US China undersea internet cables war
Undersea internet cables war : నింగి, నేల, ఆకాశం ఇలా దేశాల మధ్య ఆధిపత్య పోరుకు హద్దుల్లేవు. ఇప్పుడు అమెరికా (America) చైనా (China) మధ్య కూడా ఆదిపత్య పోరు అంతకు మించి అన్నట్టుగా సాగుతోంది. ఇప్పుడదే ఆధిపత్య యుద్ధం.. సముద్ర గర్భంలోకి చేరింది. సమాచార విప్లవానికి వారధిగా ఉన్న సముద్రంలోని ఇంటర్నెట్ కేబుళ్లపై పెత్తనానికి.. రెండు దేశాల మధ్య ఘర్షణ వాతావరణం తలెత్తింది. దాంతో.. ఎన్నిరకాలుగా ప్రయత్నించాలో.. అన్ని రకాలుగా ప్రయత్నించిన అమెరికా.. ఈ ప్రాజెక్ట్ నుంచి చైనా కంపెనీలను తప్పించడంలో సక్సెస్ అయింది. అంతేకాదు తమ దేశ కంపెనీకి కట్టబెట్టుకోవటంలో విజయం సాధించింది.
అంతర్జాతీయ వాణిజ్యం, సిలికాన్ చిప్స్ (silicon chips), 5జీ టెక్నాలజీ (5G Technology), ఖనిజ గనులు, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, సముద్ర జలాలు, ఆయుధాలు.. ఇలా ప్రతి రంగంలో పోటీ పడుతున్న అమెరికా, చైనా మధ్య.. ఆధిపత్య యుద్ధం మరింత ముదిరింది. ఈసారి అది సముద్ర గర్భంలోకి చేరింది. ఫోన్లు, వీడియో చాట్లు, ఈమెయిల్స్, ఇన్ఫర్మేషన్, స్మార్ట్ టెక్నాలజీతో.. సమాచార విప్లవానికి కారణమై.. ప్రపంచాన్ని అరచేతిలోకి తెచ్చిన ఒకే ఒక్కటి ఇంటర్నెట్. ఆ ఇంటర్నెట్ సక్రమంగా పని చేస్తోందంటే.. సముద్రగర్భంలో వేసిన కేబుల్ లైన్లే కారణం. ఇలా.. అన్ని సముద్రాల్లో ఏర్పాటు చేసిన దాదాపు 9 లక్షల మైళ్ల ఫైబర్ ఆప్టికల్ కేబుళ్ల ద్వారానే.. ప్రపంచంలో 95 శాతం డాటా అనుక్షణం ప్రసారమవుతూ ఉంటుంది.
సముద్ర గర్భంలో ఏర్పాటు చేసిన ఈ కేబుల్ వ్యవస్థ ద్వారానే.. ఖండాంతరాలుగా ఇంటర్నెట్ సదుపాయం అందుతోంది. ఇప్పుడు మనం చూస్తున్న ఈ కేబుల్ వ్యవస్థలే.. చైనా, అమెరికా మధ్య.. సముద్రంలో కొత్త హీట్ పుట్టించాయ్. రెండు దేశాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధానికి ఆయుధాలవుతున్నాయ్. చాలా కాలంగా ఈ అండర్ ఓషియన్ కేబుల్ వ్యవస్థ.. అమెరికా కంపెనీల చేతుల్లో సాగుతోంది. తాజాగా చైనాకు చెందిన కన్సార్షియం రంగంలోకి దిగటంతో.. సమస్య మొదలైంది. ఆసియా, పశ్చిమాసియా, ఐరోపాలను కలుపుతూ.. సింగపూర్ నుంచి ఫ్రాన్స్ దాకా సాగే సముద్రగర్భ కేబుల్‌లైన్ వేసేందుకు అమెరికాకు చెందిన సబ్‌కామ్ కన్సార్షియానికి పోటీగా.. చైనా కంపెనీ హెచ్‌ఎంఎన్ టెక్ కేబుల్ నెట్‌వర్క్స్ ముందుకొచ్చింది.
డ్రాగన్ కంట్రీకి చెందిన కన్సార్షియంలో వివిధ దేశాల కంపెనీలతో పాటు చైనా టెలికాం దిగ్గజం హువావే కూడా ఉండటమే వివాదానికి దారితీసింది. ఎందుకంటే.. ఇప్పటికే హువావే కంపెనీని.. అమెరికాతో పాటు అనేక ఐరోపా దేశాలు దూరం పెట్టాయి. ఇందుకు.. హువావే చైనా ప్రభుత్వం, కమ్యూనిస్ట్ పార్టీ అనుబంధ సంస్థగా.. ఆ దేశాలు ఆరోపిస్తున్నాయ్. 5జీ నెట్‌వర్క్‌ల ఏర్పాటులోనూ ఈ కంపెనీని.. అమెరికాతో పాటు అనేక ఐరోపా దేశాలు దూరం పెట్టాయి. ఈ హువావే కంపెనీ.. మొత్తం సమాచారాన్ని.. చైనా ప్రభుత్వంతో పంచుకుంటుందనే ఆరోపణలు కూడా ఉన్నాయి.
