Ceasefire : అమెరికా- ఇరాన్ మధ్య కాల్పుల విరమణ పొడిగింపుపై ట్రంప్ కీలక ప్రకటన.. అక్కడ మాత్రం వదిలేది లేదని తేల్చిచెప్పిన..
Donald Trump : కాల్పుల విరమణను పొడిగిస్తూ నిర్ణయం తీసుకోవడంతో డొనాల్డ్ ట్రంప్‌నకు పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కృతజ్ఞతలు తెలిపారు.
Donald Trump
- అమెరికా – ఇరాన్ మధ్య కాల్పుల విరమణ పొడిగింపు
- పాక్ అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం : ట్రంప్
- హర్మూజ్ వద్ద ఇరాన్ నౌకలపై దిగ్బంధనం కొనసాగింపు
Ceasefire : ఇరాన్, అమెరికా మధ్య కాల్పుల విరమణపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. మరోసారి కాల్పుల విరమణ గడువును పొడిగిస్తున్నట్లు తెలిపారు. పాకిస్థాన్ అభ్యర్థన మేరకు కాల్పుల విరమణ పొడిగింపు నిర్ణయం తీసుకోవటం జరిగిందని ట్రూత్ సోషల్‌లో ట్రంప్ పోస్టు చేశారు. అయితే, ఇరాన్ పోర్టుల వద్ద అమెరికా సైనిక దిగ్బంధం మాత్రం యథాతథంగా కొనసాగుతుందని ట్రంప్ స్పష్టం చేశారు.
అమెరికా – ఇరాన్ మధ్య ఈనెల 8న రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. ఈ కాల్పుల విరమణ ముగియడానికి కొన్ని గంటల ముందు దీన్ని పొడిగిస్తున్నట్లు ట్రంప్ తెలిపారు. ‘పాకిస్థాన్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్, ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్‌ల అభ్యర్థన మేరకు ఇరాన్ ఏకీకృత ప్రతిపాదనతో ముందుకు వచ్చే వరకు, చర్చలు ఒక కొలిక్కి వచ్చే వరకు కాల్పుల విరమణ కొనసాగుతుంది. అయితే, హర్మూజ్ జలసంధి వద్ద ఇరాన్ నౌకల రాకపోకలపై దిగ్భందనం యథావిధిగా ఉంటుంది. ఇప్పటికే దీనిపై అప్రమత్తంగా ఉండాలని మా సైన్యాన్ని ఆదేశించాను’ అంటూ ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ సోషల్ ట్రూత్ ద్వారా పోస్టు చేశారు.

కాల్పుల విరమణను పొడిగిస్తూ నిర్ణయం తీసుకోవడంతో డొనాల్డ్ ట్రంప్‌నకు పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం కొనసాగుతున్న దౌత్య ప్రయత్నాలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఇది వీలు కల్పిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇదిలాఉంటే ట్రూత్ సోషల్‌లో డొనాల్డ్ ట్రంప్ మరో పోస్టు చేశారు. ‘హర్మూజ్ జలసంధిని ఇరాన్ తెరవాలని అనుకుంటుంది. దీంతో ఆ దేశం రోజుకు 500 మిలియన్ డాలర్లు సంపాదించుకోగలుగుతుంది. దాన్ని మూసి ఉంచితే ఆ మొత్తాన్ని అది కోల్పోవాల్సి వస్తుంది. ఇరాన్ నౌకలను మేం దిగ్భందించినందుకే హర్మూజ్‌ను మూసేశామని చెప్పడం వారి పరువు కాపాడుకోవడానికే. నాలుగు రోజుల క్రితం కొందరు తన దగ్గరకు వచ్చి సర్.. ఇరాన్ వెంటనే జలసంధిని తెరవాలని అనుకుంటుంది అని చెప్పారు. అయితే, దిగ్భంధనం ఎత్తేస్తే.. ఇరాన్ ఎప్పటికీ తమతో ఒక ఒప్పందానికి రాదని, ఆ దేశంలోని మిగిలిన భాగాన్ని పేల్చేసి, వారి లీడర్లను లక్ష్యంగా చేసుకుంటేనే అది ఒప్పందానికి వస్తుంది’ అంటూ ట్రంప్ హెచ్చరించారు.

