Seattle Schools..Social Media,Google : సోషల్ మీడియా కంపెనీలపై సీటెల్ స్కూల్స్ వేసిన కేసుపై గూగుల్ ఏమంటోందంటే..

సోషల్ మీడియా కంపెనీలపై సీటెల్ స్కూల్స్ వేసిన కేసుకు సంబంధించి గూగుల్ స్పందించింది.

Google Responds to Seattle Schools’ sues Social Media Companies : సియాటెల్ పబ్లిక్ స్కూల్స్ వేసిన పిటిషన్‌తో.. సోషల్ మీడియా కంపెనీలను అక్కడి కోర్టులు నియంత్రిస్తాయా? అది సాధ్యపడుతుందా? లేక.. యూజర్స్ కంటెంట్.. యూజర్ల ఇష్టమని.. తమకెలాంటి బాధ్యత లేదని తప్పించుకుంటాయా? నిజానికి.. సోషల్ మీడియా కంపెనీలు అలా చెప్పడం కరెక్టేనా? ప్రపంచవ్యాప్తంగా సోషల్ ప్లాట్ ఫామ్స్‌కి.. యూజర్లు ఎంతలా అడిక్ట్ అయిపోయారు?

సీటెల్ స్కూల్స్ వేసిన కేసుకు సంబంధించి గూగుల్ స్పందించింది. తమ ప్లాట్‌ఫామ్‌లో చిన్నారులకు సురక్షితమైన కంటెంట్ సృష్టించేందుకు.. తమ కంపెనీ భారీగా పెట్టుబడులు పెట్టిందని, వారి శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇవ్వడం కోసం మంచి ఫీచర్లను అందుబాటులోకి తెచ్చిందని చెబుతోంది. ఇందుకు.. ఫ్యామిలీ లింక్‌ని ఎగ్జాంపుల్‌గా చూపుతోంది గూగుల్. పేరెంటల్ కంట్రోల్ ఫీచర్‌తో.. స్క్రీన్ టైమ్ సెట్ చేసేందుకు, కంటెంట్‌ని పరిమితం చేసేందుకు, ఇతర ఫీచర్లన్నీ తల్లిదండ్రులకు అందుబాటులో ఉన్నాయంటున్నారు. అదేవిధంగా.. స్నాప్ చాట్ కూడా తమ యూజర్ల కోసం మానసిక ఆరోగ్య సంస్థలతో కలిసి పనిచేస్తున్నట్లు తెలిపింది. కమ్యూనిటీ శ్రేయస్సే తమ ప్రాధాన్యత అంటోంది.

2021 అక్టోబర్‌లో యువకుల మానసిక ఆరోగ్యాన్ని ఫణంగా పెట్టి.. ఫేస్ బుక్ లాభాలు అర్జిస్తోందని.. చట్టసభ సభ్యుల నుంచి ఆరోపణలు వచ్చాయి. వీటన్నింటిని.. మెటా సీఈవో మార్క్ జుకర్ బర్గ్ తిప్పికొట్టారు. లాభాల కోసం ప్రజలు మెచ్చని కంటెంట్‌ని కావాలనే పుష్ చేస్తారన్న వాదనలో నిజం లేదన్నారు. ఫేస్ బుక్ కేవలం యాడ్స్ ద్వారానే డబ్బు సంపాదిస్తోందన్నారు. ప్రజలను నిరాశకు, కోపానికి గురిచేసే కంటెంట్ రూపొందించేందుకు.. ఏ టెక్ కంపెనీ పనిచేస్తుందో తమకు తెలియదన్నారు జుకర్ బర్గ్. అయితే.. సోషల్ మీడియా కంపెనీల పనితీరును.. పబ్లిక్ న్యూసెన్స్‌గా పరిగణించాలని.. సియాటెల్స్ స్కూల్స్ కోరుతున్నాయ్. సోషల్ ప్లాట్ ఫామ్స్ అధికంగా వినియోగించడం, సమస్యాత్మకంగా వాడటంతో పాటు విద్యా వ్యవస్థకు కలుగుతున్న నష్టానికి పరిహారంగా.. డబ్బులు కూడా చెల్లించేలా సోషల్ మీడియా కంపెనీలను ఆదేశించాలని సియాటెల్ స్కూల్స్ డిమాండ్ చేస్తున్నాయ్.

