వాతావరణ మార్పులకు ప్రప్రంచ దేశాలను పరిపాలిస్తున్న నాయకులే కారణమంటూ ప్రశ్నించి ప్రపంచం మన్ననలు పొందిన స్పీడన్ కు చెందిన 17ఏళ్ల పర్యావరణ కార్యకర్త గ్రేటా థన్ బర్గ్ వరుసగా రెండోసారి నోబెల్ శాంతి బహుమతికి ఎంపిక అయింది. వాతావరణ మార్పులపై ఎలాంటి స్టాండ్ తీసుకోని చట్టసభల సభ్యులకు వ్యతిరేకంగా నిరసనలు చేయడానికి యువకులను ప్రోత్సహించడానికి థన్ బర్గ్ చేసిన కృషికి గాను స్వీడన్ రాజకీయ నాయకులు జెన్స్ హోల్మ్ మరియు హకాన్ స్వెన్నెలింగ్ సోమవారం(ఫిబ్రవరి-3,2020)2020 నోబెల్ శాంతి బహుమతికి గ్రేటా థన్‌బర్గ్‌ను నామినేట్ చేశారు.
వాతావరణ సంక్షోభం పట్ల రాజకీయనాయకులు తమ కళ్లు తెరిచేలా గ్రేటా థన్ బర్గ్ చాలా కృషి చేసిందని, మా ఉద్గారాలను తగ్గించే చర్య మరియు పారిస్ ఒప్పందాన్ని పాటించేలా చేయడం కూడా శాంతిని కలిగించే చర్య అని గ్రేటాను నోబెల్ కు నామినేట్ చేసిన జెన్స్ హోల్మ్, హకాన్ స్వెన్నెలింగ్ తెలిపారు. 2019లో కూడా గ్రేటా నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయింది. కానీ అంతర్జాతీయ శాంతిని సాధించేందుకు చేసిన కృషికిగాను,ముఖ్యంగా సరిహద్దు దేశమైన ఎరిట్రియాతో సంఘర్షణను తగ్గించడంలో ప్రత్యేకంగా చేసిన కృషికిగాను ఇథియోపియన్ ప్రధానమంత్రి అబై అహ్మద్ కు 2019 నోబెల్ శాంతి బహుమతి దక్కింది. అహ్మద్ సహా అంతకుముందు ఈ నోబెల్ శాంతి బహుమతి అందుకున్న విజేతలతో దాదాపు అందరూ పురుషులే కావడం విశేషం.
ఒకవేళ ఈ సంవత్సరం థన్‌బెర్గ్ గెలిస్తే, నోబెల్ బహుమతి గ్రహీత బిరుదు పొందిన 54 వ మహిళగా ఉంటుంది. నోబెల్ శాంతి బహుమతిని పొందిన 18వ మహిళ మాత్రమే అవుతుంది. 1901 నుండి 866 మంది పురుషులు నోబెల్ బహుమతి గ్రహీతలు కాగా ,90 మంది పురుషులు నోబెల్ శాంతి బహుమతిని అందుకున్నారు. ఈ అవార్డుల యొక్క 118 సంవత్సరాల చరిత్రలో… తనకు ముందు ఈ అవార్డుకు నామినేట్ అయిన మహిళా ఆవిష్కర్తల వరుసలో దగ్గరగా గ్రేటా థన్ బర్గ్ ఉంటుంది. నోబెల్ శాంతి బహుమతిని గెలుచుకున్న చివరి మహిళ 2018 లో మానవ హక్కుల కార్యకర్త నాడియా మురాద్.
మహిళల మరియు బాలికల విద్య హక్కుల కోసం పోరాడిన మలాలా యూసఫ్‌జాయ్ 2014 లో పిల్లల హక్కుల కార్యకర్త కైలాష్ సత్యార్థితో కలిసి నోబెల్ శాంతి బహుమతిని గెలుచుకున్నారు. పిల్లలు, యువకులను అణచివేయడానికి వ్యతిరేకంగా చేసిన పోరాటం మరియు పిల్లలందరికీ విద్యపై హక్కు కోసం చేసిన పోరాటానికి వారు ఈ బహుమతిని అందుకున్నారు.