Reverse Aging :వృద్ధాప్యం రాకుండా..అమెజాన్ అధినేత కోట్లు ఖ‌ర్చు పెట్టారా? వయస్సు తగ్గించటం సాధ్య‌మేనా?

‘రివర్స్‌ ఏజింగ్‌.’జీవితంలో వయస్సు పెరక్కుండా..వృద్ధాప్యం రాకుండా ఉండటం సాధ్యమవుతుందా? దాని కోసం ప్రత్యేక మెడిసిన్స్ ఉన్నాయా? ‘రివర్స్‌ ఏజింగ్‌’పై పరిశోధనలు ఏం చెబుతున్నాయి?

Reverse Aging

Reverse aging : దేవతలకు వృద్ధాప్యం రాదని వారు ఎప్పుడు యవ్వనంగానే ఉంటారని పురాణాలు కథల్లో చదువుకున్నాం.పురాణాల కథలు ఎంత వరకు నిజమనేది పక్కన పెడితే. మన జీవితంలో వయస్సు పెరక్కుండా..వృద్ధాప్యం రాకుండా ఉండటం సాధ్యమవుతుందా? దాని కోసం ప్రత్యేక మెడిసిన్స్ ఉన్నాయా? వైద్యశాస్త్రంలో వస్తున్న పెను మార్పులతో వృద్ధాప్యం కాకుండా చేయవచ్చా? కొత్త కొత్త ఆవిష్కకరణలు జరుగుతున్న వేళ నిత్యం యవ్వనంగా ఉండటం సాధ్యమేనా? ఇటువంటి ఎన్నో ప్రశ్నలు రేకెత్తిస్తున్నాయి కొన్ని పరిశోధనలు. వయసును వెనక్కి మళ్లించే ‘రివర్స్‌ ఏజింగ్‌’ ఇప్పుడో హాట్ టాపిక్ గా మారింది. ఈ హాట్ టాపిక్ కు ఇదే ప్రారంభం కాకపోయినా ప్రస్తుతం అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌ తన వృద్ధాప్యాన్ని నిలువరించుకునేందుకు అమెరికాకు చెందిన రివర్స్‌ ఏజింగ్‌ ప్రయోగాల కంపెనీ ‘ఆల్టోస్‌ ల్యాబ్స్‌’కు ఇటీవల కోట్లాది రూపాయలను ముట్టజెప్పారనే వార్తలు చర్చనీయాంశంగా మారాయి. ఈ తరుణంలో అసలు ‘రివర్స్‌ ఏజింగ్‌’ నిజంగా సాధ్యమేనామా? ఇప్పటివరకూ ఏమైనా ప్రయోగాలు జరిగాయా? ఈ ప్రయోగాలు ఎటువంటి ఫలితాలను ఇవ్వబోతున్నాయి? ఎంత వరకు ఈ రివర్స్ ఏజింగ్ సాధ్యం అనే విషయంల గురించి..

అసలీ ‘రివర్స్‌ ఏజింగ్‌ అంటే ఏమిటి?
జీవితంలో ఒక దశకు చేరుకున్నాక వయసును స్తంభింపజేసి..అక్కడి నుంచి వయసును యవ్వన దశకు వెనక్కి తీసుకువచ్చే ప్రక్రియనే ‘రివర్స్‌ ఏజింగ్‌’ అంటారు. గత 30 ఏళ్లుగా ‘రివర్స్‌ ఏజింగ్‌’పై పలు దేశాల్లో ప్రయోగాలు జరిగాయి. జరుగుతునే ఉన్నాయి. ప్రపంచమంతా కరోనా కోరల్లో చిక్కుకుని విలవిల్లాడుతున్న సమయంలో 2020లో ఇజ్రాయెల్‌ పరిశోధకులు చేపట్టిన ప్రయోగంలో ‘రివర్స్‌ ఏజింగ్‌’ అంత్యంత కీలకంగా మారింది. ‘రివర్స్‌ ఏజింగ్‌’ గురించి సైంటిస్టులు..‘రివర్స్‌ ఏజింగ్‌’ను విజయవంతంగా పూర్తిచేయాలంటే శరీరంలోని తొమ్మిది కీలక భాగాలను సమన్వయంతో ప్రభావితం చేయాల్సి ఉంటుందని చెప్పుకొస్తున్నారు.

