H-1B Visa Fee
H-1B Visa Fee : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతీయులకు బిగ్ షాకిచ్చాడు. హెచ్-1బీ వీసాల విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. హెచ్-1బీ వీసా దరఖాస్తులపై వార్షిక రుసుంను లక్ష డాలర్లుగా నిర్ణయిస్తూ కార్యనిర్వాహక ఉత్తర్వుపై ట్రంప్ సంతకం చేశారు.
Also Read: MobiKwik: రూ.40 కోట్ల భారీ ఆర్థిక మోసం.. అది నిజమే..! మొబిక్విక్ అంగీకారం..
డొనాల్డ్ ట్రంప్ తాజా నిర్ణయంతో అమెరికా వేదికగా పనిచేస్తున్న కంపెనీలు విదేశీ నిపుణులను నియమించుకునేందుకు జారీ చేసే ఒక్కొక్క వీసాపై ఏడాదికి లక్ష డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. ట్రంప్ నిర్ణయంతో అమెరికాలో ఉద్యోగాలు చేయాలని కలలు కంటున్న భారతీయులపై పిడుగుపాటులా పరిణమించిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
‘‘ప్రతి హెచ్-1బీ వీసాపై ఏటా లక్ష డాలర్లు రుసుం విధించడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని పెద్ద కంపెనీలకు వివరించాం’’ అని అమెరికా వాణిజ్య కార్యదర్శి హోవార్ట్ లుట్నిక్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అంతేకాక.. మీరు ఎవరికైనా శిక్షణ ఇవ్వదలుచుకుంటే ఇటీవల మన దేశంలో గొప్ప యూనివర్శిటీల నుంచి పట్టభద్రులైన మన వారికి ఇవ్వండి. అమెరికన్లకు ట్రైనింగ్ ఇవ్వండి. మన ఉద్యోగాలను కొల్లగొడుతున్న వారిని ఇతర దేశాల నుంచి తీసుకురావడం ఆపండి అంటూ హోవార్డ్ లుట్నిక్ పేర్కొన్నారు.
1990లో హెచ్-1బీ వీసా అమల్లోకి తీసుకొచ్చారు. యూఎస్‌లోని టెక్నాలజీ కంపెనీలు అత్యంత నైపుణ్యం కలిగిన విదేశీ నిపుణుల కోసం ఈ వీసాలను జారీ చేస్తాయి. వీటిని మూడు నుంచి ఆరేళ్ల మధ్య కాలానికి మంజూరు చేస్తారు. హెచ్-1బీ వీసా దారుల్లో భారతదేశం 71శాతం వాటా కలిగి ఉంది. చైనా 11.7శాతం వాటా కలిగి ఉంది. ప్రస్తుతం హెచ్-1బీ వీసా దరఖాస్తుదారులకు లాటరీ విధానం ఉంది. అమెరికా ప్రతీయేటా 85వేల వీసాలను లాటరీ విధానం ద్వారా జారీ చేస్తోంది. లాటరీ ప్రక్రియకు 215డాలర్లు రిజిస్ట్రేషన్ ఫీజు, ఫారమ్ 1-129కోసం 780 డాలర్లు పిటిషన్ దాఖలు ఫీజు, ఇతర ఖర్చులతో పాటు ఉన్నాయి. లాటరీలో ఎంపికైతే అదనపు ఛార్జీలు చెల్లించాలి. అయితే, ప్రస్తుతం ట్రంప్ తీసుకున్న నిర్ణయం దిగ్గజ కంపెనీలపై పెనుభారం పడనుంది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. గోల్డ్ కార్డునుసైతం ప్రకటించారు. దీనికి 10లక్షల డాలర్లుగా నిర్ణయించారు. ఈ గోల్డ్ కార్డు ద్వారా అమెరికాకు 100 బిలియన్ డాలర్లు సమకూరే అవకాశం ఉంది. పన్నుల తగ్గింపు, అభివృద్ధి ప్రాజెక్టులకు, రుణాల చెల్లింపులకు గోల్డ్ కార్డు నిధులు వినియోగించనున్నట్లు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే ప్రకటించారు.