ఇజ్రాయెల్ చేతికి అత్యాధునిక రాడార్ వ్యవస్థ, 100 దళాలు..!- అమెరికా కీలక నిర్ణయం

ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి చేసిన నాటి నుండి అమెరికా మిలిటరీ మధ్యప్రాచ్యంలో తన ఉనికిని గణనీయంగా పెంచుకుంది.

Anti Missile System (Photo Credit : Google)

Anti Missile System : ఇజ్రాయెల్ కు బాసటగా అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. ఇజ్రాయెల్ చేతికి అత్యాధునిక రాడార్ వ్యవస్థ అందనుంది. ఇరాన్ ను ఎదుర్కొనేందుకు ఇజ్రాయెల్ కు ఈ అత్యాధునిక వ్యవస్థను అందజేయనుంది. బాలిస్టిక్ మిస్సైల్ ఎయిర్ డిఫెన్స్ ను అమెరికా అందించనుంది. ఈ రాడార్ ను ఆపరేట్ చేయడానికి అమెరికా సైన్యం ఇజ్రాయెల్ కు వెళ్లనుంది. ఇందులో భాగంగా 3వేల మంది సైన్యాన్ని ఇజ్రాయెల్ కు పంపనుంది. ఇజ్రాయెల్ పై ఇరాన్ జరిపిన బాలిస్టిక్ మిస్సైల్ దాడిపై అమెరికా ఆగ్రహంగా ఉంది.

”ఏప్రిల్ 13, అక్టోబర్ 1న ఇజ్రాయెల్‌పై ఇరాన్ మిస్సైల్ దాడులకు దిగింది. ఈ క్రమంలో ఇజ్రాయెల్ వైమానిక రక్షణను బలోపేతం చేయడంలో సహాయపడటానికి అధునాతన క్షిపణి నిరోధక వ్యవస్థను(యాంటీ మిస్సైల్ సిస్టమ్), దానిని నిర్వహించడానికి దళాలను ఇజ్రాయెల్‌కు అమెరికా పంపుతుంది” అని పెంటగాన్ తెలిపింది.

టెర్మినల్ హై-ఆల్టిట్యూడ్ ఏరియా డిఫెన్స్ (THAAD) బ్యాటరీని మధ్యప్రాచ్యంలో మోహరించడం ఇదేమి తొలిసారి కాదని పెంటగాన్ ప్రెస్ సెక్రటరీ తెలిపారు. గతంలో 2019లోనే ఇజ్రాయెల్‌కు కూడా పంపబడిందన్నారు. ప్రస్తుతం ఇజ్రాయెల్ ఇరాన్‌ మధ్య పెరిగిన ఉద్రిక్తతల కారణంగా.. ఇజ్రాయెల్‌కు అదనపు అమెరికా దళాలను మోహరించింది.

US రక్షణ అధికారి ప్రకారం.. THAAD బ్యాటరీని ఆపరేట్ చేయడానికి సుమారు 100 అమెరికా ట్రూప్స్ ను ఇజ్రాయెల్‌కు పంపనున్నారు. అమెరికా దళాలను ఇజ్రాయెల్ లోపల మోహరించడం చాలా అరుదు అని చెప్పాలి. అయితే క్షిపణి నిరోధక వ్యవస్థను నిర్వహించడానికి ఈ సంఖ్యలో సైనికులను పంపడం అవసరం.

THAAD వ్యవస్థ ప్రత్యేకంగా యాంటీ బాలిస్టిక్ క్షిపణి రక్షణ కోసం ఉద్దేశించబడింది. ఒకవేళ భవిష్యత్తులో ఇరాన్ దాడులకు దిగితే.. ఆ దాడుల నుండి తనను తాను రక్షించుకోవడానికి ఇజ్రాయెల్‌కు సాయపడుతుంది.

అక్టోబర్ 1వ తేదీన ఇజ్రాయెల్ పై ఇరాన్ దాడి చేసింది. తమ దేశంపై ఇరాన్ జరిపిన దాడికి ఎలా ప్రతి స్పందించాలనే దానిపై ఇజ్రాయెల్‌తో సంప్రదింపులు జరుపుతోంది అమెరికా. అయితే, ఇరాన్ లోని అణు స్థావరాలు, చమురు కేంద్రాలపై ఎట్టి పరిస్థితుల్లో దాడులు చేయొద్దని ఇజ్రాయెల్ కు తేల్చి చెప్పింది అమెరికా.

అక్టోబర్ 7, 2023న ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి చేసినప్పటి నుండి అమెరికా మిలిటరీ మధ్యప్రాచ్యంలో తన ఉనికిని గణనీయంగా పెంచుకుంది. ఈ ప్రాంతం అంతటా తన వైమానిక రక్షణను బలోపేతం చేసింది. తూర్పు మధ్యధరా, ఎర్ర సముద్రం, అరేబియా సముద్రానికి అదనపు యుద్ధనౌకలను, విమాన వాహక నౌకలను మోహరించింది. ఇటీవలే సైప్రస్‌కు అదనపు దళాలను పంపింది.

Also Read : సిరియాపై అమెరికా బాంబుల వర్షం.. వారి స్థావరాలే లక్ష్యంగా దాడులు..