earthquake kills 24 in Turkey : టర్కీ, గ్రీస్ దేశాలను భారీ భూకంపం కుదిపేసింది. ఏజియన్ సముద్రంలో సంభవించిన భూకంపం కారణంగా చిన్నపాటి సునామీ సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 7గా నమోదైంది. టర్కీలోని మెట్రోపాలిటన్ నగరమైన ఇజ్మిర్‌లో భారీగా ఆస్తి నష్టం జరిగింది. టర్కీలో భూకంపం ధాటికి ఇప్పటి వరకు 24 మంది మృతి చెందగా..500 మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
అయితే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అక్కడి మీడియా వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం టర్కీ తీర ప్రాంతం, సామోస్‌లకు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా టర్కీలోని ప్రధాన నగరాల్లో ఒకటైన ఇజ్మిర్ పట్టణంలో పలు ప్రాంతాల్లో భవనాలు నేలమట్టమయ్యాయి. భూంకంపం కారణంగా సంభవించిన చిన్నపాటి సునామీతో సముద్ర తీర ప్రాంతంలో ఉన్న ఇళ్లలోకి భారీగా నీరు వచ్చింది.
కొన్ని చోట్ల భవనాలు కుప్పకూలడంతో వాహనాలు ధ్వంసమయ్యాయి. టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌లోనూ భూప్రకంపనలు సంభవించాయి. గ్రీస్ రాజధాని ఏథెన్స్‌లోనూ భూప్రకంపనలు సంభవించాయి. ఎర్త్ క్వేక్ సంభవించిన క్షణాల్లోనే ఇజ్మీర్ ప్రాంత ప్రజలంతా.. ఇళ్లను వదిలి వీధుల్లోకి వచ్చేశారు. మరోవైపు భవన శిథిలాల్లో చిక్కుకున్న వారిని బయటకు తెచ్చేందుకు..రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.
https://10tv.in/greece-turkey-earthquake-people-rescued-from-rubble-after-massive-7-0-magnitude-tremor-destroys-buildings/
టర్కీలో గతంలోనూ భూకంపాలు ఎంతో మంది ప్రాణాలను బలితీసుకున్నాయి. ఈ ఏడాది జనవరిలో ఇలాజిగ్ ప్రావిన్స్‌లో సంభవించిన భూకంపంలో 30 మందికి పైగా మృతి చెందగా..1600 మందికి పైగా గాయపడ్డారు. ఇక 1999లో ఇస్తాంబుల్ సమీపంలోని ఇజ్మిట్ నగరంలో వచ్చిన భూకంపంలో ఏకంగా 17వేల మంది కన్నుమూశారు.