International Joke Day 2023 : నవ్వులు పంచుకోండి .. ఒత్తిడిని తగ్గించుకోండి.. ఈ రోజు ఇంటర్నేషనల్ జోక్ డే

ఏదైనా జోక్ చదివి నవ్వేస్తాం.. కార్టూన్ చూసినా నవ్వు వచ్చేస్తుంది. కామెడీ సీన్ చూసినా కడుపుబ్బా నవ్వుతాం. ఇలా అందరికీ నవ్వుని పంచడం అనేది చాలా కష్టం. ఎంతోమంది ఆర్టిస్టులు, కళాకారులు నవ్వును పంచుతున్నారు. ఇప్పుడంతా రీల్స్, మీమ్స్, స్టాండప్ కామెడీల హవా నడుస్తోంది. ఏదైనా నవ్వించడమే అన్నింటి లక్ష్యం. ఈరోజు ఇంటర్నేషనల్ జోక్ డే.

International Joke Day 2023

International Joke Day 2023 : నవ్వడం ఈజీనే.. కానీ నవ్వు తెప్పించడం చాలా కష్టం. ఒక కార్టూన్ చూడగానే లేదా ఒక జోక్ చదవగానే ఫక్కున నవ్వేస్తాం. ఓ కామెడీ సీన్ చూసినా నవ్వు ఆపుకోలేం. అయితే అలా నవ్వును పుట్టించడం వెనుక వాటిని క్రియేట్ చేసిన వ్యక్తుల కష్టం ఉంటుంది. నవ్వు ఇప్పుడు చాలా ముఖ్యమైన ఎమోషన్. ఒత్తిడిని జయించడానికి ఒక టానిక్. నవ్వు అనేది మన మానసిక, శారీరక ఆరోగ్యానికి మంచిదని అనేక పరిశోధనలు కూడా చెబుతున్నాయి. నవ్వులు పంచుకోవడానికి ప్రత్యేకమైన రోజు ఉంది. ‘ఇంటర్నేషనల్ జోక్ డే’ ఈరోజు.

Laughter lessons in Japan : మాస్క్ వల్ల నవ్వడం మర్చిపోతారా?

ఏటా జూలై 1 న ‘ఇంటర్నేషనల్ జోక్ డే’ జరుపుకుంటారు. నవ్వు తెప్పించడం.. నవ్వు పంచుకోవడం ఈ డే స్పెషాలిటీ. ఈ డే జరుపుకోవడం వెనుక పెద్ద చరిత్ర ఏమీ లేదు కానీ.. అమెరికన్ నవలా రచయిత వేన్ రీనాగెల్ తన జోక్ పుస్తకాలను మార్కెట్ చేయడం కోసం ఈ రోజుని సృష్టించారని చెబుతారు. మొదట యునైటెడ్ స్టేట్స్‌లో ఈ డేని సెలబ్రేట్ చేశారట. క్రమంగా ప్రపంచవ్యాప్తంగా ఈ దినోత్సవం జరుపుకోవడం మొదలైంది. ఇక ఈరోజు ఏం చేస్తారు? అంటే కామెడీ క్లబ్స్ నవ్వుల  కార్యక్రమాలు చేపడుతాయి. అలాగే హాస్యాన్ని పండించే కళాకారులను, నటులను సత్కరిస్తారు.

 

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో జీవితంలో హాస్యం చాలా అవసరం. హాస్యం లేని జీవితం చప్పగా ఉంటుంది. నిరుత్సాహంగా ఉంటుంది. ఇదివరకు రోజుల్లో హాస్య రచయితలు జోక్స్ మాటల్లో రాసి నవ్వులు పంచేవారు. కార్టూనిస్టులు తమ బొమ్మలతో నవ్వులు పంచేవారు. కానీ టైం మారిపోయింది. రీల్స్, మీమ్స్, స్టాండ్ అప్ కామెడీలు ఇప్పుడు ఎక్కువగా ప్రజాదరణ పొందుతున్నాయి. రోజువారి పనులు, సమస్యలతో సతమతమయ్యే వారికి చిరునవ్వులు పంచడంలో ఇవి ప్రముఖ పాత్ర వహిస్తున్నాయి.

Beautiful Smile : ఆరోగ్యకరమైన అందమైన చిరునవ్వు కోసం!

జోకులు పంచుకోవడం వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయి. మనం ఎప్పుడూ నవ్విస్తూ ఉంటే మన చుట్టూ అనేకమంది చేరతారు. అలాగే బ్రేకప్ అయిన ఫ్రెండ్స్ కూడా తిరిగి కనెక్ట్ అవుతారు. ఎక్కడైతే వాతావరణం సీరియస్ చర్చల్లో మునిగి ఉంటుందో అక్కడ ఒక జోకు పేలితే వెంటనే అక్కడి వ్యక్తులు కూల్ అయిపోతారు. నవ్వులు విరబూస్తాయి. అనారోగ్యంతో ఉన్న వ్యక్తులు సైతం జోక్స్ చదివినా, విన్నా వారి మోముపై కూడా నవ్వులు పూస్తాయి. అయితే హాస్యం అనేది సున్నితంగా ఉండటంతో పాటు ఎవరి మనోభావాలు దెబ్బతీయకుండా, కించ పరచకుండా ఉండటం అనేది అత్యంత ముఖ్యం. నవ్వును పంచే ఆర్టిస్టులకు, కళాకారులకు, రచయితలకు ‘ఇంటర్నేషనల్ జోక్ డే’ శుభాకాంక్షలు.