Facebook : ఫేస్‌బుక్ నుంచి అదిరిపోయే ఫీచర్లు, ఇక మరింత సేఫ్టీ

యాప్ ఏదైనా.. యూజర్ ప్రైవసీకి భద్రత చాలా ముఖ్యం. ప్రైవసీకి భద్రత లేదని తెలిస్తే ఆ యాప్ జోలికి వెళ్లను కూడా వెళ్లరు. ఈ మధ్య కాలంలో యూజర్ ప్రైవసీ సేఫ్టీ

Facebook New Feature

Facebook New Feature : యాప్ ఏదైనా.. యూజర్ ప్రైవసీకి భద్రత చాలా ముఖ్యం. ప్రైవసీకి భద్రత లేదని తెలిస్తే ఆ యాప్ జోలికి వెళ్లను కూడా వెళ్లరు. ఈ మధ్య కాలంలో యూజర్ ప్రైవసీ సేఫ్టీ గురించి పెద్దఎత్తున చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో సోషల్ మీడియా సంస్థలు కూడా ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నాయి. యూజర్ ప్రైవసీ సేఫ్టీ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాయి.

తాజాగా సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ సైతం ఆ దిశగా చర్యలు తీసుకుంది. యూజర్ల కోసం అద్భుతమైన ఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది. అందులో ఒకటి ఎండ్‌-టూ-ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌. వాట్సాప్‌ యాప్‌లో వాయిస్‌, వీడియో కాల్స్‌కు ఉండే ఎండ్‌-టూ-ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌ గురించి తెలిసిందే. ప్రస్తుతం ఫేస్‌బుక్‌ మెసెంజర్‌ యాప్‌లో కూడా ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది. దీంతో యూజర్ల ప్రైవసీకి మరింత భద్రత చేకూరనుంది. కాగా గతంలోనే వాట్సాప్‌, ఫేస్‌బుక్‌ మెసేంజర్లలోని యూజర్లకు పంపే మెసేజ్‌లకు ఎండ్‌-టూ-ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌ను ఫేస్‌బుక్‌ ఏర్పాటు చేసింది. ఇప్పుడు వాయిస్, వీడియో కాల్స్ కు వర్తింపజేయనుంది.

సోషల్ మీడియా దిగ్గజం మెసేజింగ్ సేవల పోర్ట్‌ఫోలియోలో క్రమంగా ఆడియో, వీడియో ఫీచర్‌లను జోడించింది. “ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్ట్ లో భాగంగా సందేశాలు, కాల్‌ కంటెంట్ మీ ఫోన్‌ నుంచి రిసీవర్‌కు చేరుకునే వరకు భద్రంగా ఉంటుంది. అంతేకాకుండా ఫేస్‌బుక్ తన ప్రసిద్ధ ఇమేజ్-షేరింగ్ యాప్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరితో ఒకరు సంభాషణల కోసం ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ను ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

రాబోయే రోజుల్లో ఫేస్‌బుక్‌ మెసేంజర్‌లోని గ్రూప్‌ చాట్లకు కూడా ఎండ్‌-టూ-ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌ తీసుకురావాలని ఫేస్‌బుక్‌ చూస్తుంది. దాంతో పాటుగా మెసేంజర్‌లో సందేశాలను నిర్ణీత సమయం వరకు కనిపించేలా, తరువాత ఆ మెసేజ్‌లు కన్పించకుండా నియత్రించవచ్చు. మెసేంజర్‌లో పంపే సందేశాలకు 5 సెకన్ల నుంచి 24 గంటలపాటు టైమర్‌ను ఉపయోగించి మెసేజ్‌లను పంపొచ్చు.

ఎండ్‌-టూ-ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌ తో యూజర్ల వ్యక్తిగత చాట్ సేఫ్ గా ఉంటుంది. హ్యాకర్లు, సైబర్ క్రిమినల్స్ బారిన పడదు. ఎన్ క్రిప్టడ్ చాట్ ను యాక్సెస్ చేయడం హ్యాకర్ల వల్ల కాదు. చివరికి ఫేస్ బుక్ కూడా ఆ పని చెయ్యలేదు.

‘2016 నుంచి ఎండ్ టు ఎండ్ ఎన్ క్రిప్షన్ ద్వారా టెక్ట్స్ చాట్స్ కు భద్రత కల్పిస్తున్నాం. గత ఏడాది కాలంగా వాయిస్, వీడియో కాల్స్ బాగా పెరగడం మేము గమనించాము. మెసేంజర్ లో రోజుకు 150 మిలియన్ల వీడియో కాల్స్ ఉంటున్నాయి. చాటింగ్ టెక్ట్స్ కు ఇప్పటికే భద్రత కల్పించాము. ఇప్పుడు అదే టెక్నాలజీతో వాయిస్, వీడియో కాల్స్ కు భద్రత కల్పిస్తాము’ అని ఫేస్ బుక్ తన బ్లాగ్ లో తెలిపింది.