Indus Waters Treaty
Indus Waters Treaty: జమ్మూకశ్మీర్ లోని పహల్గాం ప్రాంతంలో పర్యటకులపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడటంతో 26 మంది పర్యటకులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనను భారత ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఈ ఉగ్రదాడి వెనుక పాకిస్థాన్ హస్తం ఉందని భావిస్తున్న భారత్.. ఆ దేశానికి బుద్ధిచెప్పేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో ప్రధాని మోదీ అధ్యక్షతన భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (సీసీఎస్) సమావేశమైంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సీమాంతర ఉగ్రవాదానికి ముగింపు పలికే వరకూ పాక్ తో సింధు నదీ జలాల ఒప్పందం నిలిపివేయనున్నట్లు ప్రకటించింది. భారత్ తీసుకున్న ఈ నిర్ణయంతో పాకిస్థాన్ బెంబేలెత్తిపోతుంది.
సింధు జలాల ఒప్పందం (IWT) పై 1960 సెప్టెంబర్ 19వ తేదీన భారత తొలి ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ, పాకిస్థాన్ అప్పటి అధ్యక్షుడు అయూబ్ ఖాన్ లు సంతకాలు చేశారు. ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వం వహించిన తొమ్మిది సంవత్సరాల తరువాత ఈ ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందంలో భాగంగా సింధు నది పరీవాహక ప్రాంతం నుండి 80శాతం నీటిని భారతదేశం ఎగువ నదీతీర రాష్ట్రంగా పాకిస్థాన్ కు అందిస్తుంది. పాకిస్థాన్ లోని టార్బెలా, మంగ్లా వంటి జలవిద్యుత్ కేంద్రాలు ఈ నదీ పరివాహకంలోని నిరంతర నీటి ప్రవాహాలపై ఆధారపడి విద్యుత్ ను ఉత్పత్తి చేస్తుంటాయి.
సింధు నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం ద్వారా పాకిస్థాన్ లో వ్యవసాయ రంగంపైనే కాకుండా ఆ దేశ విద్యుత్ సరఫరాపైకూడా ప్రభావం చూపుతుంది. ఇప్పటికే ఉన్న జల లభ్యత అస్థిరత, నీటి కొరత కారణంగా పాకిస్థాన్ ప్రతీయేటా 19 మిలియన్ టన్నుల బొగ్గును దిగుమతి చేసుకుంటుంది. బొగ్గు దిగుమతుల కారణంగా ఆ దేశంపై ఆర్థిక భారం 2021 నాటికి యూఎస్డీ 1.5 బిలియన్లకు చేరుకుంది. ప్రస్తుతం పాకిస్థాన్ దేశం జీడీపీలో 60శాతం కంటే ఎక్కువ అప్పుల్లో కూరుకుపోయి కొట్టుమిట్టాడుతోంది.
2025లో పాకిస్థాన్ జీడీపీ కేవలం 2.7శాతం మాత్రమే పెరుగుతుందని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. ఆ దేశం జీడీపీకి ప్రధానంగా వ్యవసాయ రంగం దోహదపడుతుండగా.. పరిశ్రమలు ఆ తరువాత స్థానంలో ఉన్నాయి. ఇంధన రంగం ప్రత్యక్ష సహకారం జీడీపీకి 2.5 నుంచి 3శాతం అయితే.. పరోక్షంగా తయారీ, వ్యవసాయం, ఇతర సేవల నుంచి దాని సహకారం భారీగా ఉంది.
పాకిస్థాన్ ఇంధన రంగం ఇప్పటికే పాకిస్థాన్ రూపాయిల్లో 5.4 ట్రియన్లకుపైగా రుణాన్ని కలిగిఉంది. పాకిస్థాన్ ప్రభుత్వం 2031 నాటికి విద్యుత్ పునరుత్పాదక శక్తి వాటాను 33శాతం నుంచి 62శాతానికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2024 నాటికి విద్యుత్ సామర్థ్యంలో జలవిద్యుత్ దాదాపు 25శాతం అంటే 42,131 మెగావాట్లలో 10.681 మెగావాట్లను అందిస్తుంది.
పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థకు సింధు వాటర్ ఒప్పందం చాలా ముఖ్యమైంది. పాకిస్థాన్ లోని టర్బెలా, మంగ్లా వంటి విద్యుత్ కేంద్రాలు సింధు, జీలం నదులపైనే ఆధారపడి ఉన్నాయి. పాకిస్థాన్ దేశంలో విద్యుత్ వినియోగంలో పరిశ్రమలు రెండో స్థానంలో ఉన్నాయి. కరాచీ, లాహోర్, ముల్తాన్ వంటి ప్రధాన పట్టణ కేంద్రాలు ఈ నదుల నుండి నేరుగా నీటిని తరలిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సింధు వాటర్ ఒప్పందంను నిలిపివేస్తూ భారత్ తీసుకున్న నిర్ణయంతో పాకిస్థాన్ లో విద్యుత్ సంక్షోభం తలెత్తడం ఖాయమని నిపుణులు చెబుతున్నారు.