గణతంత్ర వేడుకలు రద్దు: కారణం ఇదే!

ప్రపంచాన్ని గజగజలాడిస్తోన్న ‘కరోనా వైరస్’ గణతంత్ర వేడుకలు రద్దయ్యేలా చేసింది. చైనా రాజధాని బీజింగ్‌లో ఇండియన్ ఎంబసీలో జరిపే రిపబ్లిక్ డే ఉత్సవాలను రద్దు చేశారు అధికారులు. చైనాలో కరోనా వైరస్ విజృంభిస్తూ ఇప్పటికే 25 మందిని బలి తీసుకోగా.. మరో 800 మంది పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఈ క్రమంలో జనవరి 26వ తేదీన జరిగే రిపబ్లిక్ డే వేడుకలను రద్దు చేస్తున్నట్గుగా ఇండియన్ ఎంబసీ ప్రకటనలో తెలిపింది.

కరోనా వైరస్ వ్యాపిస్తుండడంతో చైనాలో ప్రజలు పెద్ద ఎత్తున గుమి కూడడంపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. హెల్త్ ఎమర్జెన్సీ కారణంగా చైనాలోని ఎంబసీలో కూడా ఈ మేరకు ఆంక్షలు విధించింది. చైనాలోని భారతీయుల క్షేమ సమాచారం కోసం రెండు హాట్ లైన్లను కూడా ఎంబసీ ఏర్పాటు చేసింది. చైనాలోని భారత రాయబార కార్యాలయంను సమాచారం కోసం సంమప్రదించాలంటే +8618612083629 మరియు +8618612083617  ఫోన్ నంబర్లు అందుబాటులో ఉంటాయి.

ఇదే సమయంలో భారత్‌కు వెళ్లే చైనా వాళ్లకు కూడా బీజింగ్‌లోని భారత ఎంబసీ ట్రావెల్‌ అడ్వైజరీని జారీ చేసింది. విమానంలో ప్రయాణించే సమయంలో అస్వస్థతకు గురైతే వెంటనే సిబ్బందికి తెలియజేయాలని సూచించింది. ముఖానికి మాస్కులు ధరించాలని, చేతులను ఎప్పటికప్పుడు శుభ్రంగా కడుక్కోవాలని కోరింది. దగ్గే సమయంలో ముఖానికి ఏదైనా వస్త్రాన్ని అడ్డుపెట్టుకోవాలలంటూ సూచనలు చేసింది.