Seattle Schools Sues Social Media : యువత ఆరోగ్యానికి హాని కలిగిస్తున్నాయంటూ సోషల్ మీడియా కంపెనీలపై కేసు వేసిన సీటెల్‌ ప్రభుత్వ స్కూల్స్

యువత ఆరోగ్యానికి హాని కలిగిస్తున్నాయంటూ అమెరికాలోని సియాటెల్ పబ్లిక్ స్కూల్స్ సోషల్ మీడియా కంపెనీలపై ఫైల్ చేసిన కేసు.. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.

Seattle Schools Sues Social Media : యువత ఆరోగ్యానికి హాని కలిగిస్తున్నాయంటూ సోషల్ మీడియా కంపెనీలపై కేసు వేసిన సీటెల్‌ ప్రభుత్వ స్కూల్స్

Seattle Schools Sues Social Media

Seattle Schools Sues Social Media : ప్రపంచ జనాభాలో దాదాపు 3 వందల కోట్ల మంది.. సోషల్ మీడియాను విపరీతంగా వాడేస్తున్నారు. గంటలతరబడి సోషల్ మీడియా ప్రపంచంలోనే మునిగి తేలుతున్నారని రిపోర్టులు చెబుతున్నాయ్. మనుషుల జీవితాల్లో భాగంగా మారిపోయిన సోషల్ మీడియా చిన్నారులు, యువత మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఆలోచనల్ని చంపేస్తోంది. భావాలు, ఉద్వేగాలు, బంధాలపై సోషల్ మీడియా చూపే ప్రభావం అంతా ఇంతాకాదు. దీనికి పరిష్కారమే లేదా?  అనే ప్రశ్న వేధిస్తోంది.

ఇటువంటి పరిస్థితుల్లో అమెరికాలోని సియాటెల్ పబ్లిక్ స్కూల్స్ ఫైల్ చేసిన కేసు.. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. వాళ్లు వేసిన పిటిషన్ అందరినీ ఆలోచింపజేస్తోంది. స్కూల్ స్టూడెంట్స్, యంగ్ పీపుల్ మానసిక ఆరోగ్యానికి హాని కలిగిస్తున్నాయనే ఆరోపణతో.. ప్రధాన సోషల్ మీడియా కంపెనీలపై.. సియాటెల్‌లోని ప్రభుత్వ పాఠశాలలు కేసు వేశాయి. ఈ లిస్టులో టిక్ టాక్, ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్, స్నాప్ చాట్‌తో పాటు యూట్యూబ్ కూడా ఉంది. ఈ సోషల్ మీడియా కంపెనీలన్నీ.. అమెరికా యువతలో, స్కూల్ విద్యార్థుల్లో మానసిక సమస్యలను సృష్టిస్తున్నాయని.. డిస్ట్రిక్ట్ కోర్టులో వేసిన పిటిషన్‌లో ఆరోపించారు. ప్రధాన సోషల్ మీడియా కంపెనీలు.. తమ ప్లాట్‌ఫామ్స్‌లో కంటెంట్ క్రియేట్ చేసేందుకు, ఆపరేట్ చేసేందుకు, ఎక్కువ సమయం గడిపేందుకు వీలుగా.. యూజర్ల సైకాలజీ, న్యూరోఫిజియాలజీని ప్రభావితం చేసే టెక్నిక్‌లు ఉపయోగిస్తున్నాయని.. అవి వారి మెదళ్లపై ఎంతో ఇంపాక్ట్ చూపుతున్నాయని.. 91 పేజీల పిటిషన్‌‌లో తెలిపారు.

ఇప్పటికే.. అమెరికాలో లక్షలాది మంది విద్యార్థుల మెదళ్లను సోషల్ మీడియా కంపెనీలు దోచేశాయనే వాదన వినిపిస్తోంది. ఇక.. సోషల్ యాప్స్ దుర్వినియోగం బాగా జరుగుతోందని.. విపరీతమైన డైట్ ప్లాన్స్, తమకు తాము హాని చేసుకునేలా ప్రోత్సహిస్తున్నాయని..యువతలో పెరుగుతున్న ఆందోళన, నిరాశ, సెల్ఫ్ హార్మ్, ఆత్మహత్యల లాంటి ఆలోచనలు పెరగటం వెనుక కూడా సోషల్ మీడియా కంపెనీల ప్రభావం ఉందని సియాటెల్ స్కూల్స్ తమ పిటిషన్‌లో తెలిపాయి.

2009 నుంచి 2019 వరకు సియాటెల్ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య సగటున 30 శాతం పెరిగింది. వాళ్లు.. దాదాపు ప్రతి రోజూ గానీ, రెండు వారాల కంటే ఎక్కువ కాలం గానీ విచారంగా, నిస్సహాయంగా ఉన్నట్లు తేలింది. చాలా మంది విద్యార్థులు ఆందోళన, డిప్రెషన్ సహా అనేక మానసిక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నట్లు చెబుతున్నారు. చదువులపైనా సోషల్ మీడియా యాప్స్ ప్రభావం చూపుతున్నాయ్. విద్యార్థులు స్కూళ్లకు హాజరవడం కూడా తగ్గుతోంది. ఫలితంగా.. విద్యార్థులు తమ చదువును పూర్తిస్థాయిలో కొనసాగించేలా చేయడంలో.. సియాటెల్ ప్రభుత్వ స్కూళ్లకు ఆటంకం కలుగుతోంది.