Seattle Schools Sues Social Media : యువత ఆరోగ్యానికి హాని కలిగిస్తున్నాయంటూ సోషల్ మీడియా కంపెనీలపై కేసు వేసిన సీటెల్‌ ప్రభుత్వ స్కూల్స్

నిజానికి.. సోషల్ మీడియా ఇప్పుడందరి రొటీన్ లైఫ్‌లో భాగమైపోయింది. యూట్యూబ్, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విట్టర్‌, వాట్సాప్‌, స్నాప్ చాట్, టిక్ టాక్ ఇలా.. ఎన్నో ప్లాట్ ఫామ్స్‌.. యూజర్లను అట్రాక్ట్ చేస్తున్నాయ్. ఇందులో.. చిన్నారులు, యువతే అధికంగా ఉంటున్నారు. భారతీయులు కూడా సగటున రోజుకు రెండున్నర గంటలకు పైనే సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్‌ని వాడుతున్నారు. ఇక.. 18 నుంచి 24 ఏళ్ల వయసున్న యువతీ, యువకులైతే.. మరింత ఎక్కువ టైమ్ సోషల్ ప్లాట్ ఫామ్స్‌ కోసం కేటాయిస్తున్నారు. ఈ వయసు వాళ్లు.. ఫేస్‌బుక్‌కు దాదాపు 10 కోట్ల మంది యూజర్లున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో 7 కోట్లపైనే ఉంటారు. వీళ్లంతా.. జస్ట్ ఇండియా యూజర్లు మాత్రమే. మిగతా దేశాల లెక్కలు తీస్తే.. ఇంకా చాలానే ఉంటారు.

యూనిసెఫ్‌ ప్రకారం 15-24 ఏళ్లున్న ప్రతి ఏడుగురిలో ఒకరు డిప్రెషన్‌కు గురవుతున్నారు. దాని వల్ల ఆత్మవిశ్వాసం తగ్గిపోవడం, ఏకాగ్రత లేకపోవటం, ఇతరులతో వ్యవహరించే తీరులోనూ, మాట్లాడే విషయంలోనూ సమస్యలు ఎదుర్కోవడం లాంటివి తలెత్తుతున్నాయ్. ఫలితంగా చేస్తున్న పని మీద, చదువుల మీద దృష్టి పెట్టలేకపోవటం, గొడవలకు దిగడం, ఆత్మహత్య ఆలోచనలకు గురికావటం లాంటివన్నీ.. యువతను సంక్షోభంలోకి నెట్టెస్తున్నాయ్. సోషల్ మీడియాలో తమ పోస్టులకు, ఫోటోలకు ఎన్ని లైక్స్ వస్తున్నాయన్న దాన్ని బట్టే.. తమ మేధస్సుకు, అందానికి మొత్తంగా ఒక మనిషికి , తమకున్న విలువకు కొలమానంగా చాలా మంది భావిస్తున్నారు. తమలో తమకు నచ్చని అంశాలను దాచిపెట్టి.. తమ గురించి గొప్పగా చెప్పుకొనే వేదికగా చాలా మంది సోషల్‌ మీడియాను చూస్తున్నారు. అందువల్ల.. సోషల్ మీడియా వినియోగంపై.. టీనేజర్లతో పాటు యువతలోనూ అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. ఆ ప్లాట్ ఫామ్స్ వల్ల తలెత్తుతున్న సమస్యలను, సవాళ్లను ఎదుర్కొనేలా ఈ ప్రయత్నం జరగాలి. ముఖ్యంగా.. యువత మానసిక ఆరోగ్యంపై చూపుతున్న ప్రభావాన్ని సీరియస్‌గా తీసుకోవాలి. డిప్రెషన్‌, యాంగ్జైటీ లాంటి మానసిక సమస్యల కేసులు పెరగకుండా జాగ్రత్త పడాలి. ఇందుకోసం.. ప్రభుత్వం సోషల్ ప్లాట్ ఫామ్స్‌ని కంట్రోల్ చేయాలనే వాదన వినిపిస్తోంది.

 

 

ట్రెండింగ్ వార్తలు