‘బిగ్ బ్యూటిఫుల్ బిల్లు’కు రాజముద్ర.. ఈ బిల్లుతో ప్రజలకు కలిగే లాభాలు, నష్టాలు ఇవే..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన పంతం నెగ్గించుకున్నాడు. తన కలల బిల్లు చట్టంగా మారింది.

Donald Trump

One Big Beautiful Bill: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన పంతం నెగ్గించుకున్నాడు. తన కలల బిల్లు చట్టంగా మారింది. పన్నుల్లో కోతలు, వ్యయ నియంత్రణల కోసం తీసుకొచ్చిన వన్ బిగ్ బ్యూటీఫుల్ బిల్లుపై రిపబ్లికన్ పార్టీ సభ్యులు, అధికారులు హర్షాతిరేకాల మధ్య ట్రంప్ సంతకం చేశారు. దీంతో ఈ బిల్లు చట్ట రూపం దాల్చింది.

Also Read: 2030 నాటికి AIతో మనిషి జీవితకాలం పెరుగుతుందా.. వృద్ధాప్యం దరిచేరకుండా 200ఏళ్లు జీవించి ఉండొచ్చా..! సంచలన విషయాలు వెలుగులోకి..

సుదీర్ఘ చర్చ అనంతరం జరిగిన ఓటింగ్ లో బిల్లుకు అనుకూలంగా 218, వ్యతిరేకంగా 214 ఓట్లు వచ్చాయి. ప్రతినిధుల సభలో బిల్లును ఇద్దరు రిపబ్లికన్లు వ్యతిరేకించారు. ఈ బిల్లుపై సంతకం పెట్టిన తరువాత ట్రంప్ మాట్లాడుతూ.. సాయుధ బలగాల నుంచి మొదలు రోజువారీ కార్మికుల వరకు కొత్త చట్టం మద్దతుగా ఉంటుందని చెప్పారు. అమెరికా చరిత్రలోనే తమ ప్రభుత్వం అతిపెద్ద పన్నుకోత, వ్యయకోత, సరిహద్దు భద్రతతో అతిపెద్ద పెట్టుబడి సాధించిందని ట్రంప్ చెప్పారు.


వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ లో ఏముంది..?
♦ బిగ్ బ్యూటీఫుల్ బిల్లులో ప్రభుత్వ వ్యయాన్ని భారీగా తగ్గించడం, వలస చట్టాలను అమలు చేయడానికి కావాల్సిన కఠినమైన కొత్త విధానాలకు నిధులు సమకూర్చడం, పలు పన్ను కోతలను శాశ్వతం చేయడం వంటివి ఉన్నాయి.
♦ ట్రంప్ తొలిసారి అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ప్రవేశపెట్టిన పన్ను కోతలను ఈ బిల్లు శాశ్వతం చేస్తుంది.
♦ అమెరికాలో తయారైన కార్ల కొనుగోలుపై తీసుకున్న రుణాలపై చెల్లించే వడ్డీకి తాత్కాలిక పన్ను మినహాయింపులు ఉంటాయి.
♦ ఏడాదికి 75వేల డాలర్ల కంటే తక్కువ సంపాదించే వృద్ధులకు 6వేల డాలర్ల వరకు పన్ను రాయితీ లభిస్తుంది.
♦ చైల్డ్ టాక్స్ క్రెడిట్ 2వేల డాలర్ల నుంచి 2,200 డాలర్లకు పెరగనుంది.
♦ దేశ సరిహద్దు, జాతీయ భద్రతా ఎజెండా కోసం సుమారు 350 బిలియన్ డాలర్లను కేటాయించనున్నారు.
♦ 350 బిలియన్ డాలర్లలో యూఎస్, మెక్సికో సరిహద్దు గోడ నిర్మాణానికి 46బిలియన్ల డాలర్లు, వలసదారుల నిర్భంధ సౌకర్యాల కోసం 45 బిలియన్ల డాలర్లు ఖర్చు చేయొచ్చు.
♦ సిబ్బంది శిక్షణ, నియామకానికి 30 బిలియన్ల డాలర్లు కేటాయించారు.
♦ ఈ బిల్లులో విధించిన పని నిబంధనలతో సుమారు 1.2 కోట్ల మంది తమ వైద్య బీమా కోల్పోయే ప్రమాదం ఉంది.
♦ ఈ చట్టం అమల్లోకి రావడంతో బైడెన్ హయాంలో ప్రవేశపెట్టిన గ్రీన్ ఎనర్జీ పథకాలు నిలిచిపోయాయి.
♦ అమెరికాలో కార్పొరేట్ కంపెనీలు, ఉన్నత ఆధాయ వర్గాలు, టిప్/ఓవర్‌టైమ్ వేతనదారులకు ఈ బిల్లు లాభదాయంకంగా ఉంటుంది.
♦ తక్కువ ఆదాయం గల కుటుంబాలు, వలసదారులు, పునరుత్పాదక రంగం నష్టపోయే ప్రమాదం ఉంది.