Seattle Schools..Social Media,Google : సోషల్ మీడియా కంపెనీలపై సీటెల్ స్కూల్స్ వేసిన కేసుపై గూగుల్ ఏమంటోందంటే..

అయితే.. థర్డ్ పార్టీ యూజర్లకు సంబంధించి.. కమ్యూనికేషన్స్ డీసెన్సీ చట్టంలోని సెక్షన్ 230.. ఆన్‌లైన్ ప్లాట్ ఫామ్స్‌‌కు బూస్ట్ ఇస్తోంది. సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్‌లో యూజర్లు తమకు నచ్చిన కంటెంట్‌ని పోస్ట్ చేసుకునే అవకాశం ఫెడరల్ చట్టం కల్పిస్తోంది. అయినా.. ఈ నిబంధన సోషల్ మీడియా కంపెనీలకు సేవ్ చేయబోదని పిటిషన్‌లో తెలిపారు. ఎందుకంటే.. కంటెంట్‌ని రికమండ్ చేయడం, పంపిణీ చేయడం, ప్రచారం చేయడం, హాని కలిగించే విధంగా.. సోషల్ ప్లాట్ ఫామ్స్‌లో మార్కెటింగ్ చేయడం లాంటి వాటికి.. సోషల్ మీడియా కంపెనీలే బాధ్యత వహించాల్సి ఉంటుందని చెబుతున్నారు.

సోషల్ మీడియాలో ఎక్కువసేపు గడపడం, ప్రమాదకరమైన అంశాలను చదవటం వల్ల.. మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతోందని నిపుణులు తేల్చారు. అంతేకాదు.. ఎదుటి వ్యక్తులతో వ్యవహరించే విషయంలోనూ మార్పులు వస్తున్నాయ్. ఇతరులకన్నా తామే ఎక్కువనే భావన పెరగడం, ఇతరులను వేధించడం, సైబర్ బుల్లియింగ్‌కు పాల్పడటం లాంటి లక్షణాల కనిపిస్తున్నాయ్. దీని వల్ల.. మానసిక ఆరోగ్యం ఎంతగానో దెబ్బతింటోంది. విద్యార్థుల మానసిక పరిస్థితుల్లో వస్తున్న మార్పులను గమనించి.. వారిని అందులో నుంచి బయటపడేసేందుకు సియాటెల్ స్కూల్స్ అదనంగా ఖర్చు చేస్తున్నాయ్. మానసిక ఆరోగ్య నిపుణులను నియమించుకోవడం, విద్యార్థులకు వారి చేత కౌన్సెలింగ్ ఇప్పించడం.. తమకు తలకుమించిన భారంగా మారిందని చెబుతున్నారు. అంతేకాదు.. స్టూడెంట్స్‌ని సోషల్ మీడియా ఎఫెక్ట్ నుంచి బయటపడేసేందుకు.. టీచర్లకు అదనంగా శిక్షణ ఇప్పించాల్సి వస్తోదంటున్నారు.

సోషల్ మీడియా వాడుతున్న విద్యార్థులు, యువత.. శారీరక అందం గురించి తీవ్రంగా ఆలోచించటం, హీరో హీరోయిన్లలా ఉండాలనుకోవటం, అలా లేకపోతే బాధపడటం.. ఈ మధ్యకాలంలో విపరీతంగా పెరిగిపోతోంది. సోషల్‌ మీడియా ప్లాట్ ఫామ్స్‌లో ఉండే అల్గారిథమ్స్‌ కూడా.. ఒక వ్యక్తి ఇష్టపడే రంగాలకు సంబంధించిన అంశాలనే మళ్లీ మళ్లీ చూపిస్తూ ఉండటంతో సమస్య మరింత క్లిష్టంగా మారుతోంది. ఫిట్‌నెస్‌ పోస్టులను చూసి కండలు పెంచాలనే లక్ష్యంతో విపరీతంగా తినటం, కంట్రోల్ అనేదే లేకుండా ఎక్సర్‌సైజులు చేయడం లాంటి సమస్యల బారిన పడుతున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌ పోస్టులు చూసి, ఇతరులతో పోల్చుకోవటం కూడా పెరుగుతోంది. ముఖ్యంగా మహిళలు, యువతుల్లో ఇదో పెద్ద సమస్యగా మారింది. ఓ స్టడీ ప్రకారం.. తాము అందంగా లేమని భావించే టీనేజీ అమ్మాయిల్లో.. 32 శాతం మంది ఇన్‌స్టాగ్రామ్‌ కారణంగా మరింత ఆత్మన్యూనతకు గురయ్యామని తెలిపారు. అంతేకాదు.. ఫొటోలు పోస్ట్‌ చేసేటప్పుడు అందంగా కనిపించే ఫొటోలే పెట్టాలనే ఒత్తిడి తమపై ఉందని.. ఫేస్‌బుక్‌ యూజర్లలో 43 శాతం మంది భావిస్తున్నారని.. ఫేస్‌బుక్‌ జరిపిన ఓ అధ్యయనంలో తేలింది. టీనేజీ అమ్మాయిల్లో ప్రతి ముగ్గురిలో ఒకరు అందం గురించి తీవ్రంగా మదనపడుతున్నారు. యువత మానసిక ఆరోగ్యాన్ని.. సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ దెబ్బతీస్తున్నాయని చెప్పడానికి.. ఇంతకంటే బెస్ట్ ఎగ్జాంపుల్స్ మరొకటి ఉండవు.