Narendra Modi: ఎలాన్ మస్క్ ముగ్గురు పిల్లలతో ప్రధాని మోదీ ముచ్చట్లు.. ఫొటోలు, వీడియో వైరల్ .. మోదీకి మస్క్ స్పెషల్ గిఫ్ట్

అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కేబినెట్ లో కీలక పాత్ర పోషిస్తున్న స్పేస్ ఎక్స్ సీఈవో, అమెరికా డోజ్ అధినేత ఎలాన్ మస్క్ ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు.

PM Narendra Modi and Tesla CEO Elon Musk

Elon Musk: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారి ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనకు వెళ్లారు. ఫ్రాన్స్ నుంచి బుధవారం నేరుగా అమెరికా చేరుకున్న మోదీ.. వాషింగ్టన్ లో దేశాధ్యక్షుడి అతిథిగృహమైన బ్లేయర్ హౌస్ లో బస చేశారు. ఈ క్రమంలో మోదీకి భారత సంతతి అమెరికన్లు అక్కడికి చేరుకొని ఘన స్వాగతం పలికారు. భారత్ మతాకీ జై, వందేమాతరం.. మోదీ.. మోదీ అంటూ నినాదాలతో హోరెత్తించారు.

Also Read: Trump: భారతీయులకు ట్రంప్‌ మరో షాక్‌.. అమెరికా వర్క్‌ స్కీమ్స్‌ కఠినతరం? ఇప్పుడు వీరి పరిస్థితి ఏంటి?

ట్రంప్ కేబినెట్ లో కీలక పాత్ర పోషిస్తున్న స్పేస్ ఎక్స్ సీఈవో, అమెరికా డోజ్ అధినేత ఎలాన్ మస్క్ మోదీతో భేటీ అయ్యారు. మోదీ బస చేసిన ప్రఖ్యాత బ్లేయర్ హౌస్ కు ఆయన గురువారం తన ముగ్గురు పిల్లలతో కలిసి వచ్చారు. ఈ సందర్భంగా మస్క్ ముగ్గురి పిల్లలు ఎక్స్, స్ట్రైడర్, అజూర్ లతో ప్రధాని నరేంద్ర మోదీ సరదాగా ముచ్చటించారు. మోదీతో మస్క్ చర్చలు జరుపుతుండగా పక్కనే కూర్చొని ఉన్న ముగ్గురు పిల్లలూ ఆసక్తిగా తిలకిస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముగ్గురు పిల్లలతో ప్రధాని మోదీ సరదాగా ముచ్చటిస్తున్న సమయంలో మస్క్ ఆసక్తిగా గమనిస్తున్న ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఉన్నత స్థాయి సమావేశాలకుసైతం తన పిల్లలను వెంటబెట్టుకు వెళ్లడం మస్క్ ప్రత్యేకత.

 

ఇదిలాఉంటే.. ప్రధాని మోదీకి ఎలాన్ మస్క్ ప్రత్యేక గిఫ్ట్ ఇచ్చారు. ఆ తరువాత మస్క్ ముగ్గురు పిల్లలకు మోదీ ప్రత్యేకమైన బహుమతులు అందజేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మస్క్ తో భేటీలో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ కూడా పాల్గొన్నారు.

 

‘‘అంతరిక్ష రంగం, రవాణా, సాంకేతికత, నూతన ఆవిష్కరణలు మస్క్ తో సుహృద్భావపూర్వక భేటీలో చర్చకు వచ్చాయి. మస్క్ అమితాసక్తి చూపే ఈ అంశాలపై ఆయనతో లోతుగా చర్చించా. పాలనా యంత్రాంగంలో భారత్ తలపెట్టిన సంస్కరణల గురించి వివరించా. అతితక్కువ ప్రభుత్వ జోక్యం.. హెచ్చుగా పాలన అవే మా లక్ష్యం’’ అంటూ ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ లో పేర్కొన్నాడు. ఎలక్ట్రిక్ వాహనాలతో పాటు అంతరిక్ష రంగాల్లో భారత్ కీలకంగా మారుతున్న తరుణంలో మోదీ, మస్క్ ల భేటీతో భారత్ మార్కెట్ తో మస్క్ కంపెనీల బంధం బలోపేతం అవుతుందని భావిస్తున్నారు.

 

ప్రధాని మోదీతో మస్క్ భేటీ కావడంతో.. మస్క్ ఉపగ్రహ ఇంటర్నెట్ సర్వీస్ కంపెనీ స్టార్ లింక్ భారతదేశంలోకి ప్రవేశించే అంశంపై వీరి మధ్య చర్చలు జరిగి ఉండవచ్చునని ప్రచారం జరుగుతుంది. స్టార్ లింక్ చాలాకాలం క్రితమే ఇండియాలో ఉపగ్రహ ఇంటర్నెట్ సేవకోసం దరఖాస్తు చేసుకుంది. కానీ, ప్రభుత్వం నుంచి ఇంకా ఆమోదం పొందలేదు.