Ukrain Indians
Indian students: ఓవైపు రష్యా దాడులు, మరోవైపు వాటిని ఎదుర్కొనేందుకు యుక్రెయిన్ ప్రయత్నాలు.. ఇరువైపులా ప్రాణనష్టం విపరీతంగా ఉండగా.. ఇప్పటివరకు వందల మంది చనిపోయారు. అధికారికంగా తొలిరోజు 137మంది చనిపోయినట్లుగా అక్కడి ప్రభుత్వం చెబుతోంది. ఇదిలా ఉంటే యుక్రెయిన్‌లో కూడా భారత విద్యార్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
యుక్రెయిన్‌లో రష్యా సరిహద్దులో ఉన్న సుమీ నగరాన్ని రష్యా సైనికులు ఆక్రమించిన తర్వాత దాదాపు 400 మంది భారతీయ విద్యార్థులు నేలమాళిగలో ఆశ్రయం పొందారు. వారిని అక్కడి నుంచి ఖాళీ చేయించాలని భారత ప్రభుత్వాన్ని కోరుతున్నారు. వీరిలో ఎక్కువ మంది సుమీ స్టేట్ మెడికల్ కాలేజీ విద్యార్థులు. బయట కాల్పుల శబ్ధం వల్ల భద్రతపై ఆందోళన చెందుతున్నట్లు వారు చెబుతున్నారు.
భారత ప్రభుత్వానికి విద్యార్థుల విజ్ఞప్తి:
మా హాస్టల్‌లోని బేస్‌మెంట్‌లో మేం ప్రాణ భయంతో తలదాచుకుంటున్నాం.. ఎంతకాలం ఇక్కడ సురక్షితంగా ఉండగలమో తెలియట్లేదు.. విద్యార్థి లలిత్ కుమార్ ‘పీటీఐ’తో మాట్లాడుతూ.. యుక్రెయిన్ తూర్పు భాగం నుంచి తమని ఖాళీ చేయించాలని భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
యుక్రెయిన్‌లో మార్షల్ లా అమలు..
యుక్రెయిన్‌లో సొంతంగా ప్రయాణం చేయడం కుదరదని, ఇక్కడ మార్షల్ లా అమలులో ఉందని వారు చెబుతున్నారు. అంటే ఎవరూ బయటకు వెళ్లకూడదు, కార్లు, బస్సులు, ప్రైవేట్ వాహనాల్లో తిరగకూడదు. ఏటీఎంలు, సూపర్ మార్కెట్లు కూడా మూతపడ్డాయి. విద్యార్థులు దాక్కున్న బేస్‌మెంట్ వీడియోను కూడా వారు షేర్ చేశారు. ఇక్కడే ఉండాలంటే కూడా పెద్దగా అవసరాలకు తగ్గ సరుకులు లేవని కుమార్ చెప్పారు.
రష్యా, యుక్రెయిన్ మధ్య రెండవ రోజు యుద్ధం:
రష్యా, యుక్రెయిన్ మధ్య యుద్ధంలో ఈ రోజు రెండవ రోజు కాగా.. రాజధాని కీవ్‌లో రెండవ రోజు రెండు పెద్ద పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. గత 40 నిమిషాల్లో రాజధాని కీవ్‌పై కనీసం మూడు డజన్ల క్షిపణులు ప్రయోగించినట్లు యుఎస్ సెనేటర్ రూబియో చెప్పారు.