Read more : Snail slime soap : నత్తల జిగటతో సబ్బులు తయారీ..వాడితే ముసలితనం రాదట..చర్మ వ్యాధులకూ చెక్ పెట్టేయొచ్చట..!!

డీఎన్‌ఏ లో మార్పులు..
వయసు పెరిగే కొద్దీ డీఎన్‌ఏ సహాయంతో కణాల మధ్య జరిగే సమాచార మార్పిడిలో పొరపాట్లు పెరుగుతాయి. ఈ దశను ‘జీనోమిక్‌ ఇన్‌స్టెబిలిటీ’ అంటారు. ఇది ఎక్కువైతే డీఎన్‌ఏ చెడిపోతుంది. దీంతో మూల కణాల పనితీరుపై ప్రభావం ఏర్పడి.. కణాల పునరుద్ధరణ ప్రక్రియ దెబ్బ తింటుంది. దీన్ని అరికట్టాలి అని సైంటిస్టులు చెబుతున్నారు.

క్రోమోజోమ్‌..‘టెలోమెరెస్‌’ రక్షణ కవర్..
క్రోమోజోమ్‌ చివర ‘టెలోమెరెస్‌’ అనే రక్షణ కవచం ఉంటుంది. వయసు పెరిగే కొద్దీ..ఆ కవచాలు అరిగిపోతాయి. దాంతో క్రోమోజోమ్‌లకు రక్షణ ఉంగకుండాపోతుంది. ఇది వృద్ధాప్యం రావడంపై ప్రభావం చూపుతుంది. ఈ రివర్స్ ఏజింగ్ లో భాగంగా ‘టెలోమెరెస్‌’లు అరగకుండా చర్యలు చేపట్టాలి.

Read more : Omega 3 Fatty Acids : శారీరక, మానసిక ఆరోగ్యానికి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌..

మైటోకాండ్రియా
శరీరంలోని కణాలకు మైటోకాండ్రియా శక్తి అందిస్తుంది. కానీ, వయసు పెరిగే కొద్దీ వాటిలో క్రియాశీలత తగ్గుతూ వస్తుంది. మైటోకాండ్రియా క్రియాశీలతను ఉత్తేజితం చేస్తే క్షీరదాల జీవిత కాలాన్ని పెంచొచ్చు.

బలహీన పడే మూల కణాలు..
వయసు మీదపడుతున్న కొద్దీ మూలకణాలు బలహీనపడి కణాల పునరుత్పాదనలో విఫలమవుతాయి. మూలకణాలను పునరుద్ధరించడం ద్వారా త్వరగా వృద్ధాప్యం రాకుండా చేసే వీలుందని పరిశోధనలు చెప్తున్నాయి. ఈ పరిశోధనల్లో వెల్లడైన ఈ అంశాన్ని సైంటిస్టులు మరింతగా పరిశోధనలు కొనసాగిస్తున్నారు.

కణాల ప్రవర్తన..ప్రక్రియల డెవలప్ మెంట్
మన శరీరం కొన్ని బాహ్యజన్యు (ఇపీజెనిటిక్‌) ప్రక్రియలను అభివృద్ధి చేస్తుంది. వయసులో పెరుగుదల, జీవనశైలిలో చోటుచేసుకునే పలు మార్పులు ఈ ప్రక్రియను సక్రమంగా జరగనివ్వవు. దీంతో కణాలకు తప్పుడు ఆదేశాలు వెళ్లడంతో అవి భిన్నమైన జీవక్రియలను నెరవేరుస్తాయి. ఈ ప్రక్రియలను అడ్డుకోవాలనేది పరిశోధకుల యత్నం.

కణాల పునరుత్పత్తి :కొత్త కణాలు ఉత్పత్తి అయ్యేందుకు మాతృ కణాలను ఎప్పటికప్పుడు బయటకు పంపే సామర్థ్యం శరీరానికి ఉంటుంది. అయితే, వయసు పెరిగే కొద్దీ ఆ సామర్థ్యం తగ్గుతుంది. దీన్ని నివారించాలి.

