Elon Musk: ఇండియాకు ఎలాన్ మస్క్..! ప్రధాని మోదీతో మాట్లాడాక మస్క్ మామ బిగ్ అనౌన్స్ మెంట్..

డొనాల్డ్ ట్రంప్ పరిపాలనలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల్లో ఒకరిగా మస్క్ పరిగణించబడుతున్నారు.

Elon Musk

Elon Musk: అపర కుబేరుడు, స్పేస్ ఎక్స్, టెస్లా సంస్థల అధినేత ఎలాన్ మస్క్ భారత్ కు రానున్నారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. త్వరలోనే తాను ఇండియాకు వస్తానని స్వయంగా మస్క్ మామే ప్రకటించారు. ఈ సంవత్సరం చివరలో భారతదేశాన్ని సందర్శించడానికి నేను ఎదురు చూస్తున్నా అని ఎక్స్‌ వేదికగా మస్క్ వెల్లడించారు.

శుక్రవారం ప్రధాని మోదీ ఎలాన్ మస్క్ తో ఫోన్ లో మాట్లాడారు. టెక్నాలజీ, ఆవిష్కరణ రంగాల్లో కలిసి పనిచేసే అవకాశాలపై మస్క్‌తో చర్చించారు. ఇది జరిగిన ఒకరోజు తర్వాత.. తాను ఇండియాకు రావాలని అనుకుంటున్నట్లు మస్క్ తెలపడం విశేషం. ప్రధాని మోదీతో సంభాషణను ఆయన గౌరవంగా అభివర్ణించారు. ఇది భారత్, మస్క్ సంస్థల మధ్య బలపడే సంబంధాలను సూచిస్తుంది.

గతేడాది సార్వత్రిక ఎన్నికలకు ముందే మస్క్‌ ఇండియాలో పర్యటించాల్సి ఉన్నా.. చివరి నిమిషంలో తన ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నారు. అప్పట్లో ఆయన చైనాను సందర్శించారు.

Also Read: ట్రంప్, మస్క్ మధ్య చిచ్చు.. ఆ మీటింగ్‌లకు ఎలాన్‌ మస్క్‌కి నో ఎంట్రీ..?

ఎలాన్‌ మస్క్‌తో సంభాషణ గురించి ప్రధాని మోదీ ఎక్స్ లో వెల్లడించారు. ”పలు అంశాలపై ఎలాన్ మస్క్ తో మాట్లాడటం జరిగింది. ఈ ఏడాది ఆరంభంలో వాషింగ్టన్‌లో మా భేటీ సందర్భంగా చర్చించిన అంశాలూ ప్రస్తావనకు వచ్చాయి. సాంకేతికత, ఆవిష్కరణ రంగాల్లో పరస్పర సహకారానికి ఉన్న ప్రాముఖ్యతపై చర్చించాము. ఈ రంగాల్లో అమెరికాతో భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు భారత్‌ కృతనిశ్చయంతో ఉంది’’ అని ప్రధాని మోదీ ఎక్స్ లో తెలిపారు. దీనికి స్పందనగా మస్క్‌ తన భారత పర్యటనను ధ్రువీకరించారు.

డొనాల్డ్ ట్రంప్ పరిపాలనలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల్లో ఒకరిగా మస్క్ పరిగణించబడుతున్నారు. ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించడం, సమాఖ్య శ్రామిక శక్తిని తగ్గించడం లక్ష్యంగా ప్రభుత్వ సామర్థ్య శాఖ (DOGE) కు నాయకత్వం వహిస్తున్నారు.

మస్క్‌ నేతృత్వంలోని టెస్లా, స్టార్‌లింక్‌ సంస్థలు భారత మార్కెట్ లోకి అడుగు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్న సంగతి తెలిసిందే. స్టార్‌ లింక్‌ ప్రతినిధులు ఇటీవల కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌తో చర్చలు జరిపారు. సాంకేతికత, భాగస్వామ్యాలు, పెట్టుబడి ప్రణాళికలపై చర్చించారు. అుట ప్రముఖ టెలికాం కంపెనీలు ఎయిర్‌టెల్‌, జియో ఇప్పటికే స్టార్‌ లింక్‌ సేవల కోసం స్పేస్‌ ఎక్స్‌తో ఒప్పందం చేసుకున్నాయి. భద్రత, స్పెక్ట్రమ్ అంశాలకు సంబంధించి కేంద్రం నుంచి అనుమతులు రావాల్సి ఉంది.

మరిన్ని ఇంట్రస్టింగ్ స్టోరీలు, అప్‌డేట్స్ కోసం 10టీవీ వాట్సాప్ చానల్‌ని ఫాలో అవ్వండి.. Click Here