ఏడుస్తూ పరుగెత్తాడు : ఐసిస్ చీఫ్ చావుకి ముందు జరిగిందిదే

ఐసిస్(ISIS) ఉగ్ర‌వాద సంస్థ వ్య‌వ‌స్థాప‌కుడు అబూ బాక‌ర్ అల్-బాగ్దాదీ కుక్క చావు చట్టినట్లు ఆదివారం అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ కన్ఫర్మ్ చేసిన విషయం తెలిసిందే. అసలు బాగ్దాదీ కోసం అమెరికా ఆపరేషన్ ఎలా జరిగిందంటే…శ‌నివారం సాయంత్రం 5 గంట‌ల‌కు కోవ‌ర్ట్ ఆప‌రేష‌న్ స్టార్ట్ అయ్యింది. స్పెషల్ ఫోర్స్ ఆపరేటర్లతో అమెరికాకు చెందిన ఎనిమిది హెలికాప్ట‌ర్లు బాగ్దాది త‌ల‌దాచుకున్న కాంపౌండ్ దిశ‌గా బ‌య‌లుదేరాయి. గంటా 10 నిమిషాల పాటు ఆ హెలికాప్ట‌ర్లు అతి త‌క్కువ స్థాయి ఎత్తులో ఎగిరాయి. సిరియాలోని నార్త్‌వెస్ట్ ప్రాంతంలో ఉన్న కాంపౌండ్‌లో బాగ్దాది దాక్కున్న‌ట్లు అమెరికా ఇంటెలిజెన్స్ గుర్తించింది. ఆ ట‌న్నెల్ వైపు ద‌ళాలు వెళ్లాయి. అమెరికా వైమానిక ద‌ళంతో పాటు నౌకాద‌ళం కూడా ఈ ఆప‌రేష‌న్‌లో పాల్గొన్న‌ది. ట‌ర్కీ స‌రిహ‌ద్దుకు స‌మీపంలో ఉన్న బారిషా గ్రామం దగ్గర ఉన్న ఓ ట‌న్నెల్‌లో బాగ్దాది దాక్కున్నాడు.

హెలికాప్ట‌ర్లు ట‌న్నెల్ వైపు వెళ్తున్న స‌మ‌యంలో.. వాటిపై ఫైరింగ్ జ‌రిగింది. అయితే అమెరికా ద‌ళాలు ఆ దాడుల‌కు ధీటుగా ప్ర‌తిస్పందించాయి. కాంపౌండ్ చేరుకున్న త‌ర్వాత‌.. అమెరికా బ‌ల‌గాలు అక్క‌డ ఉన్న ఓ భారీ గోడ‌ను పేల్చేశాయి. కాంపౌండ్‌లోకి దూసుకువెళ్లే స‌మ‌యంలో.. ఐసిస్ ఉగ్ర‌వాదుల‌ను హ‌త‌మార్చారు. ప‌దుల సంఖ్య‌లో ఉగ్ర‌వాదుల‌ను క‌స్ట‌డీలోకి తీసుకున్నారు. దాంట్లో చిన్నారులు కూడా ఉన్నారు. ఆప‌రేష‌న్ స‌మ‌యంలో బాగ్దాదికి చెందిన ఇద్ద‌రు భార్య‌లు కూడా హ‌త‌మ‌య్యారు.

అయితే ముగ్గురు పిల్ల‌ల‌తో బాగ్దాది ట‌న్నెల్ చివ‌ర‌కు ప‌రుగులు తీశాడు. ప్రాణాలు కాపాడుకునే ప్ర‌య‌త్నం చేశాడు. పిరికివాడిలా ఏడుస్తూ ప‌రుగెత్తాడు. ట‌న్నెల్ చివ‌ర వ‌ర‌కు వెళ్లిన బాగ్దాది  అమెరికా సేనలు దాడి చేయడం కంటే ముందే…అబూ బకర్ తనంట తానుగా సూసైడ్ వెస్ట్(కోటు)ధరించి తన ముగ్గురు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ పేలుడు ధాటికి బాగ్దాది శ‌రీరం ముక్క‌లైంది. అత‌ను చ‌నిపోయిన 15 నిమిషాల్లోనే అమెరికా ద‌ళాలు ఆ శ‌రీర భాగాల‌కు డీఎన్ఏ ప‌రీక్ష‌లు చేసి నిర్ధార‌ణ‌కు వ‌చ్చాయి.

రెయిడ్ జ‌రిగిన ప్రాంతం నుంచి అత్యంత సున్నిత‌మైన స‌మాచార‌న్ని సేక‌రించారు. ఉగ్ర‌వాదులు వేసుకున్న భ‌విష్య‌త్తు ప్ర‌ణాళిక‌ల‌కు సంబంధించిన స‌మాచారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆప‌రేష‌న్‌లో కేవ‌లం ఇద్ద‌రు సైనికులు మాత్ర‌మే గాయ‌ప‌డ్డారు. శ‌నివారం రాత్రి ఆప‌రేష‌న్ రెండు గంట‌లే సాగినా.. బాగ్దాదిపై రెండు వారాల నుంచి నిఘా పెట్టింది ఇంటెలిజెన్స్.  ఈ ఆప‌రేష‌న్ 5 నెల‌ల క్రిత‌మే మొద‌లైన‌ట్లు సిరియాలోని కుర్దిష్ ద‌ళాల చీఫ్ చెప్పారు. తొలుత బాగ్దాది లొకేష‌న్ గుర్తించిన సీఐఏ, ఆ స‌మాచారాన్ని ర‌క్ష‌ణ శాఖ‌కు చేర‌వేసిన‌ట్లు తెలుస్తోంది. బాగ్దాది క‌దలిక‌లు ప‌సిక‌ట్టిన త‌ర్వాత ట్రంప్ ఆదేశాల‌తో అమెరికా మిలిట‌రీ మిగ‌తా ప‌ని పూర్తి చేసింది. శ‌నివారం ఉద‌య‌మే సిరియా ఆప‌రేష‌న్‌కు అమెరికా అధ్య‌క్షుడి నుంచి గ్రీన్ సిగ్న‌ల్ వ‌చ్చింది.

అయితే బాగ్దాది త‌న ప్ర‌త్య‌ర్థి గ్రూపుకు చెందిన ఇడ్లిబ్ ప్రావిన్సులో త‌ల‌దాచుకోవ‌డం అంద‌ర్నీ ఆశ్చ‌ర్యానికి గురిచేసింది. ఇస్లామిక్ స్టేట్ ప్రాంతానికి దూరంగా ఉన్న ఓ గ్రామంలో ఉండ‌డాన్ని ఇంటెలిజెన్స్ మొద‌ట్లో అర్థం చేసుకోలేక‌పోయింది. ఇస్లామిక్ స్టేట్ ఉగ్ర‌వాదులు ఇరాక్‌, సిరియాలో చాలా వ‌ర‌కు భూభాగాన్ని స్వాధీనం చేసుకుని అరాచ‌కం సృష్టించారు. అయితే అమెరికా సంకీర్ణ సేన‌ల రాక త‌ర్వాత ఐసిస్ త‌న ప్రాబ‌ల్యాన్ని కోల్పోతూ వ‌చ్చింది. నాలుగేళ్లుగా దాదాపు కోటిన్న‌ర జ‌నాభాను త‌మ ఆధీనంలో ఉంచుకున్న‌ది. అమెరికా ఆపరేషన్‌కు సహకరించినందుకు రష్యా,టర్కీ,సిరియా,ఇరాక్‌లకు ట్రంప్ థ్యాంక్స్ చెప్పారు.