కణాల జీవక్రియ : ఏళ్లు గడిచే కొద్ది కొవ్వులు, చక్కెర లాంటి పదార్థాలను ప్రాసెస్‌ చేసే సామర్థ్యాన్ని కణాలు కోల్పోతాయి. దాంతో పోషకాలను కణాలు సరిగా జీర్ణం చేసుకోలేవు. ఈ ప్రక్రియను మార్చాలి.

కణాల వయసు :ఒక కణం బాగా దెబ్బతిన్నప్పుడు, వయసు పెరిగినప్పుడు అపరిపక్వ కణాల పుట్టుకను అడ్డుకునే పనిని ఆపేస్తుంది. దీన్ని అడ్డుకోవాలి.

కణాల మధ్య సమాచార మార్పిడి : మన శరీరంలోని కణాల మధ్య నిత్యం సమాచార మార్పిడి జరుగుతుంది. అయితే, ఏళ్లు గడిచే కొద్దీ ఆ సమాచారం అందిపుచ్చుకునే సామర్ధ్యం తగ్గుతుంది. దీన్ని నివారించాలి.

‘రివర్స్‌ ఏజింగ్‌’ ప్రయోగాల్లో ఇజ్రాయెల్‌ సక్సెస్..
రక్తకణాల వయసును తగ్గిస్తూ తద్వారా ‘రివర్స్‌ ఏజింగ్‌’ ప్రక్రియను సాధ్యం చేయడానికి ఇజ్రాయెల్‌లోని టెల్‌ అవీవ్‌ యూనివర్సిటీశాస్త్రవేత్తలు 2020లో హైపర్‌బారిక్‌ ఆక్సిజన్‌ ట్రీట్మెంట్‌ (హెచ్‌బీవోటీ-ఆక్సిజన్‌ చాంబర్‌లో వలంటీర్లను ఉంచి స్వచ్ఛమైన గాలిని రక్తకణాల్లోకి ప్రసరించేలా చేస్తారు)ని వినియోగించారు. 64 ఏండ్ల పైబడిన 35 మందిపై 90 రోజుల్లో 60 హెచ్‌బీవోటీ సెషన్లను నిర్వహించారు.

ఈ ప్రక్రియలో ‘టెలోమెరెస్‌’ అరుగుదలను నిలువరిస్త్తూ, కణాల ప్రవర్తనను నియంత్రించగలిగారు. దీంతో 64 ఏండ్లవారు 50 ఏండ్ల వయసులవారికి మళ్లే పనులు సునాయాసంగా చేసుకోగలిగారని తెలిపారు. అంతేకాకుండా వృద్ధాప్యపరంగా వచ్చే మార్పులు వారి ముఖవర్చస్సు చక్కటి మార్పులు వచ్చాయని..అలాగే శరీరాకృతిలో కూడా మార్పులు వచ్చాయని పరిశోధకులు తెలిపారు.

కాగా..అమెజాన్ అధినేతతో పాటు గూగుల్‌, ఒరాకిల్‌ సంస్థల అధిపతులు కూడా ఈ ‘రివర్స్‌ ఏజింగ్‌’పై ఇప్పటికే వందల కోట్ల రూపాయలు పెట్టుబడులుగా పెట్టారు. మరి వీరంతా తమ వయస్సుని తగ్గించుకుని వారి వారి వ్యాపారాలను మరింతగా పెంచుకోవటానికి జరిగే యత్నాల్లో ఇదొక భాగమా? లేదా భావి తరాల కోసం ఇదంతా చేస్తున్నారా? అనేది చర్చనీయాంశంగా మారింది. ఏది ఏమైనా ప్రకృతి సహజంగా జరిగే శారీక మార్పులు ఈ ప్రయోగాలతో సక్సెస్ అవుతాయా? లేదా అనేది తెలియాలంటే ఇంకా కొంతకాలం వేచి చూడాలి.