Humanoid Robot Hugs: వామ్మో.. అమ్మాయిని కౌగిలించుకున్న హ్యూమనాయిడ్ రోబో.. ఆందోళనకు గురి చేస్తున్న మర మనిషి ప్రవర్తన
విశ్వవిద్యాలయంలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది. ఆ రోబో తనంతట తానుగా అలా ప్రవర్తించిందా? లేక దానిని ఆపరేట్ చేసిన వ్యక్తి ద్వారా నియంత్రించబడిందా?
Humanoid Robot Hugs: హ్యూమనాయిడ్ రోబో.. ఇదొక అద్భుతం అని చెప్పాలి. మనిషి కాని మనిషి ఈ మర మనిషి. ఈ మర మనిషి చేసే పనులు మనుషులను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. వీటి క్రియేటివిటీకి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. హ్యూమనాయిడ్ రోబో గురించి అంతా గొప్పగా చెప్పుకుంటున్నారు. అయితే, అదే సమయంలో ఈ రోబోలు చేసే పనులు ఆందోళనకు గురి చేస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో ఈ రోబోలు విపరీతంగా ప్రవర్తిస్తున్నాయి. వీటి అనూహ్య తీరు విస్మయానికి గురి చేస్తుంది. తాజాగా ఒక హ్యూమనాయిడ్ రోబో చేసి పని అందరినీ షాక్ కి గురి చేసింది. ఇంతకీ అది ఏం చేసిందో తెలుసా.. ఓ అమ్మాయిని గట్టిగా కౌగిలించుకుంది.
చైనాలోని ఒక విశ్వవిద్యాలయంలో జరిగిన నృత్య కార్యక్రమంలో ఈ అనూహ్య ఘటన జరిగింది. డ్యాన్స్ ఈవెంట్ లో ప్రదర్శన ఇస్తున్న ఒక హ్యూమనాయిడ్ రోబోట్ అకస్మాత్తుగా ఒక విద్యార్థినికి దగ్గరగా వెళ్లి ఆమెను కౌగిలించుకోవడంతో ప్రేక్షకులు ఉలిక్కిపడ్డారు. వెంటనే అలర్ట్ అయిన సిబ్బంది దాన్ని వెనక్కి లాగారు.
చైనాలోని షాన్సీ ప్రావిన్స్‌లోని విశ్వవిద్యాలయంలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది. ఆ రోబో తనంతట తానుగా అలా ప్రవర్తించిందా? లేక దానిని ఆపరేట్ చేసిన వ్యక్తి ద్వారా నియంత్రించబడిందా? అనే విషయంపై సోషల్ మీడియాలో చర్చ మొదలైంది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో దేశ సామర్థ్యాన్ని ప్రదర్శించాలనే ఉద్దేశంతో చైనా.. హ్యూమనాయిడ్ రోబోలను ప్రోత్సహిస్తోంది. అయితే, తాజాగా జరిగిన అనూహ్య సంఘటన ఆందోళనకు గురి చేస్తోంది హ్యూమనాయిడ్ రోబోల విషయంలో మెరుగైన భద్రతా చర్యలు అవసరం అని నొక్కి చెబుతోంది.
క్యాంపస్ సాంస్కృతిక కార్యక్రమాల్లో కొత్తదనం తీసుకురావడానికి రోబో, విద్యార్థి కలిసి ప్రదర్శన ఇచ్చారని వర్సిటీ అధికారులు తెలిపారు. ఈ ఘటనలో విద్యార్థినికి ఎలాంటి గాయాలు కాలేదని వెల్లడించారు. రోబో అనూహ్య ప్రవర్తన ఆన్లైన్లో చర్చకు దారితీసింది. కొంతమంది నెటిజన్లు రోబోకు ‘స్వతంత్ర చైతన్యం’ వచ్చిందా అని ఆశ్చర్యపోగా, మరికొందరు ఈ చర్యను ఒక ఆపరేటర్ నియంత్రించారా లేక ప్రదర్శనలో భాగంగా ముందే ఏర్పాటు చేశారా అని ప్రశ్నించారు.
పొరపాటు ఎక్కడ జరిగింది?
నివేదిక ప్రకారం, ఒక విశ్వవిద్యాలయ సిబ్బంది ఈ చర్య ముందుగా ప్రోగ్రామ్ చేయబడిందని ఖండించారు. “ఆ సమయంలో మాకు అర్థమైన దాని ప్రకారం, రోబోట్ పొరపాటు చేసింది” అని అన్నారు. ఆ “పొరపాటు” ఒక ఏఐ (AI) ప్రోగ్రామ్ లోపం వల్ల జరిగిందని ఆ సిబ్బంది చెప్పినట్లు సమాచారం.
ప్రదర్శనలో ఉపయోగించిన రోబోను పూర్వ విద్యార్థులు స్థాపించిన ఒక కంపెనీ అందించింది. కార్యక్రమం తర్వాత దానిని తిరిగి ఇచ్చేశారు. తర్వాత విశ్వవిద్యాలయం ఆ కంపెనీని సంప్రదించగా, కార్యక్రమ వేదిక వద్ద సిగ్నల్ అంతరాయం కారణంగా ఈ సంఘటన జరిగిందని ఆ కంపెనీ పేర్కొన్నట్లు సమాచారం. కంపెనీ ప్రకారం, ప్రదర్శన సమయంలో అనేక డ్రోన్లు ఏకకాలంలో పనిచేయడం వల్ల, సిగ్నల్స్‌కు అంతరాయం కలిగి, రోబో అసాధారణంగా ప్రవర్తించిందని, అంతే తప్ప ఇది ముందుగా ఏర్పాటు చేసింది కాదని వివరణ ఇచ్చింది.
ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఈ సంఘటన చలన నియంత్రణలోని లోపాలు, తగినంత భద్రతా ఏర్పాట్లు లేకపోవడం వల్ల జరిగి ఉండొచ్చు. దీనిని రోబోకు స్వతంత్రంగా చైతన్యం వచ్చినట్లుగా భావించరాదని చోంగ్‌కింగ్ నార్మల్ యూనివర్శిటీలోని ఇంటెలిజెంట్ అండ్ కాగ్నిటివ్ లాబొరేటరీ డిప్యూటీ డైరెక్టర్ గావో తెలిపారు.
During a performance a university sports event in Shaanxi, a dancing robot suddenly turned and hugged a female dancer beside it before staff quickly stepped in and pulled it away. The clip sparked jokes online, with some asking: “Has it developed self-awareness already?!” pic.twitter.com/E1NsYZ4EGg
— Shanghai Daily (@shanghaidaily) April 24, 2026
Also Read: UPI మాయాజాలం.. ఎంత సంపాదించినా.. నెలాఖరులో అప్పు.. అసలేం జరుగుతుందో తెలుసా..!
