Google Ceo Sundar Pichai Participated Universitys Convocation Through Video Conference 3499
ఎంతటి విపత్కర పరిస్థితులు ఎదురైనా ఆశను కోల్పోరాదని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ తెలిపారు. టెక్నికల్ అంశాలు మిమ్మల్ని అసహనానికి గురిచేయవచ్చు..కానీ మీలో ఉండే ఆశను నీరుగార్చకుండా ఉంటే అది తదుపరి సాంకేతిక విప్లవాన్ని సృష్టిస్తుందని, అది తమ కలలో కూడా ఊహించని ఆవిష్కరణలకు దారి తీయవచ్చన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఓ వర్సిటీ స్నాతకోత్సవంలో సుందర్ పిచాయ్ పాల్గొన్నారు. పట్టభద్రుల్లో ఉత్తేజం నింపేలా ప్రసంగించారు. సహనంతో ముందుకు సాగితే ప్రపంచం కోరుకునే పురోగతికి అది బాటలు వేస్తుందని చెప్పారు.
స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీలో చదివేందుకు 27 ఏళ్ల కిందట తాను అమెరికా వెళ్లే క్రమంలో తన విమాన టికెట్ కోసం తన తండ్రి ఆయన ఏడాది జీతంతో సమానమైన మొత్తం వెచ్చించారని గుర్తుచేశారు. తన జీవితంలో తొలి విమాన ప్రయాణం అదేనని చెప్పారు. కాలిఫోర్నియా వెళ్లిన తర్వాత తాను ఊహించినట్లుగా అక్కడి పరిస్థితులు లేవని తెలిపారు. అమెరికా అత్యంత ఖరీదైన ప్రాంతమన్నారు. అప్పట్లో ఇంటికి ఫోన్ చేయాలంటే నిమిషానికి రెండు డాలర్లు ఖర్చయ్యేవని తెలిపారు. బ్యాగ్ కొనాలంటే భారత్‌లో తన తండ్రి నెల జీతం అంత మొత్తం వెచ్చించాల్సి వచ్చేదన్నారు. తాను ఎదుర్కొన్న అనుభవాలను పంచుకున్నారు.
చెన్నైలో పెరిగిన పిచాయ్ ఐఐటీ గ్రాడ్యుయేట్. స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ డిగ్రీ పొందారు. వార్టన్ స్కూల్ లో ఎంబీఏ అభ్యసించారు. 2004లో గూగుల్‌లో అడుగు పెట్టిన పిచాయ్.. గూగుల్ టూల్‌బార్‌ను అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషించారు. ప్రపంచంలోనే అత్యంత ఆదరణ పొందిన ఇంటర్‌నెట్ బ్రౌజర్ గూగుల్ క్రోమ్‌ను అభివృద్ధి చేశారు.