హార్వర్డ్‌ వర్సిటీపై ట్రంప్‌కి ఎందుకింత కోపం? 10 పాయింట్లలో పూర్తి వివరాలు ఇదిగో..

వాక్ స్వాతంత్య్రం వంటి రాజ్యాంగ హక్కులకు విరుద్ధంగా ఉన్న ఫెడరల్‌ ఆర్డర్లను తాము పాటించబోమని పేర్కొన్నారు.

హార్వర్డ్‌ యూనివర్సిటీ.. ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయం ఇది. ఇందులో చదువుకున్న వారు టెక్నాలజీ రంగంలో ప్రపంచాన్ని ఏలుతున్నారు. ఇందులో సీటు దక్కించుకోవడం కోసం లక్షలాది మంది ఇంటెలిజెంట్ విద్యార్థులు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు.

ఈ యూనివర్సిటీలోనే మార్క్ జుకర్‌బర్గ్ ఫేస్‌బుక్ మొదటి వెర్షన్‌ను సృష్టించారు. దీన్ని మొదట విద్యార్థులు వర్సిటీలో ఒకరికొకరు రేటింగ్‌ ఇచ్చుకోవడానికి జుకర్‌బర్గ్‌ అభివృద్ధి చేశారు. ఇప్పుడు ఫేస్‌బుక్ ప్రపంచ వ్యాప్తంగా ఎంతటి ఆదరణ పొందిందో ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు.

హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుకున్న ఎనిమిది మంది అమెరికా అధ్యక్షులయ్యారు. ప్రపంచ స్థాయి నాయకులుగా వారు ఎదగడానికి పునాదులు వేసింది హార్వర్డ్ యూనివర్సిటీ. ముఖ్యమైన నిర్ణయాలు ఎలా తీసుకోవాలి? ప్రభుత్వం ఎలా పనిచేస్తుంది? వంటి అనేక ముఖ్యమైన విషయాలను ఆయా నేతలు అర్థం చేసుకుంది ఈ యూనివర్సిటీలోనే.

అటువంటి యూనివర్సిటీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ పాలనలో ఇప్పుడు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటోంది.

ట్రంప్‌ ప్రభుత్వం హార్వర్డ్ విశ్వవిద్యాలయంతో గొడవ పెట్టుకోవడమే కాదు.. దాని ఇన్ఫ్లూయెన్స్‌ని తగ్గించడం, ఆ యూనివర్సిటీకి సంబంధించిన పలు చర్యలను కట్టడి చేయడం వంటి వాటి కోసం అమెరికా ప్రభుత్వానికి ఉన్న అధికారాలన్నింటినీ ఉపయోగిస్తున్నారు.

ఇప్పుడు, ఆ యూనివర్సిటీకి వచ్చే నిధులు స్తంభించాయి. వీసాలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. వర్సిటీపై రాజకీయ ఒత్తిడి పెరుగుతోంది.

Also Read: ఆంధ్రప్రదేశ్‌లో ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్‌ జారీ చేసిన ప్రభుత్వం

హార్వర్డ్ విశ్వవిద్యాలయం ఇతర విద్యాసంస్థలలాగే డొనాల్డ్ ట్రంప్ విధానాలను విమర్శిస్తోంది. ముఖ్యంగా వాతావరణ మార్పు, ఇమ్మిగ్రేషన్, సామాజిక న్యాయం వంటి సమస్యలపై ట్రంప్‌పై హార్వర్డ్ విశ్వవిద్యాలయం విమర్శలు చేస్తోంది. ట్రంప్ చర్యలను అధ్యాపకులు, విద్యార్థులు పరిశోధకులు బహిరంగంగా విభేదిస్తున్నారు.

హార్వర్డ్ విశ్వవిద్యాలయం విషయంలో ఇప్పటివరకు చోటుచేసుకున్న 10 ముఖ్యమైన పరిణామాలు ఇవే.. 

1. హార్వర్డ్‌ యూనివర్సిటీకి అందించే 2.2 బిలియన్ డాలర్ల గ్రాంట్లను డొనాల్డ్ ట్రంప్ స్తంభింపజేశారు. పాలస్తీనా అనుకూల నిరసనల సమయంలో యూదు విద్యార్థులు వివక్షకు గురికాకుండా చేయడంలో, క్యాంపస్‌లో వారిని ప్రత్యర్థి విద్యార్థుల నుంచి రక్షించడంలో హార్వర్డ్ విఫలమైందని అమెరికా విద్యా శాఖ ఈ సందర్భంగా పేర్కొంది.

