ఇరాన్‌లోని ఈ ప్రాంతాల్లో ఇజ్రాయెల్ భీకరదాడికి సిద్ధం!: అమెరికా
ఇరాన్‌లోని న్యూక్లియర్ కేంద్రాలను లక్ష్యంగా చేసుకుంటుందన్న సూచనలు లేవని ఎన్‌బీసీ తెలిపింది.

ఇరాన్ కొన్ని రోజుల క్రితం తమ దేశంపై క్షిపణులతో చేసిన దాడికి ఇజ్రాయెల్ ప్రతీకారం తీర్చుకోవడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇరాన్‌లోని మిలటరీ, విద్యుత్ మౌలిక సదుపాయాలు ఉండే ప్రాంతాలను ఇజ్రాయెల్ టార్గెట్లుగా ఖరారు చేసుకుందని అమెరికా అధికారులు భావిస్తున్నారని ఎన్‌బీసీ టీవీ తెలిపింది.
ఇజ్రాయెల్ ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఉందని కొన్ని రోజుల నుంచి ఊహాగానాలు వస్తుండడం, అమెరికా కూడా ఇప్పుడు ఇదే విషయాన్ని చెప్పడంతో కలకలం రేపుతోంది. దాడులు జరిగే అవకాశం ఉండడంతో ఇప్పటికే మధ్యప్రాచ్యం అప్రమత్తంగా ఉంది.
అయితే, ఇరాన్‌లోని న్యూక్లియర్ కేంద్రాలను లక్ష్యంగా చేసుకుంటుందన్న సూచనలు లేవని ఎన్‌బీసీ తెలిపింది. గత ఏడాది ఉత్తర ఇజ్రాయెల్‌పై హిజ్బుల్లా రాకెట్‌లను ప్రయోగించడం ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాలతో చివరకు ఇరాన్‌పై దాడులు చేయాలన్న వ్యూహాలను ఇజ్రాయెల్ రచించుకుంటోంది.
దక్షిణ లెబనాన్‌లోని రామ్య గ్రామంలోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్న ఇజ్రాయెల్ దళాలతో పోరాడుతున్నామని హిజ్బుల్లా కూడా ఇవాళ ప్రకటించింది. ఉగ్రవాద మౌలిక సదుపాయాలను నాశనం చేయడానికి తాము దక్షిణ లెబనాన్‌లో కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్లు ఇజ్రాయెల్ సైన్యం కూడా తెలిపింది.
ఇజ్రాయెల్ ఇటీవలి వారాల్లో తన సైనిక కార్యకలాపాలను తీవ్రతరం చేసింది. దక్షిణ లెబనాన్, బీరుట్ దక్షిణ శివారు ప్రాంతాలతో పాటు, బెకా వ్యాలీపై బాంబులతో దాడులు చేసింది. హిజ్బుల్లా అగ్ర నాయకులను హతమార్చింది.
Mumbai Local Train : పట్టాలు తప్పిన ముంబై లోకల్ ట్రైన్.. సర్వీసులకు అంతరాయం