Bandi Sanjay: బీజేపీని గెలిపిస్తే.. జూబ్లీహిల్స్ పేరు మారుస్తా.. ఇంకా..- కేంద్రమంత్రి బండి సంజయ్

ఏనాడైనా కాంగ్రెస్, బీఆర్ఎస్ మీ బస్తీలకు వచ్చి మీ సమస్యలను అడిగి తెలుసుకున్నాయా అని బండి సంజయ్ ప్రశ్నించారు.

Bandi Sanjay: బీజేపీని గెలిపిస్తే.. జూబ్లీహిల్స్ పేరు మారుస్తా.. ఇంకా..- కేంద్రమంత్రి బండి సంజయ్

Updated On : November 8, 2025 / 10:22 PM IST

Bandi Sanjay: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా మీనాక్షిపురం (రహమత్ నగర్ ) చౌరస్తా దగ్గర నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో కేంద్రమంత్రి బండి సంజయ్ మాట్లాడారు. సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందువుల పక్షాన బీజేపీ, ముస్లింల పక్షాన కాంగ్రెస్ ఉందన్నారు. ఖాన్ బేగం నగర్ కావాలో, సీతారాం నగర్ కావాలో ఓటర్లు తేల్చుకోవాలన్నారు. తెలంగాణను ఇస్లామిక్ స్టేట్ గా మార్చేందుకే సీఎం రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు. తెలంగాణలో హిందువులను ఓటు బ్యాంకుగా మార్చడమే బీజేపీ లక్ష్యం అని ఆయన స్పష్టం చేశారు. బీజేపీని గెలిపిస్తే బంజారాహిల్స్ లో పెద్దమ్మ తల్లి గుడిని కట్టిస్తా, కేంద్ర హోంమంత్రి అమిత్ షాను పిలిపించి కొబ్బరికాయ కొట్టిస్తా అన్నారు.

కాంగ్రెస్ పొరపాటున గెలిస్తే మీ పార్కులు ఖబరస్తాన్ లు, ఈద్గా, మసీదులుగా మారిపోతాయ్ అని బండి సంజయ్ హెచ్చరించారు. వినాయక చవితి, దసరా, హనుమాన్, శివాజీ జయంతి ఉత్సవాలు చేసుకునే పరిస్థితి ఉండదన్నారు. సాక్షాత్తు ముఖ్యమంత్రే కాంగ్రెస్ అంటేనే ముస్లిం పార్టీ అని అంటున్నారని మండిపడ్డారు. హిందువుల ఓట్లే అవసరం లేదంటున్నట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. హెచ్ కె కమ్యూనిటీ హాల్ ను కూడా నిర్మాణం చేయలేని దుస్థితిలో కాంగ్రెస్ ఉందన్నారు.

మంచి నీళ్లే ఇవ్వరు, అడ్డగోలుగా నల్లా బిల్లులు వేసి దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఏనాడైనా కాంగ్రెస్, బీఆర్ఎస్ మీ బస్తీలకు వచ్చి మీ సమస్యలను అడిగి తెలుసుకున్నాయా అని బండి సంజయ్ ప్రశ్నించారు. ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే జూబ్లీహిల్స్ ను సీతారాం నగర్ గా మారుస్తామన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే బండి సంజయ్ సంగతి చూస్తానని ట్విట్టర్ టిల్లు వాగుతున్నాడని మండిపడ్డారు. మీ అయ్య కేసీఆరే ఏమీ చేయలేకపోయారు, నువ్వెంత అని విరుచుకుపడ్డారు. నాపై 109 కేసులు పెట్టినప్పుడే భయపడలేదన్నారు. నా కొడుకుపైనా కేసు పెట్టి వేధించారు, నా భార్యను ఇబ్బంది పెట్టారు అని బండి సంజయ్ గుర్తు చేసుకున్నారు.

రాష్ట్రంలో ఆర్ కే పాలన, ఒరే ట్యాక్స్ నడుస్తోంది..

”రాష్ట్రంలో ఆర్ కె (రేవంత్ రెడ్డి, కేటీఆర్) పాలన నడుస్తోంది. జూబ్లీహిల్స్ లో ఒరే (ఒవైసీ, రేవంత్ రెడ్డి) ట్యాక్స్ నడుస్తోంది. రైతులు, కూలీలు, నిరుద్యోగులు, ఉద్యోగులు కేసీఆర్ దుర్మార్గపు పాలనలో ఆత్మహత్యలు చేసుకున్న సంగతి మర్చారా? కేసీఆర్ సీఎం కావాలని కేటీఆర్ కు లేనే లేదు.
కవిత.. మీ అయ్య జాగ్రత్త. సీఎం పదవి కోసం మీ అన్న, బావ ఎదురు చూస్తున్నారు. అప్పుడప్పుడు వెళ్లి మీ నాన్నను చూసి రండి. తెలంగాణలో మజ్లిస్ వాళ్లు చైన్ స్నాచర్లు, మహిళల మెడలో గొలుసులు దోచుకుంటున్నారు. ముల్లాలను పక్కన పెట్టుకుని మాట్లాడుతున్న సీఎం రేవంత్.. స్వామీజీలను పక్కన పెట్టుకుని ఎందుకు మాట్లాడటం లేదు? కాంగ్రెస్ కు 3 లక్షల హిందువుల ఓట్లు అవసరమే లేదట. ముస్లింల లక్ష ఓట్లే కావాలట.
ముఖ్యమంత్రి హోంమంత్రిగా ఉన్నా హత్యలు జరుగుతున్నాయి.

