Who Is Pope: కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న పోప్ ఫ్రాన్సిస్ (88) వాటికన్ సిటీలోని తన నివాసంలో కన్నుమూశారు. 1936 డిసెంబర్ 17న అర్జెంటీనాలో జన్మించిన పోప్ ప్రాన్సిస్ 2013 మార్చి 13న 266వ పోప్‌గా ఎన్నికయ్యారు. పోప్ మృతితో వాటికన్ సిటీలో కొత్త పోప్ ఎన్నిక జరగనుంది. అసలు పోప్ అంటే ఎవరు? ఆయన ఏం చేస్తారు? కొత్త పోప్ ను ఎలా ఎన్నుకుంటారు? ఈ ఆసక్తికర అంశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
కొత్త పోప్ ను ఎన్నుకునేది వారే..
కాథలిక్ చర్చిలోని అత్యంత సీనియర్ అధికారులు కొత్త పోప్ ను ఎన్నుకుంటారు. వారందరినీ కలిపి కాలేజ్ ఆఫ్ కార్డినల్స్ అని పిలుస్తారు. వీరంతా నేరుగా పోప్ ద్వారా నియమితులైన వారే. 252 మంది కాథలిక్ కార్డినల్స్ ఉండగా.. వీరిలో 138 మంది మాత్రమే పోప్‌ను ఎన్నుకునేందుకు ఓటింగ్‌లో పాల్గొనేందుకు అర్హులు. మిగతా 114 మంది 80 ఏళ్లు దాటిన వారు కావడంతో వారు ఓటింగ్‌లో పాల్గొనరు. కానీ, పోప్‌గా ఎవరిని ఎన్నుకోవాలన్న చర్చలో వారు పాల్గొనొచ్చు.
సీక్రెట్ గా పోప్ ఎన్నిక..
పోప్ మరణం తర్వాత కార్డినల్స్‌ను వాటికన్‌లో సమావేశానికి పిలుస్తారు. ఆ తర్వాత కాంక్లేవ్ జరుగుతుంది. పోప్ మరణం, ఆయన వారసుడి ఎన్నిక మధ్య కాలంలో కాథలిక్ చర్చి నిర్వహణను కార్డినల్స్ చూసుకుంటారు. సిస్టీన్ చాపెల్ లోపల ఈ ఎన్నిక చాలా సీక్రెట్ గా జరుగుతుంది. విజేతను నిర్ణయించే కార్డినల్స్ తమకు నచ్చిన అభ్యర్థికి ఓటు వేస్తారు. ఈ ప్రక్రియకు చాలా రోజులు పట్టొచ్చు.
నలుపు, తెలుపు రంగులకు అర్థమేంటి..
కార్డినల్స్ బ్యాలెట్ పేపర్లను కాలుస్తారు. రోజుకు రెండుసార్లు పొగ వస్తుంది. ఎన్నికలు ఏ విధంగా జరుగుతున్నాయనే దానికి ఆ పొగ ఒకే ఒక సూచన. నలుపు రంగు పొగ వస్తే పోప్ ఎన్నిక ఇంకా పూర్తి కాలేదని అర్ధం. తెల్లటి పొగ వస్తే కొత్త పోప్ ఎన్నిక పూర్తైందని అర్ధం. తెల్లటి పొగ వచ్చాక సాధారణంగా గంటలోపు కొత్త పోప్ సెయింట్ పీటర్స్ స్క్వేర్ బాల్కనీలో కనిపిస్తారు.
Also Read : పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూత.. నెక్ట్స్ ఏం జరుగుతుంది? తనను అక్కడ ఖననం చేయొద్దని చెప్పిన ఫ్రాన్సిస్
బాప్టిజం తీసుకున్న రోమన్ కాథలిక్ ఎవరైనా పోప్ అయ్యేందుకు అర్హత ఉంటుంది. అయితే కార్డినల్స్ తమలో ఒకరిని పోప్‌గా ఎంచుకునేందుకు ప్రాధాన్యమిస్తున్నారు. అర్జెంటీనాలో జన్మించిన పోప్ ఫ్రాన్సిస్ 2013లో జరిగిన కాంక్లేవ్‌లో ఎంపికయ్యారు. దక్షిణ అమెరికాకు చెందిన వారు పోప్ కావడం అదే తొలిసారి. ప్రపంచంలోని మొత్తం కాథలిక్కుల్లో దాదాపు 28శాతం దక్షిణ అమెరికాలో ఉన్నారు. అయితే చరిత్ర గమనిస్తే యూరప్ దేశాలకు చెందిన వారు ముఖ్యంగా ఇటలీకి చెందిన వారిని పోప్‌గా ఎంచుకునే అవకాశం ఎక్కువగా ఉంది. ఇప్పటిదాకా మొత్తం 266 మంది పోప్‌లుంటే వారిలో 217 మంది ఇటలీకి చెందిన వారే.
