Afghanistan earthquake
Afghanistan Earthquake: అఫ్ఘానిస్థాన్ ఆగ్నేయ ప్రాంతంలో కొన్ని గంటల క్రితం 6.2 తీవ్రతతో శక్తిమంతమైన భూకంపం సంభవించిందని జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ తెలిపింది.
ఈ ప్రకంపనలు 10 కి.మీ లోతులో 34.57°N అక్షాంశం, 70.75°E రేఖాంశంలో నమోదయ్యాయని చెప్పింది. ఇటీవల అఫ్ఘానిస్థాన్ తూర్పు ప్రాంతంలో వరుసగా భూకంపాలు సంభవించడంతో 2,200 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.
అలాగే, 3,600 మందికి పైగా గాయపడ్డారు. అనేక గ్రామాలు నేలమట్టమైపోయాయి. సహాయక చర్యలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. తూర్పు పర్వత ప్రాంత గ్రామాల్లో శిథిలాల కింద నుంచి మృతదేహాలను వెలికితీస్తూనే ఉన్నారు.
ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతం, జమ్మూకశ్మీర్‌లో బలమైన ప్రకంపనలు వచ్చాయి. భవనాలు కంపించడంతో ప్రజలు జాగ్రత్త చర్యగా బయటకు పరుగులు తీశారు.
మొదటి భూకంపం 6.0 తీవ్రతతో, ఆదివారం రాత్రి కునార్, నంగర్‌హార్ ప్రావిన్సుల్లో సంభవించి పలు గ్రామాలను నేలమట్టం చేసింది. మంగళవారం 5.5 తీవ్రతతో రెండో భూకంపం సంభవించి సహాయక చర్యలను మరింత కష్టతరం చేసింది. కొండచరియలు, పలు మార్గాలు మూసుకుపోయాయి.
నిన్న 6.2 తీవ్రతతో శక్తిమంతమైన భూకంపం సంభవించింది. ఇవాళ కూడా మరోసారి 4.9 తీవ్రతతో (రిక్టర్ స్కేలుపై) భూకంపం సంభవించిందని అఫ్ఘాన్ జాతీయ భూకంప శాస్త్ర కేంద్రం (ఎన్‌సీఎస్) తెలిపింది.
ఇస్లామిక్ రిలీఫ్ అంచనాల ప్రకారం.. కునార్ ప్రావిన్స్‌లో 98% భవనాలు ధ్వంసం అయ్యాయి. అధికారులు 6,700 ఇళ్లకు పైగా కూలిపోయాయని అంచనా వేశారు.