×
Ad

Donald Trump: చిలిపి ట్రంప్.. నీకు ఎంతమంది భార్యలు..! అంటూ ఓ దేశ అధ్యక్షుడితో సరదా సంభాషణ.. వీడియో వైరల్..

దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Donald Trump: ఎప్పుడూ సీరియస్ గా కనిపించే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ లో మరో యాంగిల్ కూడా ఉంది. అప్పుడప్పుడు ఆయన చాలా సరదాగా మాట్లాడతారు. తన మాటలు, చేష్టలతో నవ్వులు పూయిస్తారు. తాజాగా ఓ దేశ అధ్యక్షుడితో ట్రంప్ పరాచికాలు ఆడారు. నీకు ఎంతమంది భార్యలు అంటూ ఆయనను ప్రశ్నించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ ఇటీవల సిరియా అధ్యక్షుడు అహ్మద్ అల్ షరాతో వైట్ హౌస్ లో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. అల్ షరాకు ఒక పెర్ఫ్యూమ్ బాటిల్‌ను బహుమతిగా ఇచ్చారు ట్రంప్. అంతేకాదు ఇది మంచి సువాసన వెదజల్లుతుందని, మీకు మీ సతీమణికి బాగుంటుందని చెప్పారు. అదే సమయంలో మీకు ఎంత మంది భార్యలు? అని అల్-షరాను ట్రంప్ ప్రశ్నించారు.

దీనికి సిరియా అధ్యక్షుడు ఒక్కరే అని సమాధానం ఇచ్చారు. ట్రంప్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ అది నిజమా? నమ్మలేకపోతున్నా అని అన్నారు. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా నవ్వేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

కాగా, అల్ షరా ఒకప్పుడు టెర్రరిస్ట్(జిహాదీ). ఆయనపై అమెరికా 10 మిలియన్ డాలర్ల బహుమతి కూడా ప్రకటించింది. అలాంటిదిప్పుడు అల్ షరా సిరియా దేశాధినేత అయ్యారు. అంతేకాదు ట్రంప్‌ పక్కన నిలబడ్డారు. ఇక అమెరికా పర్యటన ద్వారా అహ్మద్ అల్ షరా రికార్డ్ నెలకొల్పారు. 1946లో సిరియాకు ఫ్రాన్స్ నుంచి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత వాషింగ్టన్‌లో పర్యటించిన మొట్టమొదటి సిరియా అధ్యక్షుడు అల్ షరానే. సిరియాపై ఆంక్షల ఉపశమనాన్ని అమెరికా మరో 180 రోజుల పాటు పొడిగించింది. ఈ క్రమంలో ఈ పర్యటన జరిగింది.

20ఏళ్ల క్రితం అమెరికా నిర్బంధ కేంద్రంలో ఖైదీగా ఉన్నారు అల్ షరా. 2003లో ఇరాక్‌పై అమెరికా దండయాత్రకు ముందు అల్-ఖైదాలో చేరిన అల్ షరా.. ఇరాకీ తిరుగుబాటులో పాల్గొన్నారు. దీంతో అమెరికా దళాలు 2006 నుంచి 2011 వరకు ఆయనను నిర్బంధంలో ఉంచాయి. విడుదలైన తర్వాత సిరియా చేరుకుని అల్ ఖైదా అనుబంధ సంస్థ అల్ నుస్రా ఫ్రంట్ ఏర్పాటు చేశారు. ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కువగా ఉన్న ఇడ్లిబ్ వంటి ప్రాంతాల్లో బలమైన శక్తిగా ఎదిగారు.

ఆ తర్వాత అల్ ఖైదా నుంచి దూరం జరిగి వేలాది మంది తిరుగుబాటుదారులతో కలిసి 2017లో హయాత్‌ తహరీర్‌ అల్ షమ్ ను స్థాపించారు. గతేడాది డిసెంబర్‌లో అల్ షరా నాయకత్వంలోని దళాలు సిరియా మాజీ అధ్యక్షుడు బషర్ అల్ అసద్ ప్రభుత్వాన్ని గద్దె దించాయి.

Also Read: అమెరికాలో ముగిసిన 43 రోజుల షట్ డౌన్.. కానీ, భారీ నష్టమే మిగిల్చిందిగా.. 5 ముఖ్యమైన కారణాలు..