Iran Nuclear Treaty : ఇజ్రాయెల్ దెబ్బకు అణు ఒప్పందం నుంచి వైదొలగనున్న ఇరాన్..!

Iran Nuclear Treaty : ఇరాన్ పార్లమెంటు బిల్లును సిద్ధం చేస్తోంది. అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం (NPT) నుంచి నిష్క్రమించే అవకాశం కనిపిస్తోంది.

Iran Nuclear Treaty

Iran Nuclear Treaty : ఇజ్రాయెల్‌ భీకర దాడులతో ఇరాన్‌‌పై విరుచుకుపడుతోంది. వరుసగా నాలుగు రోజులుగా వైమానిక దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఇరాన్ కీలక ప్రకటన చేసింది.

అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం (NPT) నుంచి వైదొలగడానికి ఇరాన్ పార్లమెంట్‌లో ఒక బిల్లును రెడీ చేస్తోంది. సామూహిక విధ్వంసక ఆయుధాల అభివృద్ధికి టెహ్రాన్ ఇప్పటికీ వ్యతిరేకిస్తోందని ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.

Read Also : Strait of Hormuz: ప్రపంచానికి హర్మూజ్ టెన్షన్.. ఏంటీ హర్మూజ్? ఇరాన్ మూసేస్తుందా? భారత్‌లో పెట్రోల్ డీజిల్ ధరలు భారీగా పెరుగుతాయా?

అంతకుముందు, ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్ మాట్లాడుతూ.. ఇరాన్ అణ్వాయుధాలను అభివృద్ధి చేయాలనే ఉద్దేశ్యం లేదని, అణుశక్తి, పరిశోధనపై హక్కును కొనసాగిస్తుందని ఆయన అన్నారు.

సామూహిక విధ్వంసక ఆయుధాలకు వ్యతిరేకంగా సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మతపరమైన శాసనాన్ని పునరుద్ఘాటించారు.

ఈ పరిణామాల నేపథ్యంలో ఎన్‌పీటీ ఒప్పందం నుంచి తప్పుకోవాలని ఇరాన్ భావిస్తోంది. ఎన్‌పీటీ మాత్రమే కాదు.. అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (IAEA) సభ్యత్వం నుంచి కూడా వైదొలగాలని ఇరాన్ భావిస్తోంది.

పౌరులను ఖాళీ చేయిస్తున్న ఇజ్రాయెల్ :
ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య దాడులు తీవ్రమవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ప్రాంతీయ యుద్ధం గురించి భయాందోళనలు తీవ్రమవుతున్నాయి. ఇరానియన్ ఆయుధ సౌకర్యాల సమీపంలో నివసించే వారిని ఖాళీ చేయాలని ఇజ్రాయెల్ హెచ్చరించింది.

దాడులు చేసే లక్ష్యాల జాబితా ఇంకా ఉందని అధికారి ఒకరు పేర్కొన్నారు. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య సోమవారం తెల్లవారుజామున నుంచి క్షిపణి దాడులు మొదలయ్యాయి. అంతర్జాతీయ కాల్పుల విరమణ విజ్ఞప్తిని పట్టించుకోలేదు. ఇరుదేశాల మధ్య దాడులు వరుసగా మూడవ రోజుకు చేరుకున్నాయి.

2018లో ఇరాన్ అణు కార్యక్రమం వేగంగా అభివృద్ధి చెందింది. అణ్వాయుధం నిర్మాణం కోసం అవసరమైన యురేనియంను శుద్ధి చేసే ఒప్పందం నుంచి కూడా అమెరికా వైదొలిగింది. ఇరాన్ అణు కార్యక్రమం శాంతియుతమైనదని చెబుతోంది.

అయితే, అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ అధిపతి ఈ విషయంలో పదే పదే హెచ్చరించారు. ఇరాన్ అణు బాంబులను తయారు చేసేందుకు అవసరమైన యురేనియం కలిగి ఉందని హెచ్చరించారు.

1950లోనే అణు కార్యక్రమం ఆరంభం :
వాస్తవానికి ఇరాన్ అణు కార్యక్రమం 1950వ దశకంలో అమెరికా సహకారంతో మొదలైంది. 1958లో ఇరాన్ అంతర్జాతీయ అణుశక్తి సంస్థలో సభ్యత్వం కూడా తీసుకుంది. 1968లో ఇరాన్ అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందంపై కూడా సంతకం చేసింది. 1970లో ఆ దేశ చట్టసభ ఆమోదించింది. వెంటనే ఇది అమల్లోకి తీసుకొచ్చింది.

Read Also : Israel-Iran Battle : ఇరాన్‌పై ఇజ్రాయెల్‌ భీకర దాడులు.. బంకర్‌లోకి కుటుంబంతో సుప్రీం లీడర్‌ ఖమేనీ..!

దీని ఒప్పందం ప్రకారం.. ఏ దేశం కూడా అణ్వాయుధాలను తయారు చేయకూడదు. కానీ, ఇరాన్ పౌర అణు కార్యక్రమం పేరుతో అణ్వాయుధాలను అభివృద్ధి చేస్తోందని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇజ్రాయెల్ ఇరాన్‌పై ముందస్తు దాడులు జరుపుతోంది.