Indonesia Earthquake : పెను భూకంపం ఇండోనేషియాను వణికించింది. జావా ద్వీపాన్ని అల్లకల్లోలానికి గురి చేసింది. పదుల సంఖ్యలో భూకంపం ప్రజలను పొట్టన పెట్టుకుంది. వందలాది మంది గాయపడ్డారు. వేలాదిగా భవనాలు ధ్వంసమయ్యాయి.
భూప్రకంపనల కారణంగా మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటివరకు 56 మంది మరణించారు. 700 మందికి పైగా గాయపడ్డారు. ప్రాణ నష్టం పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. వేలాది ఇల్లు, భవనాలు దెబ్బతిన్నాయి.
జావా సమీపంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. జావాలో భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 5.6గా నమోదైంది. భూకంపం సంభవించిన ప్రాంతాలు భయానకంగా మారాయి. భూకంపం ధాటికి ఇళ్లు, భవనాలు నేలమట్టం అయ్యాయి.
10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.
ఇండోనేషియాలో కీలక పట్టణాలు జావా, సియన్ జూర్ శిథిలాల దిబ్బగా మారాయి. వేల సంఖ్యలో భవనాలు నేలమట్టం అయ్యాయి. ఎటు చూసినా గాయపడిన వారే కనిపిస్తున్నారు. బాధితుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతం నిండిపోయింది.
అధికారులు సహాయక చర్యలను వేగవంతం చేశారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడేందుకు సహాయక సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. గత ఫిబ్రవరిలో కూడా ఇండోనేషియాలో భూకంపం వచ్చింది. అప్పుడు 6.2గా తీవ్రత నమోదైంది. ఇప్పుడు వచ్చింది 5.6 తీవ్రతే అయినా.. నగరానికి సమీపంలో రావడంతో పెద్ద ఎత్తున ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది.