కరోనాపై యుద్ధంలో భారత సహాయాన్ని కోరింది అమెరికా. కరోనా ట్రీట్మెంట్ కు మలేరియా ట్రీట్మెంట్ లో వాడే ‘హైడ్రాక్సీ క్లోరోక్విన్’ సమర్థవంతంగా పనిచేస్తోందని ఇటీవల అమెరికా అధ్యక్షడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే. హైడ్రాక్సీక్లోరోక్విన్ ను కరోనా ట్రీట్మెంట్ కు ఉపయోగించేందుకు FDA కూడా ఆమోదం తెలిపింది. తాము కూడా కరోనా ట్రీట్మెంట్ లో హైడ్రాక్సీక్లోరోక్విన్ వాడామని, సమర్ధవంతంగా పని చేసిందని చైనా అధికార మీడియా జిన్హువా ఫిబ్రవరిలోనే ప్రకటించిన విషయం తెలిసిందే. దక్షిణ కొరియా, బెల్జియం కూడా ఇదే డ్రగ్ ను వాడుతున్నట్లు తెలిపింది.
కరోనా ట్రీట్మెంట్ కు చాలా దేశాలు ఇప్పుడు యాంటీ మలేరియా డ్రగ్ హైడ్రాక్సీక్లోరోక్విన్ ను వాడుతున్న విషయం తెలిసిందే. కరోనా వైరస్ నివారణకు ప్రివెంటివ్ ఔషధంగా హైడ్రాక్సిక్లోరోక్విన్ వాడకాన్ని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ (ICMR) కూడా ఇప్పటికే అనుమతించింది. అయితే అమెరికాలో హైడాక్రీక్లోరోక్విన్ ట్యాబ్లెట్ల కొరత చాలానే ఉంది. ఈ డ్రగ్ చాలినంతగా అందుబాటులో లేకపోవడం వల్ల అమెరికా ఇబ్బందులను ఎదుర్కొంటోంది. దీంతో భారత సాయం కోరింది అగ్రరాజ్యం.
హైడ్రాక్సీక్లోరోక్విన్ ట్లాబెట్లను వెంటనే అమెరికాకు సఫ్లయ్ చేయాలని తాను భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీని కోరినట్లు శనివారం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. కరోనా వైరస్ విజృంభిస్తుండటంతో భారత ప్రధానమంత్రి మోడీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ శనివారం టెలీఫోన్ సంభాషణ జరిపారు. కరోనా వైరస్ ను నియంత్రించడంపై ఫోన్ లో ఇరువురు సుదీచర్ఘంగా చర్చించుకున్నారు.
అయితే భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీతో ఫోన్ లో మాట్లాడిన అనతంరం వైట్ హౌస్ లో కరోనా వైరస్ టాస్క్ ఫోర్స్ తో ట్రంప్ మాట్లాడుతూ…హైడ్రాక్సీక్లోరోక్విన్ ట్లాబెట్లు సప్లయ్ చేయాలని భారత ప్రధాని మోడీని కోరాను. హైడ్రాక్సీక్లోరోక్విన్ ట్యాబెట్ల ఎగుమతులను భారత్ ఆపివేసినప్పటికీ, భారత ప్రధాని నరేంద్ర మోడీతో ఈ రోజు ఫోన్ లో మాట్లాడిన తరువాత, హైడ్రాక్సీక్లోరోక్విన్ ట్యాబెట్ల కోసం అమెరికా ఆర్డర్ తో వాటిని విడుదల చేయడానికి భారత్ తీవ్రంగా పరిశీలిస్తోందని ట్రంప్ అన్నారు.
యాంటీ మలేరియన్ డ్రగ్… హైడ్రొక్సిక్లొరోక్విన్ అవసరాలు 130కోట్లమంది ఉన్న భారత్‌కు కూడా ఉంటుందని, అయినప్పటికీ.. తమకూ ఆ మందుల అవసరాలు ఉన్నాయని ట్రంప్ చెప్పారు. భారత్ దగ్గర చాలా హైడ్రాక్సీక్లోరోక్విన్ ట్యాబెట్లు ఉన్నాయన్న ట్రంప్…కరోనా ట్రీట్మెంట్ కోసం వ్యూహాత్మక జాతీయ నిల్వల ద్వారా (స్ట్రాటజిక్ నేషనల్ స్టాక్‌పైల్) ద్వారా ఆ ట్యాబ్లెట్లు విడుదల చేయబడుతాయని ట్రంప్ అన్నారు. మలేరియా చికిత్సలో భాగంగా తొలిసారిగా ఈ మందును 1944లో ఉపయోగించారు. ఆ తర్వాత కాలంలో ఓ రకం కాలేయ వ్యాధి కూడా వాడేవారు.
కరోనా వైరస్‌పై భారత్ అద్భుతమైన పోరాటాన్ని కొనసాగిస్తోందని ట్రంప్ ప్రశంసించారు. 130 కోట్ల మంది భారతీయులను ఒక్క పిలుపుతో నరేంద్ర మోడీ ఏకతాటిపైకి తీసుకొచ్చారని అన్నారు. 21 రోజుల పాటు లాక్‌డౌన్ విధించిన ప్రస్తుత పరిస్థితుల్లో భారతీయులు చూపిన సంయమనం అద్వితీయమని చెప్పారు.
ఇక శనివారం ఒకేరోజు 34 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు అమెరికాలో నమోదయ్యాయి. అగ్రరాజ్యంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మూడు లక్షల మార్క్ దాటిపోయింది. ఇప్పటివరకు అమెరికాలో 3లక్షల 11వేల 625 కరోనా కేసులు నమోదుకాగా,8వేల 454మంది మరణించారు.