నిజామాబాద్ లో కానిస్టేబుల్ ను చంపింది ముస్లిం. సోనూసింగ్ పై కాల్పులు జరిపింది ముస్లిం. కరీంనగర్ లో బాలికలపై అత్యాచారం చేసింది ముస్లింలు. డీసీపీ చైతన్యపై దాడి చేసింది ముస్లిం. ఇప్పుడే ఇట్లా ఉంటే జూబ్లీహిల్స్ లో మళ్లీ కాంగ్రెస్ గెలిస్తే… హిందువులు బయట కూడా తిరగలేరు. కాంగ్రెస్ నేతల డీఎన్ఏ పై అనుమానమొస్తోంది. నాపై ఎన్ని కేసులు పెట్టినా భయపడను.నన్ను చంపుతానన్నా హిందుత్వం కోసమే పోరాడతా. మీలెక్క ఓట్ల కోసం టోపీ పెట్టుకుని అడుక్కునే బిచ్చపు బతుకు నాది కాదు. నా టోపీ ఏందో తెలుసా.. ఆరెంజ్ కలర్ టోపీ. ముస్లింలు పెట్టుకునే తెల్లటోపీ కాంగ్రెస్ ది, కాషాయ టోపీ బీజేపీది. ఎవరికి ఓట్లేస్తారో తేల్చుకోండి. తెలంగాణలోని హిందువులంతా జూబ్లీహిల్స్ వైపే చూస్తున్నారు.

డబ్బులు ఎవరు ఇచ్చినా తీసుకోండి. ఓట్లు మాత్రం బీజేపీకే వేయండి. మాగంటి గోపీనాథ్ కుటుంబ సభ్యులు నా వద్దకొచ్చి ఏడుస్తున్నారు. కన్నతల్లిని కాదని, పెళ్లి చేసుకున్న భార్యను భార్యే కాదని, కన్న బిడ్డను కూడా కొడుకు కాదని వేధిస్తున్నారు. కన్న కొడుకు చివరి చూపు కూడా చూడనీయని నీచులు బీఆర్ఎస్ వాళ్లు. బీఆర్ఎస్ నేతల దృష్టి అంతా మాగంటి ఆస్తిపాస్తులపైనే ఉంది. మాగంటి గోపీనాథ్ ఆస్తి పత్రాలను మార్చి దోచుకోవాలని చూస్తున్నారు. నేను ఇదే విషయం చెబితే.. నన్ను ఫిర్యాదు చేయాలంటున్నారు. నెల క్రితమే మాదాపూర్ లో మాగంటి కొడుకు తారక్ కంప్లయింట్ ఇచ్చాడు. అయినా ఎందుకు విచారణ జరపలేదు. ఇప్పుడు కూడా మాదాపూర్ పీఎస్ కు వెళ్లి కంప్లయింట్ ఇచ్చాడు. నీకు దమ్ముంటే విచారణ జరిపించు. ట్విట్టర్ టిల్లును జైల్లో వేయ్. ఆ పని చేయకుండా బీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి డ్రామాలాడుతున్నాయ్.

ముస్లిం మహిళలు సైతం బీజేపీకే ఓటేస్తాం అంటున్నారు..

కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మధ్య పోటీ మొదలైంది. ఎక్కడికి వెళ్లినా బీజేపీకే ఓటేస్తానని హిందువులంతా చెబుతున్నారు. ముస్లిం మహిళలు సైతం బీజేపీకే ఓటేస్తాం అంటున్నారు. ఇండియన్ ముస్లిం కాంగ్రెస్ (ఐఎంసీ) వర్సెస్ భారతీయ జనతా పార్టీ మధ్య జరుగుతున్న ధర్మ యుద్ధమిది. రేవంత్ రెడ్డి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ను ఇండియన్ ముస్లిం కాంగ్రెస్ గా మార్చేశారు. తెలంగాణలోని హిందువులారా.. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని మీ బంధువులకు ఫోన్ చేసి బీజేపీకి ఓట్లేయించి గెలిపించండి. జూబ్లీహిల్స్ లో బీజేపీని గెలిపిస్తే తెలంగాణలో హిందూ రాజ్యం తీసుకొస్తా.

జూబ్లీహిల్స్ లో బీజేపీని గెలిపిస్తే… మోదీ వద్దకు పోయి మరిన్ని కేంద్ర నిధులు తీసుకొస్తాం. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి అంతా కేంద్రమిస్తున్న నిధులతోనే నడుస్తున్నది. మరిన్ని నిధులు రావాలంటే, బీజేపీకే ఓటేయండి. బీజేపీకి జనసేన కూడా మద్దతు ప్రకటించింది. జనసేన కార్యకర్తలారా.. తెలంగాణలో పరిస్థితులు బాగోలేవు. జూబ్లీహిల్స్ లో బీజేపీని గెలిపించాల్సిన అవసరం ఉంది. సనాతన ధర్మం కోసం పని చేయాలని జనసేన కార్యకర్తలను కోరుతున్నా” అని బండి సంజయ్ అన్నారు.

Also Read: రూ.4వేల పెన్షన్, మహిళలకు రూ.2,500..! ఎప్పటి నుంచి అంటే.. జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు..