Nasrallah Death: హెజ్‌బొల్లా చీఫ్ నస్రల్లా మృతదేహం స్వాధీనం.. శరీరంపై ఒక్క గాయం లేదు..! ఎలా మరణించాడంటే?

వార్తా సంస్థ రాయిటర్స్ కు లెబనీస్ భద్రత, వైద్య వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం.. హసన్ నస్రల్లా మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నాం. అతని శరీరంపై ఎలాంటి గాయాలు..

Hezbollah Chief Nasrallah

Hezbollah Chief Nasrallah: లెబనాన్ రాజధాని బీరూట్ లోని దాహియా ప్రాంతంలోఉన్న హెజ్‌బొల్లా కేంద్ర కార్యాలయంపై ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు విరుచుకుపడ్డాయి. ఈ దాడుల్లో హెజ్‌బొల్లా చీఫ్ హసన్ నస్రల్లా మృతిచెందిన విషయం తెలిసిందే. భద్రతా సిబ్బంది దాడి జరిగిన ప్రదేశంలోనే నస్రల్లా మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆయన మృతదేహంపై ఎలాంటి గాయాలు కనిపించలేదు. దీంతో.. అసలు నస్రల్లా మృతికి ఇజ్రాయెల్ దాడులే కారణమా.. అంతకు ముందే మరణించాడా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, భారీ బాంబు పేలుళ్ల కారణంగా షాక్ కు గురై నస్రల్లా చనిపోయి ఉంటాడని భావిస్తున్నారు.

Also Read : Israel Hezbollah War: నస్రల్లా హత్యపై స్పందించిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఇరాన్

వార్తా సంస్థ రాయిటర్స్ కు లెబనీస్ భద్రత, వైద్య వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం.. హసన్ నస్రల్లా మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నాం. అతని శరీరంపై ఎలాంటి గాయాలు కనిపించలేదని చెప్పారు. బాంబు పేలుళ్ల సమయంలో భారీ శబ్దం వచ్చిన సమయంలో అతను షాక్ కు గురై మరణించి ఉంటాడని వారు పేర్కొన్నారు. ఇదిలాఉంటే.. హెజ్‌బొల్లా చీఫ్ మరణం తరువాత ఇరాక్ ప్రధాని మహ్మద్ షియా అల్-సుడానీ దేశంలో మూడు రోజుల సంతాప దినాలు ప్రకటించారు. నస్రల్లా మరణం తరువాత ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ఇరాన్ లో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం ఆయన సురక్షిత ప్రాంతానికి వెళ్లిపోయారు.

Also Read : కసితో పోరాడింది, ఒక్కొక్కరిని మడత పెట్టేసింది.. హిజ్బులా టాప్ లీడర్లను ఖతం చేసిన ఇజ్రాయెల్..!

ఇజ్రాయెల్ దూకుడుతో హెజ్‌బొల్లాకు తీవ్ర నష్టం వాటిల్లుతోన్న తరుణంలో ఈ పోరులో ఇరాన్ నేరుగా ఇజ్రాయెల్ తో తలపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. లెబనాన్ లోకి తన బలగాలను పంపేందుకు ఇరాన్ సిద్ధంగా ఉందని ఆ దేశ ఉన్నత స్థాయి అధికారిని ఉటంకిస్తూ అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. దానికి సంబంధించిన అనుమతులు జారీ చేయనున్నట్లు పేర్కొంది. 1981 మాదిరిగానే ఇజ్రాయెల్ తో పోరాడేందుకు లెబనాన్ కు బలగాలను పంపుతామని ఆయన పేర్కొన్నారు.

ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) తెలిపిన వివరాల ప్రకారం.. హసన్ నస్రల్లా దాక్కున్న హెజ్‌బొల్లా భూగర్భ కార్యాయలం యూఎన్ పాఠశాలకు కేవలం 53 మీటర్ల దూరంలోనే ఉందట. లెబనాన్ లోని బీరూట్ లో ఉన్న ఈ స్థలం నివాస ప్రాంతంలో ఉంది. ఇక్కడ సామాన్య ప్రజలు నివసిస్తున్నారు. అయితే, నస్రల్లా, ఆయనతోపాటు అనేక మంది కమాండర్లు భూగర్భంలోని భవనాల్లో దాక్కున్నారు.