ICC Issues Arrest Warrants For Netanyahu
ICC Arrest Warrants : మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న వివాదం మధ్య అంతర్జాతీయ క్రిమినల్ కోర్ట్ (ICC) సంచలన నిర్ణయం తీసుకుంది. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, ఇజ్రాయెల్ మాజీ రక్షణ మంత్రి యోవ్ గల్లంట్‌లపై ఐసీసీ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. గాజాలో కొనసాగుతున్న సంఘర్షణకు ఇద్దరు నేతలే కారణమని, మానవత్వానికి వ్యతిరేకంగా యుద్ధ నేరాలకు పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలతో అంతర్జాతీయ కోర్టు అరెస్ట్ వారెంట్లను జారీ చేసింది.
నెతన్యాహు, గాలంట్ ఆకలిని యుద్ధ పద్ధతిగా ఉపయోగించి యుద్ధ నేరానికి పాల్పడ్డారనేందుకు ఆధారాలు ఉన్నాయని ఐసీసీ పేర్కొంది. ఐసీసీ ప్రీ-ట్రయల్ ఛాంబర్ I, ముగ్గురు న్యాయమూర్తుల ప్యానెల్, ఇజ్రాయెల్ అధికార పరిధిని సవాలు చేస్తూ చేసిన అప్పీళ్లను తిరస్కరించినట్లు తెలిపింది. ఐసీసీ వారెంట్ల ప్రకారం.. 122 సభ్య దేశాల భూభాగంలోకి నెతన్యాహూ, గాలంట్ ప్రవేశించిన వెంటనే అరెస్ట్ చేయాలని ఐసీసీ ఆదేశాల్లో వెల్లడించింది. నెతన్యాహు నెదర్లాండ్స్‌కు వెళితే ఐసీసీ వారెంట్‌పై అరెస్టు చేస్తుందని డచ్ విదేశాంగ మంత్రి కాస్పర్ వెల్డ్‌క్యాంప్ చెప్పినట్లు బీఎన్‌ఓ న్యూస్ నివేదించింది.
2024 అక్టోబర్ 7న హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయిల్‌పై దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో 12 వందల మందిని హతమార్చారు. 240 మందిని ఇజ్రాయిల్ బందీలుగా గాజాలోకి తరలించారు. అప్పుడే, ఇజ్రాయిల్ గాజాలోని హమాస్‌పై యుద్ధాన్ని ప్రకటించింది. అలా కొనసాగుతున్న యుద్ధంలో హమాస్ మిలిటెంట్లు, సామాన్య ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 44వేలకు పైనే యుద్ధంలో చనిపోయారు. ఇంకా 101 మంది ఇజ్రాయిలీ బందీలు గాజాలోనే మగ్గిపోతున్నారు. వీరందరి కోసం ఇజ్రాయిల్ గాలిస్తోంది.
ఇజ్రాయెల్ అధికారిక గణాంకాల ప్రకారం.. ఇజ్రాయెల్‌పై అక్టోబర్ 7న హమాస్ జరిపిన దాడి ఫలితంగా 1,170 మందికి పైగా మరణించారు. వీరిలో ఎక్కువ మంది పౌరులే ఉన్నారు. హమాస్ 252 మందిని కూడా బందీలుగా చేసుకుంది. వీరిలో 124 మంది గాజాలో ఉన్నారు. ఇందులో 37 మంది చనిపోయారని సైన్యం తెలిపింది.
హమాస్ మిలటరీ చీఫ్ మొహమ్మద్ దీఫ్ అని పిలిచే మహ్మద్ దియాబ్ ఇబ్రహీం అల్-మస్రీకి హేగ్ ఆధారిత కోర్టు వారెంట్ జారీ చేసింది. ఈ ఏడాది ప్రారంభంలో గాజాలో వైమానిక దాడిలో డీఫ్‌ను హతమార్చినట్టు ఇజ్రాయెల్ గత ఆగస్టులో తెలిపింది. అయితే, హమాస్ దీన్ని ధృవీకరించలేదు.
గత మే 2024లో ఐసీసీ చీఫ్ ప్రాసిక్యూటర్ కరీం ఖాన్ యుద్ధ నేరాలు, మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడినందుకు ఇజ్రాయెల్ నేతలపై వారెంట్లు జారీ చేయాలని కోర్టులో విజ్ఞప్తి చేశారు. ఇజ్రాయెల్ హేగ్ ఆధారిత న్యాయస్థానం అధికార పరిధిని తిరస్కరించింది. గాజాలో యుద్ధ నేరాలను తిరస్కరించింది.
అంతర్జాతీయ క్రిమినల్ కోర్ట్ అంటే ఏంటి? :
ఐసీసీ 2002లో స్థాపించారు. నెదర్లాండ్స్‌లోని హేగ్‌లో ప్రధాన కార్యాలయం ఉంది. శాశ్వత ప్రపంచ న్యాయస్థానం. దురాగతాలు, యుద్ధ నేరాలు, మారణహోమాలు, మానవత్వానికి వ్యతిరేకంగా చేసిన నేరాలకు వ్యక్తులు, నాయకులను విచారిస్తుంది. 1991 నుంచి 2001 వరకు యుగోస్లావ్ యుద్ధాలు, 1994లో రువాండా మారణహోమం తర్వాత ఐసీసీ ఏర్పడింది. అంతర్జాతీయ న్యాయస్థానం (ICJ) మాదిరిగా ఐసీసీ రాష్ట్రాలను విచారించదు. ఐసీసీ యూఎన్ నుంచి స్వతంత్రంగా ఉన్నప్పటికీ, జనరల్ అసెంబ్లీచే ఆమోదించబడుతుంది.