MobiKwik: రూ.40 కోట్ల భారీ ఆర్థిక మోసం.. అది నిజమే..! మొబిక్విక్ అంగీకారం..
ఈ మోసం కేసులో ఇప్పటివరకు ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితులను నుహ్ జిల్లాలోని రేవాసన్ గ్రామానికి చెందిన

MobiKwik: యాప్ లో సాంకేతిక లోపాన్ని కేటుగాళ్లు సొమ్ము చేసుకున్నారు. దాన్ని దుర్వినియోగం చేశారు. అలా 10 కాదు 20 కాదు ఏకంగా 40 కోట్ల రూపాయల భారీ ఆర్థిక మోసానికి పాల్పడ్డారు. మోబిక్విక్ యాప్‌లో వెలుగుచూసి ఈ భారీ మోసం కలకలం రేపింది. ఈ ఘటన ఫిన్‌టెక్ ప్లాట్‌ఫామ్‌ల భద్రతపై తీవ్ర ఆందోళనలు రేకెత్తించింది.
హర్యానాలోని ఒక జిల్లాలో గత వారం సాంకేతిక లోపం కారణంగా అనధికార చెల్లింపులు జరిగాయని ఫిన్‌టెక్ సంస్థ వన్ మోబిక్విక్ సిస్టమ్స్ గురువారం ధృవీకరించింది. ఆర్థిక ప్రభావాన్ని తగ్గించేలా పరిష్కార చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. ఈ సంఘటన UPI, వాలెట్ చెల్లింపులు లేదా వినియోగదారు ఖాతా బ్యాలెన్స్‌లపై ఎటువంటి ప్రభావం చూపలేదని కంపెనీ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది.
“సెప్టెంబర్ 11-12, 2025న ఒక సాంకేతిక సమస్య కారణంగా కొన్ని విఫలమైన లావాదేవీలు విజయవంతమైనవిగా తప్పుగా గుర్తించబడ్డాయి. ఫలితంగా హర్యానాలోని నుహ్ జిల్లా చుట్టుపక్కల ఉన్న కొంతమంది వ్యాపారులకు అనధికార చెల్లింపులు జరిగాయని MobiKwik ధృవీకరిస్తుంది. ఈ ప్రాంతానికి చెందిన కొంతమంది వ్యాపారులు, వినియోగదారులు అనవసరమైన ఆర్థిక ప్రయోజనం పొందడానికి ఈ సమస్యను ఉపయోగించుకున్నారు” అని తెలిపింది.
“సెప్టెంబర్ 12 తెల్లవారుజామున మోసాన్ని గుర్తించిన వెంటనే.. కంపెనీ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. 45 నిమిషాల్లో సమస్యను పరిష్కరించింది. మొత్తం ఆర్థిక ప్రభావాన్ని నియంత్రించి లెక్కించారు. ఈ మోసంలో ఉద్యోగులు, నిర్వహణ సిబ్బంది లేదా అంతర్గత వ్యక్తులు ఎవరూ పాల్గొనలేదు” అని పేర్కొంది. అప్పటి నుండి పర్యవేక్షణ వ్యవస్థలను బలోపేతం చేసి, అదనపు నియంత్రణ చర్యలను అమలు చేశామని మోబిక్విక్ వెల్లడించింది.
అనధికార సెటిల్‌మెంట్లు జమ చేయబడిన అన్ని బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేసేలా లీగల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీ (LEA) చర్యలు తీసుకుందని కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది.
“ప్రాథమిక డేటా ఆధారంగా రూ. 40 కోట్ల మొత్తానికి ఎఫ్ఐఆర్ నమోదు చేయబడింది. అందులో, కంపెనీ దాదాపు రూ. 14 కోట్లు రికవరీ చేసింది. పూర్తి మొత్తాన్ని తిరిగి పొందడానికి చట్టపరమైన చర్యలను అనుసరిస్తాం” అని వివరించింది.
ఈ మోసం కేసులో ఇప్పటివరకు ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితులను నుహ్ జిల్లాలోని రేవాసన్ గ్రామానికి చెందిన రెహాన్, నుహ్ లోని కామెడా గ్రామానికి చెందిన వకార్ యూనస్, మొహమ్మద్ అమీర్, మొహమ్మద్ అన్సార్.. నుహ్ లోని మరోడా గ్రామానికి చెందిన వసీం అక్రమ్.. పాల్వాల్ జిల్లాలోని ఉతావాడ్ గ్రామానికి చెందిన మొహమ్మద్ సకిల్ గా గుర్తించారు.
“విచారణ సమయంలో, మోబిక్విక్ యాప్‌లో కొంత సాంకేతిక లోపం కారణంగా, ఒకరి బ్యాంక్ ఖాతాలో లేదా మోబిక్విక్ వాలెట్‌లో ఏదైనా బ్యాలెన్స్ ఉందా లేదా అనే దానితో సంబంధం లేకుండా యాప్ ద్వారా జరిగే అన్ని లావాదేవీలు విజయవంతంగా పూర్తవుతున్నాయని నిందితులు వెల్లడించారు. యాప్‌లో తప్పు పాస్‌వర్డ్ నమోదు చేసిన తర్వాత కూడా, లావాదేవీలు విజయవంతంగా పూర్తవుతున్నాయి. “నిందితుడు అన్యాయమైన లాభాలు సంపాదించడానికి మోసం చేశాడు. డబ్బు బదిలీ చేయబడిన దాదాపు 2,500 మంది వ్యక్తుల బ్యాంకు ఖాతాలను స్తంభింపజేసారు” అని గురుగ్రామ్ పోలీసు ప్రతినిధి తెలిపారు.
“నిందితుడు అక్రమార్జన కోసం మోసం చేశాడు. డబ్బు బదిలీ చేయబడిన దాదాపు 2,500 మంది వ్యక్తుల బ్యాంకు ఖాతాలను స్తంభింపజేశారు” అని గురుగ్రామ్ పోలీసులు తెలిపారు. నిందితులను పోలీసులు కోర్టులో హాజరుపరిచగా.. కోర్టు జ్యుడీషియల్ కస్టడీ విధించింది.
మొబిక్విక్ యాప్‌లోని లోపం వల్ల బ్యాంకు అకౌంట్ లో లేదా వాలెట్ లో తగినంత బ్యాలెన్స్ లేకున్నా లేదా తప్పు పాస్‌వర్డ్ ఎంటర్ చేసినా లావాదేవీ సక్సెస్ అయినట్లు రికార్డ్ అవుతున్నాయి. కొందరు కేటుగాళ్లు ఈ లోపాన్ని దుర్వినియోగం చేశారు. తమ బ్యాంకు ఖాతాలకు డబ్బు బదిలీ చేసుకున్నారు. దీని వల్ల రూ.40 కోట్ల మేర భారీ మోసం జరిగింది.