Israel Ban (Photo Credit : Google)
Israel Ban : ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ పై ఇజ్రాయెల్ నిషేధం విధించింది. తన దేశంపై ఇరాన్ భారీ మిస్సైళ్లతో దాడి చేస్తే గుటెరస్ ఖండించడంలో విఫలమయ్యారని ఇజ్రాయెల్ మండిపడింది. ఆంటోనియో గుటెరస్ ఐక్యరాజ్య సమితి చరిత్రలో మాయని మచ్చగా మిగిలిపోతారని, ఆయన తమ దేశంలోకి రాకుండా నిషేధం విధిస్తున్నామని ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఇజ్రాయెల్ పై ఇరాన్ చేసిన హేయమైన దాడిని నిస్సందేహంగా ఖండించలేని ఎవరైనా ఇజ్రాయెల్ గడ్డపై అడుగుపెట్టే అర్హతలేదని పేర్కొంది. హమాస్, హిజ్బొల్లా, హౌతీలు ఇప్పుడు ఇరాన్ నుంచి ఉగ్రవాదులు, రేపిస్టులు, హంతకులకు ఆంటోనియో గుటెరస్ మద్దతిస్తున్నారని వ్యాఖ్యానించింది. ఇజ్రాయెల్ తన పౌరులను రక్షించుకుంటుందని, దేశ గౌరవాన్ని నిలబెట్టుకుంటుందని తెలిపింది.
కాగా, ఇజ్రాయెల్ తనపై నిషేధం విధిస్తూ ప్రకటన చేసి తర్వాత ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ గుటెరస్ స్పందించారు. ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడులను ఆయన ఖండించారు. UN భద్రతా మండలితో ఆయన మాట్లాడారు. హింసను ఆపేందుకు ఇదే సరైన సమయం అన్నారాయన.
అంతకుముందు.. ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి గుటెరస్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదులకు మద్దతిచ్చే ఇజ్రాయెల్ వ్యతిరేక సెక్రటరీ జనరల్ అంటూ గుటెరస్ పై విరుచుకుపడ్డారు.
మొదట్లో కాల్పుల విరమణకు పిలుపునిచ్చిన గుటెరస్.. ఇరాన్ దాడి గురించి మాత్రం ప్రత్యేకంగా ప్రస్తావించలేదు. మంగళవారం.. ఇజ్రాయెల్ పై దాడులకు దిగింది ఇరాన్. దాదాపు 180 బాలిస్టిక్ క్షిపణులను ఇజ్రాయెల్ పైకి ప్రయోగించింది. దీంతో ఉద్రిక్తతలు పెరిగాయి.