మీరంతా 24 గంటల్లో అమెరికాకు తిరిగి వచ్చేయండి.. అంతేకాదు..: టెక్ కంపెనీలు సంచలన ప్రకటన
అమెరికాలో ఉన్న ఉద్యోగులకు సమస్యలు రాకుండా ఉండేందుకు దేశం విడిచి వెళ్లవద్దని పేర్కొంది.

Meta, Microsoft
H-1B visa holders: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్-1బీ వీసాల దరఖాస్తు ఫీజును లక్ష డాలర్ల (రూ.88 లక్షలు)కు పెంచడంతో టెక్ కంపెనీలు అప్రమత్తమయ్యాయి. తమ ఉద్యోగులకు కీలక సూచనలు చేస్తున్నాయి.
శనివారం ఉదయం మెటా, మైక్రోసాఫ్ట్ వంటి ప్రధాన సంస్థలు సమావేశయ్యాయి. తమ కంపెనీల్లో పనిచేస్తూ సెలవులపై ఇతర దేశాలకు వెళ్లిన హెచ్-1బీ వీసా హోల్డర్లు 24 గంటల్లో అమెరికాకు రావాలని మెటా, మైక్రోసాఫ్ట్ సంస్థలు కీలక సూచన చేశాయి. అంతేగాక, తమ హెచ్-1బీ వీసా హోల్డర్లు కనీసం 14 రోజులు అమెరికాను వదిలి వెళ్లవద్దని కోరాయి.
మెటా ఏమని చెప్పింది?
తమ హెచ్-1బీ వీసా, హెచ్4 స్టేటస్ హోల్డర్లు కనీసం రెండు వారాలు యూఎస్‌లో ఉండాలని మెటా చెప్పింది. “ప్రాక్టికల్ అప్లికేషన్స్” అర్థమయ్యే వరకు వేచి ఉండాలని సూచించింది. ప్రస్తుతం ఇతర దేశాల్లో నివసిస్తున్నవారు 24 గంటల్లో తిరిగి రావాలని కోరింది.
మైక్రోసాఫ్ట్ ఏమంది?
మైక్రోసాఫ్ట్ మాత్రం అమెరికాలో ఉన్న ఉద్యోగులకు సమస్యలు రాకుండా ఉండేందుకు దేశం విడిచి వెళ్లవద్దని మైక్రోసాఫ్ట్ పేర్కొంది. విదేశాల్లో ఉన్న ఉద్యోగులు తిరిగి రావడానికి అన్ని విధాలా ప్రయత్నించాలని కోరింది.
హెచ్-1బీ వీసా అంటే నైపుణ్యాలు ఉన్నవారికి అమెరికాలో పనిచేయడానికి ఇచ్చే వీసా. ఇందులో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, టెక్ ప్రోగ్రామ్ మేనేజర్లు, ఇతర ఐటీ నిపుణులు ఉంటారు. ఇవి మూడు సంవత్సరాలపాటు చెల్లుతాయి. మరో మూడు సంవత్సరాల వరకు పొడిగించుకోవచ్చు. ట్రంప్ తీసుకున్న నిర్ణయం భారతీయులపై తీవ్ర ప్రభావం చూపుతుంది.
“అమెరికన్ వర్కర్ల నియామకాలను ప్రోత్సహించడమే మా లక్ష్యం” అని వైట్ హౌస్‌లో ప్రకటనపై సంతకం చేస్తూ ట్రంప్ అన్నారు. ఆయన చేపడుతున్న చర్యలు చట్టపరంగా నిలబడితే వీసాదారులు భారీ ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. నైపుణ్యం కలిగిన వర్కర్ల వీసా ఫీజు 215 డాలర్ల నుంచి భారీగా పెరుగుతుంది. ఇన్వెస్టర్ వీసాల ఫీజులు 10,000–20,000 డాలర్ల వరకు పెరుగుతాయి.