పాకిస్థాన్ నుంచి విడిపోతామని, తమకు ప్రత్యేక దేశం కావాలంటూ ఇప్పటికే బలోచిస్థాన్ ప్రజలు పోరాడుతున్నారు. ఇప్పుడు సింధి ప్రజలు కూడా అదే డిమాండ్ వినిపిస్తున్నారు.
సింధు దేశ్ కోసం గళమెత్తున్న పొలిటికల్ గ్రూప్ జీ సింధ్ ఫ్రీడమ్ మూవ్‌మెంట్ (జేఎస్‌ఎఫ్‌ఎం) తాజాగా పాకిస్థాన్‌లోని ఒక రహదారిపై శాంతియుతంగా నిరసన తెలిపింది. జైలు శిక్ష అనుభవిస్తున్న సింధి జాతీయవాదులను విడుదల చేయాలని డిమాండ్ చేసింది. వారి నిరసనలతో రహదారిపై ట్రాఫిక్ స్తంభించింది.
సింధ్, బలోచిస్థాన్‌లో పోరాడుతున్న చాలా మందిని పాక్ ఏజెంట్లు అపహరించి తీసుకెళ్తుండడం, అక్రమంగా నిర్బంధించడం, మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతుండడం వంటి చర్యలపై అంతర్జాతీయ సమాజ దృష్టిని మళ్లింపజేయాలన్న ఉద్దేశంతో జేఎస్‌ఎఫ్‌ఎం ఈ నిరసనకు దిగింది.
Also Read: అష్టదిగ్బంధనంలో వైఎస్ జగన్? సిట్ నెక్ట్స్ స్టెప్ ఏంటి?
జేఎస్‌ఎఫ్‌ఎం ఛైర్మన్ సోహైల్ అబ్రో సహా ఆ సంస్థకు చెందిన నాయకులు జుబైర్ సింధి, అమర్ ఆజాడి ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జాహిద్ చన్నా, సజాద్ చన్నా, అద్నాన్ బలూచ్, బాద్షా బలోచ్, రఫీకాత్ మంగ్హన్‌హార్, షాహిద్ సూమ్రోను పాకిస్థాన్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
వారిపై చేస్తున్న తప్పుడు అభియోగాలను ఉపసంహరించుకోవాలని అన్నారు. సింధి, బలోచిస్థాన్‌లో పాకిస్థాన్ అరెస్టు చేసిన ఇతర జాతీయవాద కార్యకర్తలను కూడా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పాకిస్థాన్‌లోని హైదరాబాద్ జైలు అధికారులను వారు హెచ్చరించారు. జైల్లో ఉన్న తమ కార్యకర్తలపై అధికారులు అనుచిత చర్యలను కొనసాగిస్తే జైలు ప్రధాన ద్వారాన్ని బ్లాక్ చేస్తామని చెప్పారు.
ఐక్యరాజ్యసమితి, అమ్నెస్టీ ఇంటర్నేషనల్, హ్యూమన్ రైట్స్ వాచ్ వంటి అంతర్జాతీయ సంస్థలు పాకిస్థాన్‌లో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనల విషయంలో జోక్యం చేసుకోవాలని, ప్రపంచ దేశాలు పాక్ చర్యలను ఖండించాలని కోరారు.