సిరియాపై అమెరికా బాంబుల వర్షం.. వారి స్థావరాలే లక్ష్యంగా దాడులు..
ఇటీవలి కాలంలో సిరియాపైన అమెరికా దాడులు చేయడం ఇది రెండోసారి.

Us Forces Strike Syria (Photo Credit : Google)
US Strike Syria : అగ్రరాజ్యం అమెరికా సిరియాపై విరుచుకుపడుతోంది. సిరియాలోని ఐసిస్ ఉగ్ర స్థావరాలను లక్ష్యంగా చేసుకుని అమెరికా దాడులు చేస్తోంది. శుక్రవారం నుంచి ఇప్పటివరకు పలు దఫాలుగా సిరియాపై దాడులకు పాల్పడినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ ఓ ప్రకటన విడుదల చేసింది. అమెరికాతో పాటు దాని మిత్ర దేశాలపై ఐసిస్ దాడులు చేసేందుకు కుట్ర చేస్తోందని అమెరికాకు కచ్చితమైన సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో అమెరికా అప్రమత్తమై ముందుగానే సిరియాలోని ఉగ్ర స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతోంది.
అమెరికా బాంబు దాడుల్లో 37 మంది టెర్రరిస్టులు హతం..
ఇప్పటివరకు చోటు చేసుకున్న దాడుల్లో సిరియాలోని సాధారణ పౌరులకు ఎలాంటి ఇబ్బంది కలగలేదని అమెరికా తెలిపింది. ఇటీవలి కాలంలో సిరియాపైన అమెరికా దాడులు చేయడం ఇది రెండోసారి. సెప్టెంబర్ నెల చివరలో ఐసిస్ లక్ష్యంగా అమెరికా గగనతల దాడులకు పాల్పడింది. ఈ దాడుల్లో 37మంది టెర్రరిస్టులు హతమైనట్లు ప్రకటించింది. ఆ ఉగ్రవాదులంతా ఇస్లామిక్ స్టేట్ గ్రూప్, అల్ ఖైదా అనుబంధ సంస్థలకు చెందిన వారేనని తెలిపింది. మృతుల్లో ఇద్దరు కీలక నేతలు కూడా ఉన్నట్లు వెల్లడించింది.
అమెరికా దాడులతో ఉగ్ర దాడుల కుట్రలు భగ్నం..
”అమెరికా సైనిక విమానం సిరియాలోని ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాద స్థావరాలే లక్ష్యంగా దాడి చేసింది. ఉగ్ర దాడులకు పాల్పడకుండా తీవ్రవాదులను నిరోధించడం లక్ష్యంగా ఈ ఆపరేషన్ జరిగింది. అక్టోబర్ 11వ తేదీన వైమానిక దాడులు జరిగాయి. అమెరికా, దాని మిత్రదేశాలు, భాగస్వాములు, పౌరులపై దాడులకు ఉగ్రవాదులు కుట్ర పన్నారు. మా దాడులతో ఆ కుట్రలను భగ్నం చేశాం” అని యూఎస్ మిలటరీ అధికారులు తెలిపారు.
Also Read : ఇరాన్‌లోని ఈ ప్రాంతాల్లో ఇజ్రాయెల్ భీకరదాడికి సిద్ధం!: అమెరికా