నిలిచిన విద్యుత్తు సరఫరా.. అంధకారంలోకి స్పెయిన్‌, పోర్చుగల్‌, ఫ్రాన్స్‌.. స్తంభించిన జనజీవనం

రైళ్లు, ఎయిర్‌పోర్టులు, టెలీ కమ్యూనికేషన్లపై కూడా ఈ ప్రభావం పడింది.

నిలిచిన విద్యుత్తు సరఫరా.. అంధకారంలోకి స్పెయిన్‌, పోర్చుగల్‌, ఫ్రాన్స్‌.. స్తంభించిన జనజీవనం

Updated On : April 29, 2025 / 9:59 AM IST

స్పెయిన్, పోర్చుగల్‌లో విద్యుత్‌ సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడడంతో ప్రజలకు తీవ్ర సమస్యలు ఎదురవుతున్నాయి. అలాగే, ఫ్రాన్స్‌లోని పలు ప్రాంతాల్లో కూడా ఇదే సమస్య నెలకొంది. యూరోపియన్‌ విద్యుత్‌ గ్రిడ్‌లో పలు సమస్యలు రావడంతో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయినట్లు సమాచారం.

విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. రైళ్లు ఆయా ప్రాంతాల్లో ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాగే, ఆన్యువల్ మ్యాడ్రిడ్‌ ఓపెన్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌ నిలిచిపోయినట్లు తెలుస్తోంది. ఎయిర్‌పోర్టులు, టెలీ కమ్యూనికేషన్లపై కూడా ఈ ప్రభావం పడింది.

Also Read: ఆర్ఆర్ బ్యాటర్‌ వైభవ్ సూర్యవంశీ షాట్లు బాదిన తీరుపై జీటీ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ప్రశంసల జల్లు.. ఏమన్నాడంటే?

రైళ్లు మార్గాలతో పాటు ఫోను లైన్లు, ఏటీఎం సర్వీసులు నిలిచిపోయాయి. అలాగే, ఆసుపత్రులు, ఎమర్జెన్సీ విభాగాలు జనరేటర్లపైనే పనిచేశాయి. పెట్రోల్‌ స్టేషన్లు సైతం మూతపడడంతో జనాలు అనేక సమస్యలు ఎదుర్కొన్నారు. పోర్చుగల్‌లోని కోర్టుల్లో కార్యకలాపాలు నిలిచాయి.

విద్యుత్‌ లేకపోవడంతో స్పెయిన్‌ రాజధాని మాద్రీద్‌లో ఆఫీసుల నుంచి వందలాది మంది ఉద్యోగులు బయటకు వెళ్లిన పరిస్థితి కనపడింది. ఐరోపాలోని ఆయా దేశాల్లో నెలకొన్న ఈ పరిస్థితికి సైబర్‌దాడి కారణం అయి ఉండొచ్చని మొదట స్పెయిన్‌, పోర్చుగల్‌ పవర్‌ గ్రిడ్‌ అపరేటర్ల అధికారులు అన్నారు.

ఈ సమస్యకు కచ్చితమైన కారణాలు ఏంటన్న దానిపై మాత్రం ఇప్పటికీ ఏమీ తేలలేదు. సైబర్‌ అటాక్‌ జరిగిందన్న ఊహాగానాలపై యూరోపియన్ మండలి అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా మాట్లాడుతూ.. స్పెయిన్, పోర్చుగల్‌లో విద్యుత్‌ సరఫరాలో అంతరాయానికి సైబర్‌ అటాకే కారణమని చెప్పడానికి ఎలాంటి ఆధారాలూ లేవని అన్నారు.

రెండు దేశాలలో గ్రిడ్ ఆపరేటర్లు విద్యుత్ సరఫరా అంతరాయానికి వెనుక ఉన్న కారణాన్ని కనుగొనటానికి, విద్యుత్ సరఫరాను పునరుద్ధరించడానికి కృషి చేస్తున్నారని తెలిపారు. ఆయా దేశాల ప్రభుత్వాలు అత్యవసర క్యాబినెట్‌ సమావేశాలు నిర్వహించి విద్యుత్‌ సరఫరాలో తీవ్ర అంతరాయంపై చర్చించాయి.