హెచ్-1బీ వీసాదారులకు బిగ్ రిలీఫ్.. కొత్త నిబంధనలపై క్లారిటీ ఇచ్చిన వైట్‌హౌస్.. వారికి మాత్రమే..

హెచ్-1బీ వీసా (H-1B Visa) పై విధించిన లక్ష డాలర్ల రుసుము వార్షిక ఫీజు కాదని కరోలిన్ లీవిట్ స్పష్టం చేశారు.

H-1B Visa

H-1B Visa: హెచ్-1బీ వీసాల వార్షిక దరఖాస్తు రుసుమును లక్ష డాలర్ల (సుమారు రూ.88లక్షలు)కు పెంచుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ భారీ పెంపునకు సంబంధించిన కార్యనిర్వాహక ఉత్తర్వులపై ట్రంప్ శుక్రవారం సంతకాలు చేశారు. ట్రంప్ నిర్ణయం భారతీయ ఐటీ ఉద్యోగులపై పెను ప్రభావం చూపనుంది. అయితే, తాజాగా.. హెచ్-1బీ వీసాదారులకు (H-1B Visa) కాస్త ఊరట లభించింది. కొత్త నిబంధనలపై వైట్‌హౌస్ క్లారిటీ ఇచ్చింది.

Also Read: మీరంతా 24 గంటల్లో అమెరికాకు తిరిగి వచ్చేయండి.. అంతేకాదు..: టెక్‌ కంపెనీలు సంచలన ప్రకటన

హెచ్-1బీ వీసా ఫీజును అమాంతం లక్ష డాలర్లకు పెంచుతూ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై ఆ దేశం క్లారిటీ ఇచ్చింది. హెచ్-1బీ వీసాపై ప్రకటించిన లక్ష డాలర్ల రుసుము కేవలం కొత్త దరఖాస్తు దారులకు మాత్రమే వర్తిస్తుందని వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ తెలిపారు.

హెచ్-1బీ వీసాపై విధించిన లక్ష డాలర్ల రుసుము వార్షిక ఫీజు కాదని కరోలిన్ లీవిట్ స్పష్టం చేశారు. దరఖాస్తు చేసుకునే సమయంలో కట్టాల్సిన వన్‌టైమ్ ఫీజు మాత్రమేనని చెప్పారు. ఇప్పటికే ఈ వీసా కలిగి ఉండి.. అమెరికా బయట ఉన్నవారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వారిపై ఈ లక్ష డాలర్ల రుసుము విధించబోమని ఆమె తెలిపారు. వారంతా ఎప్పటిలాగే అమెరికా నుంచి బయటకు వెళ్లి తిరిగి రావొచ్చని, కొత్త నిబంధన వారికి వర్తించదని పేర్కొన్నారు.

హెచ్-1బీ వీసాకు దరఖాస్తు చేసుకునే వారికి మాత్రమే కొత్త నిబంధనలు అమలు చేస్తామని, ప్రస్తుత వీసాదారులకు, రెన్యూవల్‌కు ట్రంప్ యంత్రాంగం తీసుకున్న నిర్ణయం వర్తించదని వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ ‘ఎక్స్’ వేదికగా స్పష్టత నిచ్చారు.

హెచ్1బీ వీసా పొందిన వారిలో భారతదేశానికి చెందిన వారే అత్యధికంగా ఉన్నారు. దాదాపు 71శాతం మంది ఉన్నారు. తాజా వివరాల ప్రకారం.. భారత దేశంకు చెందిన వారు 2,32,974 మంది ఉండగా.. చైనా దేశంకు చెందిన వారు 51,787 మంది ఉన్నారు. ఆ తరువాతి స్థానంలో కెనడా దేశంకు చెందిన వారు 9,423 మంది ఉన్నారు. దక్షిణ కొరియా 4,200, మెక్సికో 3,646, నేపాల్ 2,629, బ్రెజిట్ 2,567, పాకిస్థాన్ 2,551, ఫిలిప్పీన్స్ దేశం నుంచి 2,460 మంది ఉన్నారు.

ఇప్పటి వరకు అన్ని రకాల ఫీజులు కలిపితే హెచ్1బీకి చెల్లించేది 1500 డాలర్లు (రూ.1.32లక్షలు) మాత్రమే. తాజాగా.. ట్రంప్ తీసుకున్న నిర్ణయం వల్ల ఇకనుంచి హెచ్1బీ వీసాకు దరఖాస్తు చేసుకునేవారు లక్ష డాలర్లు వన్‌టైమ్ ఫీజుగా చెల్లించాలి.