India
India Ukraine : రష్యా, యుక్రెయిన్ మధ్య సైనిక పోరు భీకరంగా కొనసాగుతోంది. ఐదో రోజూ(ఫిబ్రవరి 28) రష్యా సేనలు యుక్రెయిన్ లోకి దూసుకొచ్చాయి. బాంబుల వర్షం కురిపించాయి. మరోవైపు యుక్రెయిన్ సైన్యం సైతం తగ్గేదేలే అంటోంది. రష్యా బలగాలకు ఎదురొడ్డి నిలుస్తోంది.
యుక్రెయిన్ పై(Ukraine) రష్యా దాడుల నేపథ్యంలో భారత్(India) కీలక నిర్ణయం తీసుకుంది. యుక్రెయిన్ కు సాయం చేసేందుకు సిద్ధమైంది. మానవతా దృక్పథంతో యుక్రెయిన్ కు సాయం చేయనున్నట్టు భారత్ ప్రకటించింది. యుక్రెయిన్ కు నిత్యావసరాలు, ఔషధాలు, వైద్య సిబ్బందిని పంపేందుకు సిద్ధంగా ఉన్నట్టు భారత్ తెలిపింది. యుక్రెయిన్ వెళ్లేందుకు వైమానిక దళం రెడీగా ఉందని కేంద్ర విదేశాంగ శాఖ ప్రకటించింది.
Russia-Ukraine : రష్యా, యుక్రెయిన్ మధ్య చర్చలు విఫలం
రష్యా, యుక్రెయిన్ మధ్య పోరు విషయంలో తటస్థంగా ఉండాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్న భారత్… తాజాగా యుక్రెయిన్ కు సాయం చేయాలని నిర్ణయించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
రష్యా దాడులతో ఉక్కిరిబిక్కిరవుతున్న యుక్రెయిన్‌కు క్రమంగా ఒక్కో దేశం ముందుకు వచ్చి మిలటరీ సాయంతో అండగా నిలుస్తున్నాయి. ఇప్పటికే భారీ స్థాయిలో ఆయుధాలు అందజేస్తున్న ఈయూ సమాఖ్య దేశాలు.. తాజాగా యుద్ధ విమానాలను సైతం పంపడానికి సిద్ధమయ్యాయి. ‘‘మేం యుద్ధ విమానాలను కూడా పంపుతాం. కేవలం ఆయుధాలు పంపడం గురించే మాట్లాడడం లేదు. యుద్ధానికి కావాల్సిన కీలక ఆయుధాలను సైతం అందజేస్తున్నాం’’ అని ఈయూ సమాఖ్య విదేశీ విధానం విభాగపు అధిపతి జోసెఫ్ బోరెల్ అన్నారు.
తక్షణమే కాల్పులు ఆపాలని రష్యా, యుక్రెయిన్ దేశాలకు ఐక్యరాజ్య సమితి పిలుపునిచ్చింది. ఇరు దేశాలు సంయమనం పాటించడంతో పాటు ఇరు దేశాల మధ్య శాంతి నెలకొనేలా చర్చలను ప్రారంభించాలని యూఎన్ జనరల్ అసెంబ్లీ సూచించింది.
రష్యా యుద్ధోన్మాదం కారణంగా ఉక్రెయిన్‌లో నెలకొన్న సంక్షోభం నేపథ్యంలో యూఎన్ జనరల్ అసెంబ్లీ సమావేశాన్ని సోమవారం అత్యవసరంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రష్యాతో పాటు ఉక్రెయిన్ కూడా సంయమనం పాటించాలని యూఎన్ఓ సూచించింది. సమావేశం సందర్భంగా రష్యా యుద్ధం కారణంగా చనిపోయిన మృతులకు సంతాపం ప్రకటించింది.
ఈ సందర్భంగా జనరల్ అసెంబ్లీలో యూఎన్ సెక్రటరీ జనరల్ ఆటోనియో గుటెరస్ ఇరు దేశాలకు పలు సూచనలు చేశారు. నానాటికీ పెరిగిపోతున్న హింస ద్వారా అనేక మంది సాధారణ పౌరులు చనిపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటిదాకా జరిగిన దానిని పక్కనపెట్టేసి ఇరు దేశాల సైనికులు తమ స్థావరాలకు వెళ్లిపోవాలని ఆయన సూచించారు. హింసతో సమస్యలకు పరిష్కారం లభించదని, శాంతితోనే సమస్యలు పరిష్కారమవుతాయని ఆయన చెప్పారు. యుద్ధం కారణంగా ఇబ్బందుల్లో పడ్డ యుక్రెయిన్‌కు చేయూతనందిస్తుందని, ఆ దేశాన్ని అలా వదిలేయమని కూడా గుటెరస్ చెప్పారు.
మరోవైపు ప్రపంచ దేశాలన్నీ భయపడినట్టుగానే అయ్యింది. యుద్ధంతో హోరాహోరీగా తలపడుతున్న రష్యా, యుక్రెయిన్ల మధ్య సోమవారం మధ్యాహ్నం మొదలైన చర్చలు విఫలమయ్యాయి. బెలారస్ వేదికగా జరిగిన ఈ చర్చల్లో ఇరు దేశాలు తమ తమ వాదనలకే కట్టుబడి సాగాయి. ప్రత్యర్థి వర్గం చేసిన డిమాండ్లను ఇరు దేశాలు కూడా పరిగణనలోకి తీసుకోలేదు. ఈ కారణంగా గంటల తరబడి సాగిన ఈ చర్చలు సింగిల్ తీర్మానం కూడా లేకుండానే ముగిశాయి.