కుప్పంలో 7 సంస్థలు రూ.2,203 కోట్ల పెట్టుబడులు.. తమ జీవితాలు మారిపోతున్నాయని చంద్రబాబుకు చెప్పిన కుప్పం ప్రజలు
కుప్పంలోని ఏడు పరిశ్రమలకు చంద్రబాబు నాయుడు వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు.
Chandrababu Naidu: కుప్పంలో పరిశ్రమలు స్థాపించనున్న ప్రతినిధులతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖాముఖి నిర్వహించారు. తాము పరిశ్రమలను స్థాపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం త్వరితగతిన అనుమతులు ఇచ్చినందుకు సీఎంకు ఆయా సంస్థల ప్రతినిధులు ధన్యవాదాలు తెలిపారు.
కుప్పంలో ఏర్పాటు చేయనున్న తమ పరిశ్రమలకు సంబంధించిన నిర్మాణ ప్రణాళికలను సీఎంకు వివరించారు. ఏడు సంస్థలు రూ.2,203 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నారు. ఈ ఏడు సంస్థలకు కుప్పంలో ప్రభుత్వం 241 ఎకరాల భూమిని కేటాయించింది. (Chandrababu Naidu)
డెయిరీ, ల్యాప్ టాప్, మొబైల్ యాక్సెసరీస్, వంట నూనెల తయారీ, ఫుడ్ ప్రాసెసింగ్, ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి వంటి పరిశ్రమలు కుప్పంలో ఏర్పాటు కానున్నాయి.
కుప్పంలోని ఏడు పరిశ్రమలకు చంద్రబాబు నాయుడు వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. హిందాల్కో, శ్రీజా డైరీ, ఏస్ ఇంటర్నేషనల్, ఎస్‌వీఎఫ్ సోయా, మదర్ డైరీ, ఈ-రోయ్స్ ఈవీ, ALEAP మహిళా పార్కులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు.
కుప్పం స్థానిక రైతులు, ప్రజలతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ ముఖాముఖి నిర్వహించారు. హంద్రీ-నీవా కాల్వ ద్వారా నియోజకవర్గానికి నీళ్లు రావడం చాలా సంతోషంగా ఉందని కుప్పం ప్రజలు అన్నారు.
కుప్పానికి ఈ తరహాలో పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీలు రావడంతో తమ ఉత్పత్తులను ఇక్కడి పరిశ్రమలకే విక్రయించే అవకాశం ఉంటుందని సీఎంకు రైతులు చెప్పారు. కుప్పానికి ఈ తరహాలో పరిశ్రమలు వస్తాయని తాము కలలో కూడా అనుకోలేదని మహిళా పాడి రైతులు తెలిపారు.
తల్లికి వందనం ద్వారా తాము లబ్ధిపొందుతున్నామని మహిళలు అన్నారు. గతంలో ఉపాధి కోసం బెంగళూరుకు వెళ్లాల్సి వచ్చేదని, ఇప్పుడు పరిశ్రమలు రావడంతో వలస వెళ్లాల్సిన అవసరం లేదని స్థానికులు అన్నారు. పరిశ్రమలు స్థాపించడం ద్వారా తమకు ఉపాధి కల్పించినందుకు సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు.
