Bears: జపాన్ ప్రజలకు పెద్ద సమస్య వచ్చి పడింది. అక్కడి ప్రజలు ఎలుగుబంట్ల బెడదతో ఇబ్బంది పడుతున్నారు. పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే.. ప్రభుత్వం ఏకంగా మిలిటరీని రంగంలోకి దింపాల్సి వచ్చింది. ఎలుగుబంట్లను కంట్రోల్ చేసే బాధ్యతను సైన్యానికి అప్పగించింది ప్రభుత్వం.
ఈ మధ్య కాలంలో జపాన్ లో ఎలుగుబంట్ల సంతతి బాగా పెరిగిపోయింది. ముఖ్యంగా అకిటా రాష్ట్రంలో వాటి సంఖ్య మరీ ఎక్కువగా ఉంది. అడవుల్లో ఉండాల్సిన ఎలుగుబంట్లు ఆహారం కోసం తరచూ ప్రజల మధ్యలోకి వచ్చేస్తున్నాయి. ఈ క్రమంలో మనుషులపై దాడులకు పాల్పడుతున్నాయి. గడిచిన 6 నెలల వ్యవధిలో వందకు పైగా దాడులు చోటు చేసుకున్నాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది. ఎలుగుబంట్ల దాడిలో పలువురు చనిపోయారు. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడుపుతున్నారు. ఎప్పుడు ఎటువైపు నుంచి ఎలుగుబంట్లు దాడి చేస్తాయోనని హడలిపోతున్నారు.
ఈ క్రమంలో ప్రభుత్వం స్పందించింది. మిలిటరీని రంగంలోకి దింపింది. ఎలుగుబంట్లను పట్టుకోవడంతో పాటు జనావాసాల్లోకి రాకుండా అడ్డుకునే బాధ్యతను సైన్యానికి అప్పగించింది. వాటిని బంధించేందుకు వేటగాళ్లకు సైనికులు సాయపడనున్నారు. అయితే, ఎట్టి పరిస్థితుల్లో వాటిని చంపొద్దని ఆదేశాలు ఇచ్చింది ప్రభుత్వం.
కాగా, ఎలుగుబంట్లు జనావాసాల్లోకి రావడానికి కారణం వాతావరణ మార్పులే అని అధికారులు చెబుతున్నారు. అడవిలో ఆహారం కొరత, శీతాకాలంలోనూ వెచ్చని ఉష్ణోగ్రతల కారణంగా అవి జనాల మధ్యలోకి వచ్చేస్తున్నాయని వివరించారు.
Also Read: భారత మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్లు అరెస్ట్.. అమెరికాలో ఒకరు, జార్జియాలో మరొకరు..