిష్యత్తు ఏంటనేది ప్రశ్నార్థకంగా మారింది. ఆయన దేశం విడిచి పారిపోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఘనీ దొరికితే బహిరంగంగా ఉరితీస్తామని గతంలో తాలిబన్లు హెచ్చరించారు కూడా. కాబూల్‌ నుంచి ఏదో ఒక దేశానికి వెళ్లి తలదాచుకోవాల్సిందే. ప్రస్తుతం కాబూల్ ఎయిర్‌పోర్టు మినహా ఘనీ పారిపోయేందుకు మరో అవకాశం లేదనే చెప్పాలి.

బర్గామ్ ఎయిర్‌బేస్‌ను తాలిబన్లకు అఫ్ఘాన్ సైనికులు ఇప్పటికే అప్పగించేశారు. ఎయిర్‌బేస్‌లో బందీలుగా ఉన్న 5 వేల మందిని తాలిబన్లు విడుదల చేశారు. కొన్ని నెలలుగా అప్ఘాన్‌ బలగాలకు, తాలిబన్లకు మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. తాలిబన్లు పూర్తి ఆధిపత్యాన్ని కొనసాగించారు. 34 ప్రావిన్స్‌లనూ వశం చేసుకున్నారు తాలిబన్లు. కొన్ని నెలలుగా తుపాకులు, బాంబులతో ఒక్కో నగరాన్ని వశం చేసుకుంటూ దూసుకొస్తున్నారు. చివరకు మజర్ ఎ షరీఫ్, జలాలాబాద్‌ను ఆక్రమించారు. అమెరికా నిఘా వర్గాల అంచనాలకు అందని రీతిలో కేవలం ఐదువారాల్లోనే కాబూల్‌ను గుప్పిట్లోకి తెచ్చుకున్నారు. కాబూల్‌ను నలువైపుల నుంచి చుట్టుముట్టిన తాలిబన్లు.. ఘని ప్రభుత్వాన్ని అష్టదిగ్బంధనం చేశారు. అఫ్ఘాన్ ప్రభుత్వం తాలిబన్లకు మోకరిల్లింది.

తాలిబన్ల శాంతిమంత్రం :
కాబూల్‌లో తాలిబన్లు శాంతిమంత్రం పఠించారు. ప్రభుత్వమే అధికారాన్ని తమకు అప్పగించాలని తాలిబన్లు షరతు విధించారు. ఘనీ రాజీనామాతో సాధారణ ప్రజలకు హాని తలపెట్టబోమని ప్రకటించారు. శాంతియుత చర్చల ద్వారానే కాబూల్‌ను తాలిబన్లు హస్తగతం చేశారు. విదేశీయులు అఫ్ఘాన్‌లో ఉండాలనుకుంటే ఉండొచ్చన్నారు. రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సేందనని స్పష్టం చేశారు. అఫ్ఘానిస్తాన్‌లో పరిస్థితులను గమనిస్తున్న భారత్.. మనవాళ్లను తీసుకొచ్చేందుకు కాబూల్‌కు ఎయిరిండియా విమానాలను పంపింది. పలు దేశాల ప్రయాణీకులతో కాబూల్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ రద్దీగా మారింది. అప్ఘానిస్తాన్‌ పేరును మార్చాలని తాలిబన్లు నిర్ణయించారు. ఇకపై ఇస్లామిక్‌ ఎమిరేట్‌ ఆఫ్‌ అప్ఘానిస్తాన్‌గా పిలవాలని ఆదేశించారు. అధ్యక్ష భవన నుంచే ఈ మేరకు ప్రకటన జారీ అయింది. అమెరికా సైన్యం రాకముందు తాలిబన్ల పాలన కొనసాగుతున్న సమయంలోనూ అఫ్గాన్‌కు ఇదే పేరు ఉండేది.
Malala Yousafzai : తాలిబన్ల చేతుల్లోకి అప్ఘానిస్తాన్..ఆందోళనగా ఉందన్న మలాలా

ఎయిర్ పోర్టులో కాల్పుల కలకలం :
కాబూల్‌లోని అమెరికా రాయబార కార్యాలయం తమ కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసింది. కాబూల్‌ ఎయిర్ పోర్టులో కాల్పుల సమాచారంతో అమెరికన్లు ఎక్కడివారక్కడే సురక్షితంగా తలదాచుకోవాలని సూచించింది. అప్ఘానిస్తాన్‌లో అమెరికా రాయబారి రాస్‌ విల్సన్‌ కాబూల్‌లోని దౌత్య కార్యాలయాన్ని వదిలేసి వెళ్లిపోయారు. ఎంబసీపై ఎగురుతున్న అమెరికా జాతీయ జెండాను కూడా తొలిగించి వెంట తీసుకెళ్లారు. రాయబార కార్యాలయంలోని ముఖ్యమైన ఫైళ్లను కూడా అమెరికా సిబ్బంది దగ్ధం చేశారు. అప్ఘానిస్తాన్‌లో పరిస్థితులు చేయిదాటడంతో అమెరికా ప్రభుత్వం మరో 1,000 మంది సైనికులను కాబూల్‌కు తరలించింది. కాబూల్‌లోకి తాలిబన్లు ప్రవేశించక ముందే అమెరికా పారులను ప్రభుత్వం సురక్షితంగా తరలించింది. అధ్యక్షుడు బో బైడెన్ ఆదేశాలతో కాబూల్‌లోని రాయబార కార్యాలయ సిబ్బంది, అమెరికా పౌరుల్ని చినూక్‌ హెలికాప్టర్లతో సురక్షిత ప్రాంతాలకు తరలించింది.

విఫలమైన జో బైడెన్ :
అప్ఘానిస్తాన్‌లో పరిస్థితులను అంచనా వేయడంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ విఫలమయ్యారు. అప్ఘాన్‌ సైన్యం చాలా బలంగా ఉందన్నారు. సైన్యాన్ని జయించడం అసాధ్యమని చెప్పారు. 3 లక్షల మంది సైన్యానికి ట్రైనింగ్ ఇచ్చినా వారిని ఓడించడం ఆషామాషీ కాదంటూ ప్రకటించారు. బైడెన్ అంచనాలను తాలిబన్లు తలకిందులు చేశారు. బైడెన్ ప్రకటన చేసిన నెల రోజుల్లోనే.. అప్ఘానిస్తాన్‌ను హస్తగతం చేసుకుని ప్రపంచాన్నే నివ్వెర పరిచారు. వారం రోజుల వ్యవధిలోనే తాలిబన్లు మొత్తం అఫ్గానిస్తాన్‌ను ఆక్రమించుకుంది. తాలిబన్ల చేతుల్లోకి అప్ఘాన్ వెళ్లడంతో దాచుకున్న సొమ్మును వెనక్కి తీసుకొనేందుకు అక్కడి జనమంతా ఏటీఎం కేంద్రాల వద్ద బారులు తీరారు. చాలామంది తమ ఇళ్లను వదిలేసి పార్కులు, బహిరంగ ప్రదేశాలకు వెళ్లిపోతున్నారు. తమ పౌరులను అప్ఘాన్ నుంచి వెనక్కి రప్పించేందుకు అమెరికాతో సహా పలు దేశాలు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి.
Afghan Presidential Palace : అప్ఘానిస్తాన్ అధ్యక్ష భవనాన్ని సీజ్ చేసిన తాలిబన్లు