పోప్ ఏం చేస్తారు?
పోప్.. కాథలిక్ చర్చ్‌కు అధినేత. ఏసుక్రీస్తుకు నేరుగా ఆయన ప్రతినిధి అని రోమన్ కాథలిక్‌లు విశ్వసిస్తారు. క్రీస్తు తొలి నాటి శిష్యుల్లో ముఖ్యులైన సెయింట్ పీటర్‌కు సజీవ వారసుడిగా పోప్‌ను భావిస్తారు. దీని వల్ల కాథలిక్ చర్చిపై ఆయనకు పూర్తి అధికారాలు లభిస్తాయి. ప్రపంచంలోని సుమారు 140 కోట్ల కాథలిక్‌లకు ఆయన్ను అధిపతిగా పేర్కొంటారు. బైబిల్‌ను మార్గదర్శకంగా భావించే చాలా మంది కాథలిక్‌లు, చర్చికి సంబంధించిన నమ్మకాలు, పద్ధతులు గురించి చెప్పే పోప్ బోధనలను అనుసరిస్తుంటారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవుల్లో సగం మంది రోమన్ కాథలిక్‌లు.
ప్రపంచంలోనే అత్యంత చిన్నదేశమైన వాటికన్ సిటీలో పోప్ నివసిస్తారు. ఆ నగరం చుట్టూ ఇటలీ రాజధాని రోమ్ ఉంటుంది. పోప్‌కు ఎలాంటి జీతం ఉండదు. కానీ ఆయన రోజువారీ వ్యవహారాలు, ప్రయాణాలకు సంబంధించిన ఖర్చులన్నీ వాటికన్ భరిస్తుంది.
పోప్ అంత్యక్రియలు ఇలా చేస్తారు..
పోప్ అంత్యక్రియల వ్యవహారం సంప్రదాయంగా చాలా సుదీర్ఘమైనది. ఇందులోని సంక్లిష్టతను తగ్గించే ప్రణాళికలను ఇటీవలే పోప్ ఫ్రాన్సిస్ ఆమోదించారు. గత పోప్‌లను సైప్రస్ చెక్క, సీసం, ఓక్ చెక్కతో తయారు చేసిన మూడు వరుసల శవపేటికలలో ఖననం చేశారు. పోప్ ఫ్రాన్సిస్ మాత్రం జింక్‌తో కప్పిన సాధారణ చెక్క శవపేటికను ఎంచుకున్నారు. సెయింట్ పీటర్స్ బసిలికాలో పోప్ భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం ఎత్తైన వేదికపై ఉంచే సంప్రదాయాన్ని కూడా ఆయన రద్దు చేశారు. బదులుగా పోప్ పార్థివ దేహానికి శవపేటిక దగ్గర నివాళులు అర్పించడానికి అనుమతిస్తారు.
రోమ్‌లోని నాలుగు ప్రధాన పాపల్ బసిలికాల్లో ఒకటైన సెయింట్ మేరీ మేజర్ బసిలికాలో(చర్చి) పోప్ అంత్యక్రియలు ఉంటాయి. గత శతాబ్ద కాలంలో వాటికన్ వెలుపల పోప్‌కు అంత్యక్రియలు జరగడం కూడా ఇదే తొలిసారి.
మరిన్ని ఇంట్రస్టింగ్ స్టోరీలు, అప్‌డేట్స్ కోసం 10టీవీ వాట్సాప్ చానల్‌ని ఫాలో అవ్వండి.. Click Here