Donald Trump
Donald Trump: అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తొలిరోజు పలు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకాలు చేశారు. అందులో పలు కీలకమైన ఆర్డర్లు ఉన్నాయి. జో బైడెన్ హయాంలో తీసుకున్న 78 నిర్ణయాలను రద్దు చేస్తూ ట్రంప్ తొలి సంతకం చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) సభ్యత్వం నుంచి వైదొలుగుతూ సంతకం చేసిన ట్రంప్.. యూఎస్ క్యాపిటల్ పై దాడి చేసిన తన మద్దతుదారులకు ఉపశమనం కల్పించారు. ఈ మేరకు ఆయన ఎగ్జిక్యూటీవ్ ఆర్డర్లపై సంతకాలు చేశారు.
ట్రంప్ వాషింగ్టన్ డీసీ క్యాపిటల్ హిల్ భవనంలో అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారోత్సవం అనంతరం అక్కడే పలు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై ట్రంప్ సంతకాలు చేశారు. ఆ తరువాత వైట్ హౌస్ కు వెళ్లిన ట్రంప్ అక్కడ మరికొన్ని కీలకమైన నిర్ణయాలకు సంబంధించి ఆర్డర్లను జారీ చేశారు.
తొలిరోజు ట్రంప్ జారీచేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు..
♦ జో బైడెన్ హయాంలో తీసుకున్న 78 నిర్ణయాలను రద్దు చేస్తూ డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు.
♦ 2021 జనవరి 6న క్యాపిటల్ హిల్ భవనంపై దాడి కేసులో దోషులుగా తేలిన సుమారు 1500 మందికి ట్రంప్ క్షమాభిక్ష కల్పించారు. వారిపై పెండింగ్ లో ఉన్న కేసులు కొట్టివేయాలని అటార్నీ జర్నల్ కు ఆదేశాలు జారీ చేశారు.
♦ ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) నుంచి అమెరికా వైదొలుగుతున్నట్లు ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు.
♦ పారిస్ ఒప్పందం నుంచి అమెరికా వైదొలుగుతున్నట్లు ట్రంప్ ప్రకటించారు. అందుకు సంబంధించిన దస్త్రంపై సంతకం చేశారు.
♦ చైనా కంపెనీ టిక్ టాక్ కు ట్రంప్ సర్కార్ 75రోజుల సమయం ఇచ్చింది. టిక్ టాక్ నిషేధాన్ని 75రోజుల పాటు నిలిపివేస్తూ ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై సంతకం చేశారు. ఈ యాప్ లో అమెరికాకు 50శాతం వాటా ఉండాలని ట్రంప్ ఇప్పటికే వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.
♦ పాలనపై పట్టుసాధించే వరకు అధికారులు కొత్తగా ఎలాంటి నియంత్రణలు విధించే అవకాశం లేకుండా నిరోధించే ఆర్డర్ పై ట్రంప్ సంతకం చేశారు. అదేవిధంగా ఫెడరల్ ప్రభుత్వ ఉద్యోగుల నియామకాలను నిలిపివేస్తూ ట్రంప్ ఆర్డర్ జారీ చేశారు. అయితే, మిలిటరీ, మరికొన్ని విభాగాల్లో నియామకాలకు మినహాయింపు ఉంటుంది.
♦ పారిస్ ఒప్పందం నుంచి అమెరికా వైదొలుగుతున్నట్లు సంబంధిత ఫైలుపై ట్రంప్ సంతకం చేశారు.
♦ ప్రభుత్వ ఉధ్యోగులు కచ్చితంగా కార్యాలయాలకు వచ్చి విధుల్లో హాజరు కావాలని ఆదేశాలు.
♦ మెక్సికో అక్రమ వలసలు అడ్డుకునేలా అమెరికా దక్షిణ సరిహద్దుల్లో నేషనల్ ఎమర్జెన్సీ విధిస్తున్నట్లు ప్రకటన.
♦ కెనడా మెక్సికోలపై ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 25శాతం అదనపు సుంకాలు విధించనున్నట్లు అల్టిమేటమ్ జారీ.
♦ బైడెన్ కార్యవర్గం వాక్ స్వేచ్ఛపై నియంత్రణ విధించడంపై సీరియస్ అయిన ట్రంప్.. దర్యాప్తునకు ఆదేశాలు జారీ.
వీటితోపాటు పలు ఫైళ్లపై ట్రంప్ సంతకాలు చేశారు.
President Trump: 25% tariffs on each of Canada and Mexico beginning February 1st. pic.twitter.com/ncfBmMI242
— Stephen Taylor (@stephen_taylor) January 21, 2025