High Speed Ferry Service: 40 ఏళ్ల తర్వాత ఇండియా-శ్రీలంక మధ్య హైస్పీడ్ ఫెర్రీ ఓడ సర్వీసు ప్రారంభం
రెండు దేశాల మధ్య కనెక్టివిటీని మెరుగుపరచడంలో ఫెర్రీ సర్వీస్ ఒక ముఖ్యమైన దశని, శ్రీలంకలో అంతర్యుద్ధం (1983) కారణంగా ఫెర్రీ సర్వీస్ నిలిపివేయబడిందని శ్రీలంక అధ్యక్షుడు విక్రమసింఘే అన్నారు.

India and SriLanka: తమిళనాడులోని నాగపట్నం, అలాగే శ్రీలంకలోని కంకేసంతురై మధ్య హైస్పీడ్ ప్యాసింజర్ ఫెర్రీ సర్వీస్ 40 ఏళ్ల తర్వాత శనివారం (అక్టోబర్ 14) పునఃప్రారంభమైంది. కేంద్ర ఓడరేవుల శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్, తమిళనాడు పబ్లిక్ వర్క్స్-ఓడరేవుల మంత్రి ఈవీ వేలు శనివారం నాగపట్నం ఓడరేవు నుంచి ఈ ఫెర్రీ సర్వీస్‌ను జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ మాట్లాడుతూ.. “ఫెర్రీ సర్వీస్ ఆపరేషన్ తమిళనాడు, శ్రీలంక ఉత్తర ప్రావిన్స్ మధ్య సాంస్కృతిక సంబంధాలను మెరుగుపరుస్తుంది. నాగపట్నం తిరువనల్లూరు, నాగోర్, వేలంకన్ని వంటి మతపరమైన కేంద్రాలకు సమీపంలో ఉన్నందున, అనేక మంది యాత్రికులకు ప్రయోజనం ఉంటుంది” అని అన్నారు. ఇక ఇరు దేశాల మధ్య ఫెర్రీ సర్వీస్ ప్రారంభం కావడాన్ని ప్రధాని నరేంద్ర మోదీ, శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే వీడియో సందేశాల ద్వారా అభినందించారు.
దౌత్య సంబంధాలు బలోపేతం అవుతాయి: ప్రధాని
రెండు దేశాల మధ్య సాంస్కృతిక, వాణిజ్య, దౌత్య సంబంధాలను బలోపేతం చేసేందుకు ఫెర్రీ సర్వీస్ దోహదపడుతుందని, భారత్-శ్రీలంక ఆర్థిక భాగస్వామ్య ఉమ్మడి దృక్పథంలో కనెక్టివిటీ ప్రధాన అంశం, ఫెర్రీ సర్వీస్‌ను పునఃస్థాపన కోసం తాము ఎదురుచూస్తున్నామని ప్రధాని మోదీ అన్నారు. శ్రీలంక అధ్యక్షుడు విక్రమసింఘే మాట్లాడుతూ.. రెండు దేశాల మధ్య కనెక్టివిటీని మెరుగుపరచడంలో ఫెర్రీ సర్వీస్ ఒక ముఖ్యమైన దశని, శ్రీలంకలో అంతర్యుద్ధం (1983) కారణంగా ఫెర్రీ సర్వీస్ నిలిపివేయబడిందని అన్నారు.
ఇందులో ఎంత మంది వ్యక్తులు ప్రయాణించొచ్చు?
చెరియపాణిలో ఉన్న హై స్పీడ్ ఫెర్రీ క్రాఫ్ట్ లో ప్రస్తుతం 50 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది, కెప్టెన్ బిజు జార్జ్ ఉన్నారు. షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా నిర్వహిస్తున్న ఫెర్రీ సర్వీస్ కోసం ఒక ప్రైవేట్ ఏజెన్సీ టిక్కెట్లను విక్రయిస్తుంది. ఫెర్రీలో ఒకేసారి 150 మంది ప్రయాణికులు ప్రయాణించవచ్చు. ఇది నాగపట్నం నుంచి ఉదయం 7 గంటలకు బయలుదేరి 11 గంటలకు కంకేసంతురై చేరుకుంటుంది. అనంతరం అక్కడి నుంచి మధ్యాహ్నం 1.30 గంటలకు బయలుదేరి సాయంత్రం 5.30 గంటలకు నాగపట్నం చేరుకుంటుంది.