తాజాగా సముద్ర గర్భంలోని ఇంటర్నెట్ ఫైబర్ ఆప్టికల్ కేబుల్ వ్యవస్థపైనా.. హువావే రూపంలో చైనా ప్రభుత్వం నిఘా పెట్టబోతోందనేది అమెరికా ప్రధాన ఆరోపణ. ఈ కేబుళ్ల ద్వారా ప్రసారమయ్యే డేటాను, అంతర్జాతీయ ఆర్థిక లావాదేవీలను, మిలిటరీ సమాచారాన్ని చైనా ప్రభుత్వం గుప్పిట పెట్టుకునే ప్రమాదముంది. ఆప్టిక్ కేబుళ్లలోనే ఈ మేరకు ఏర్పాట్లు చేసే అవకాశం ఉందని.. యునైటెడ్ స్టేట్స్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇందుకు.. గతంలోనే హువావేపై భద్రతాపరమైన ఆరోపణలు వచ్చాయి.
Also Read: న్యూయార్క్ సిటీ మొత్తాన్ని చుట్టుముట్టిన తేనెటీగలు.. ఇబ్బంది పడుతున్న జనం
కెనడా, ఆఫ్రికా దేశాల్లో.. చైనా కంపెనీ డేటా చౌర్యాన్ని కూడా అమెరికా గుర్తుచేసింది. అందువల్ల.. ఈ ప్రాజెక్టును గనక చైనాకు చెందిన కన్సార్షియానికి అప్పజెబితే.. కేబుళ్లతో డేటా చోరీకి పాల్పడే అవకాశం ఉందని అమెరికా వాదిస్తోంది. ఇక.. బైడెన్ ప్రభుత్వం పరోక్షంగా రంగంలోకి దిగి.. కన్సార్షియంలోని కంపెనీలను దారిలోకి తేవటం మొదలెట్టింది. ప్రభుత్వాలు కూడా ఒత్తిడి తేవటంతో.. కన్సార్షియంలోని వివిధ దేశాల కంపెనీలు.. చివరకు అమెరికాకు చెందిన కంపెనీ సబ్‌కామ్‌కే మొగ్గు చూపాయి. దాంతో.. ప్రాజెక్ట్ సబ్‌కామ్‌కే దక్కింది. చైనా హెచ్‌ఎంఎన్ నెట్‌వర్క్స్ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుంది.
Also Read: మనిషిని మాయం చేస్తోన్న టెక్నాలజీ.. ఆన్‌లైన్ కంటెంట్‌తో భయంకర నేరాలు
టెలికాం రంగంలో చైనా పెత్తనం లేకుండా.. అమెరికా ఎప్పటికప్పుడు, ఎక్కడికక్కడ జాగ్రత్త పడుతోంది. చైనా కంపెనీలు సైబర్, టెలికాం నెట్‌వర్క్‌ల ద్వారా నిఘా వేస్తున్నాయనే అనుమానంతోనే.. ఇదంతా చేస్తోంది. అందుకోసమే.. తమ దేశంతో నేరుగా సంబంధం లేకున్నా ఆసియా-ఐరోపా కేబుల్ లైన్ గురించి అమెరికా పట్టుబట్టి మరీ.. చైనా కంపెనీని తప్పించిందని.. అంతర్జాతీయ నిపుణులు చెబుతున్నారు. గతంలో అమెరికా కంపెనీలు.. చైనా టెలికాం పరికరాలు వాడటానికి వీలుండేది. 2021 తర్వాత నుంచి దేశ భద్రతకు ముప్పని చెబుతూ.. చైనా టెలికాం పరికరాలకు అమెరికా ప్రభుత్వం అనుమతి ఉపసంహరించింది. అంతేకాదు.. చైనా టెలికాం కంపెనీలు అమెరికా గడ్డపై నుంచి కార్యకలాపాలు నిర్వహించకుండా నిషేధం విధించింది.
అమెరికా, చైనా మధ్య ఓ రేంజ్‌లో ఆధిపత్య పోరు.. వివరాలకు ఈ వీడియో చూడండి..