కరోనాను జయించిన కెనడా ప్రధాని భార్య

కరోనా వైరస్(COVID-19) బారిన పడిన కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడూ భార్య సోఫి గ్రెగోరి ట్రూడూ కోలుకున్నారు. ప్రస్తుతం తాను చాలా బెటర్ గా ఫీల్ అవుతున్నట్లు తన ఫిజీషియన్ నుంచి,ఒట్టావా పబ్లిక్ హెల్త్ హాస్పిటల్ నుంచి అన్నీ క్లియర్ గా అందుకున్నట్లు ఆమె శనివారం తన ఫేస్ బుక్ ద్వారా తెలిపారు. తాను త్వరగా కోలుకోవాలని తమ వెల్ విషెస్ పంపిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వకంగా కృతజ్ణతలు అని ఆమె తెలిపారు. కరోనా సంక్షోభం నుంచి మనల్ని సైన్స్ మరియు కరుణ బయటపడేస్తుందని తాను బలంగా విశ్వసిస్తున్నానని ఆమె తెలిపారు.

హెల్త్ ప్రొటోకాల్స్ వినాలని,పాటించాలని,ప్రతి ఒక్కరూ తమ ఇళ్లకే పరిమితం అవ్వాలని ఆమె కోరారు. ఈ మేరకు ఆమె ఓ సెల్ఫ్ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కాగా ఇటీవల తన భర్తతో బ్రిటన్ వెళ్లివచ్చిన తర్వాత మార్చి-12న సోఫి గ్రెగోరి ట్రూడూకి కరోనా సోకినట్లు తేలింది. భార్యకు కరోనా సోకినట్లు తేలిన వెంటనే ముందుజాగ్రత్త చర్యగా ప్రధాని జస్టిన్ ట్రూడూ కూడా సెల్ఫ్ ఐసొలేట్ అయ్యారు. తన ఇంటి నుంచే జస్టిన్ ట్రూడూ..రోజూ మీడియకు అప్ డేట్స్ ఇస్తున్నారు.

14రోజుల సెల్ఫ్ క్వారంటైన్ ముగిసినప్పటికీ..తాను ఇంకా తన కుటుంబంతో కలిసి ఇంట్లోనే కొన్ని రోజులు క్వారంటైన్ ను కొనసాగించుకుంటున్నట్లు శనివారం జస్టిన్ ట్రూడూ తెలిపారు.హెల్త్ నిపుణుల సలహాలను తాము పాటిస్తూనే ఉన్నామని,ప్రతి ఒక్కరూ కూడా పాటించాలని,తప్పనిసరిగా అందరూ ఇంట్లోనే ఉండేందుకు ప్రయత్నించాలని,సాధ్యమైనంత వరకు మనకు మనం ఐసోలేట్ అవడం,అవసరం లేకుండా ఇళ్లు దాటి బయటకు వెళ్లకూడదని కెనడా ప్రధాని ప్రజలను కోరారు. 

కెనడాలో ఇప్పటివరకు 5వేల 655 మందికి కరోనా సోకగా,అందులో 65శాతం మందికి కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్(ఒకరి నుంచి ఒకరికి సోకడం)ద్వారా కరోనా సోకినట్లు,మిగిలిన 35శాతం మందికి వివిధ దేశాల నుంచి కెనడా తిరిగివచ్చినవాళ్లు,వాళ్లను దగ్గరగా కలిసినవాళ్లకు సోకినట్లు కెనడా పబ్లిక్ హెల్త్ ఏజెన్సీ లేటెస్ట్ డేటా తెలిపింది. మూడింట రెండు వంతుల మందికి కెనడాలో కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్ ద్వారానే కరోనా సోకిందని తెలిపింది.