International Coffee Day 2023 : కబుర్లు చెప్పుకోవాలంటే కాఫీ తాగాల్సిందే.. అసలు కాఫీ చరిత్ర తెలుసా మీకు?
'వీలైతే నాలుగు మాటలు.. కుదిరితే కప్పు కాఫీ'.. ఇది సినిమా డైలాగ్ అయినా స్నేహితులంతా కబుర్లు చెప్పుకునే వంకతో కాఫీ అడ్డాల దగ్గర కూర్చుంటారు. కాఫీ తాగితే ఒకలాంటి శక్తి వచ్చినట్లు ఫీలవుతారు. అసలు మీరు తాగే కాఫీ చరిత్ర తెలుసా?

International Coffee Day 2023
International Coffee Day 2023 : తెల్లారి లేచి కాఫీ తాగకపోతే డే స్టార్ట్ కాదు చాలామందికి. రోజులో ఒకసారైనా కాఫీ తాగాల్సిందే. కాఫీ ప్రియులు చాలామందే ఉంటారు. అయితే కాఫీకి ఓ చరిత్ర ఉందని మీకు తెలుసా? అక్టోబర్ 1 ‘ఇంటర్నేషనల్ కాఫీ డే’ (International Coffee Day). ఈ సందర్భంలో కాఫీ చరిత్ర ఏంటో తెలుసుకుందాం.
కాఫీ పంట మొదటగా ఆఫ్రికాలో మొదలైంది. 600 సంవత్సరాల క్రితం వీటిని అక్కడ కనుగొన్నారట. కాఫీ గింజలు మనం తాగే విధంగా రూపాంతరం చెందటానికి కొంచెం సమయం పట్టింది. కాఫీ తెలియని శక్తిని ఇస్తుంది, రిఫ్రెష్ చేస్తుంది. మెలకువగా ఉంచుతుంది. చరిత్ర ప్రకారం కాఫీ వాస్తవానికి ఇథియోపియా నుండి వచ్చిందట. ఆఫ్రికాలో దాని ఆవిష్కరణ వెనుక ఒక ఇంట్రెస్టింగ్ కథనం చెబుతారు. క్రీ.శ.700 ప్రాంతంలో మేకల మంద డ్యాన్స్ చేస్తూ వింతగా ప్రవర్తించిందట. వారి యజమాని కల్డి అనే వ్యక్తి అవి కొన్ని ఎర్రటి గింజలు తినడం వల్ల అలా ప్రవర్తిస్తున్నాయని నిర్ధారించుకున్నాడట. కాఫీ బీన్స్‌ను నిప్పులోకి విసరడంతో వాటి నుంచి ఆహ్లాదకరమైన వాసన వచ్చిందని ఆ తరువాత కనిపెట్టారట.
కాఫీ గింజలు 15 వ శతాబ్దంలో యెమెన్‌లోకి ప్రవేశించాయి. అక్కడ వాటిని ‘మోచా’ అని పిలిచేవారు. ఆ తర్వాత ఈజిప్ట్, పర్షియా, టర్కీలలోకి వచ్చాయి. వాటిని ‘వైన్ ఆఫ్ అరబీ’ ‘స్కూల్స్ ఆఫ్ ది వైజ్’ పేరుతో పిలవడం మొదలుపెట్టారట. ఆ తర్వాత అరేబియాలోకి ఆ తర్వాత దక్షిణ భారతదేశంలోకి వచ్చి భారత్ పెద్ద ఎత్తున ఈ పంటలు ప్రారంభించడానికి దోహదపడ్డాయట. 1600 లో ఐరోపాలో చాలా కాఫీ హౌస్‌లు పుట్టుకొచ్చాయి. ఆ తరువాత అమెరికాలో కనిపించాయి.
kidney Stones : కాఫీ తాగడం వల్ల కిడ్నీలో రాళ్లు వచ్చే ప్రమాదం పెరుగుతుందా లేదా తగ్గుతుందా?
‘వరల్డ్ కాఫీ డే’ని 2014 నుంచి జరుపుకుంటున్నాం. ‘ఇంటర్నేషనల్ కాఫీ ఆర్గనైజేషన్’ అక్టోబర్ 1 న ‘వరల్డ్ కాఫీ డే’ గా జరపాలని ప్రకటించింది. కాఫీ ప్రియులు ఈరోజుని ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. అంతేకాదు ఈరోజు కాఫీ గింజలు పండించే రైతుల కష్టాలపై అవగాహన కల్పించడానికి కూడా ఇది ప్రత్యేక సందర్భం. ఇదీ టూకీగా కాఫీ చరిత్ర.