2. గత ఏడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి చేసిన తరువాత హార్వర్డ్ విద్యార్థి సంఘాలు ఓ ప్రకటనను విడుదల చేశాయి. గాజాలో హింస పెరిగిపోవడానికి ఇజ్రాయెల్ కారణమని అన్నాయి. దీంతో ఈ విద్యార్థి సంఘాల తీరు విమర్శలకు దారితీసింది.

3. ఇప్పటికే హార్వర్డ్‌ యూనివర్సిటీపై విమర్శలు వస్తున్న వేళ ఆ వర్సిటీ ప్రెసిడెంట్ క్లాడైన్ గే కాపీరైట్ కుంభకోణానికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆమె ఆ పదవికి రాజీనామా చేశారు. ఆమె సిటేషన్స్‌ (అనులేఖనాలు) విషయంలో రూల్స్‌కి విరుద్ధంగా వ్యవహరించినందుకుగానూ పదవీ విరమణ చేయవలసి వచ్చింది.

4. అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం హార్వర్డ్ యూనివర్సిటీ విషయంలో జోక్యం చేసుకుంది. అంతర్జాతీయ విద్యార్థులను ఎన్‌రోల్‌ చేయడంలో హార్వర్డ్‌ సామర్థ్యాలను రివ్యూ చేయడాన్ని ప్రారంభించింది.

5. అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం రివ్యూ చేస్తుండగానే మరోవైపు విద్యా శాఖ హార్వర్డ్‌లో మానవ హక్కుల ఉల్లంఘన విషయంలో విచారణ ప్రారంభించింది.

6. విచారణ జరుగుతున్న సమయంలో హార్వర్డ్ తాత్కాలిక అధ్యక్షుడు అలాన్ గార్బర్ ఓ అధికారిక లేఖ ద్వారా స్పందించారు. వాక్ స్వాతంత్య్రం వంటి రాజ్యాంగ హక్కులకు విరుద్ధంగా ఉన్న ఫెడరల్‌ ఆర్డర్లను తాము పాటించబోమని పేర్కొన్నారు. దీంతో కోర్టులు హార్వర్డ్ వర్సిటీ వైఖరికి అనుగుణంగా స్పందిస్తాయా? అన్నదానిపై ఆసక్తి నెలకొంది.

7. ట్రంప్ హార్వర్డ్‌పై సోషల్ మీడియాలో మీమ్స్ వంటివి పోస్ట్ చేయడం లేదు. కానీ, ఆ యూనివర్సిటీపై వ్యూహాత్మకంగానే ఒత్తిడి తీసుకొస్తున్నారు.

8. అంతర్జాతీయ విద్యార్థులను చేర్చుకునే హక్కు హార్వర్డ్‌కు ఇప్పటికీ ఉంది. అయితే, దానిని కోల్పోయే ముప్పు కూడా పొంచి ఉన్నట్లు తెలుస్తోంది. అంతర్జాతీయ విద్యార్థులు ఇప్పటికే సమస్యలు ఎదుర్కొంటున్నారు.

9. ఇది కేవలం హార్వర్డ్ వర్సిటీకే పరిమితమైంది కాదు. కొలంబియా, పెన్, ఎంఐటీ, స్టాన్‌ఫోర్డ్ వంటి వర్సిటీల్లో జరిగిన నిరసనలపై దర్యాప్తులు జరుగుతున్నాయి.

10. ట్రంప్ పాలనలో ఈ క్యాంపస్ రాజకీయాల భవిష్యత్తు ఎలా ఉంటుందన్న ప్రశ్నలు తలెతుతున్నాయి. హార్వర్డ్ వంటి పెద్ద విశ్వవిద్యాలయాలు తమపై ఒత్తిడి తెస్తున్న ప్రభుత్వాన్ని ఎదిరించగలవా? అనే దాని మీదే ఈ క్యాంపస్ రాజకీయాలు ఆధారపడి ఉంటాయి. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు యూదులు, డైవెర్సిటీ వంటి అంశాల గురించి మాత్రమే కాదు. “ఇవి విశ్వవిద్యాలయాలను నియంత్రించడానికి చేస్తున్న ప్రయత్నాలు కూడా” అని విశ్లేషకులు అంటున్నారు.