Israel-Lebanon War
Israel-Lebanon War: ఇజ్రాయెల్ గత కొన్నినెలలుగా లెబనాన్ పై వైమానిక దాడులతో విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే. తాజాగా మరోసారి ఇజ్రాయెల్ వైమానిక దాడులతో లెబనాన్ రాజధాని బీరుట్ లోని పలు ప్రాంతాలు దద్దరిల్లిపోయాయి. బీరుట్ లోని దక్షిణ శివారు ప్రాంతాలపై గడిచిన 24గంటల్లో ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో అనేక మంది చిన్నారులు సహా మొత్తం 40 మంది మరణించారని లెబనీస్ అధికారులు తెలిపినట్లు రాయిటర్స్ నివేదిక పేర్కొంది. శనివారం దక్షిణ లెబనీస్ ఓడరేవు నగరం టైర్ పై ఇజ్రాయెల్ వైమానిక దాడిలో ఏడుగురు మరణించారు.
బీరుట్ దక్షిణ శివారు ప్రాంతాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేయడంతో అనేక భవనాలు ధ్వంసం అయ్యారు. ఇదిజరిగిన కొన్ని గంటల తరువాత ఇజ్రాయెల్ వైమానిక దళం దక్షిణ, తూర్పు లెబనాన్ లోని వివిధ ప్రాంతాలపై శనివారం కొన్ని గంటలపాటు వైమానిక దాడులు నిర్వహించింది. దీంతో టైర్ నగరంలో మరణాల సంఖ్య పెరిగినట్లు లెబనీస్ అధికారులు పేర్కొన్నారు. సాధారణంగా ఇజ్రాయెల్ మిలిటరీ గతంలో నగరంలోని కొన్ని ప్రాంతాలపై దాడికిపాల్పడే సమయంలో అక్కడి నుంచి వెళ్లిపోవాలని స్థానికులకు హెచ్చరికలు జారీ చేస్తుంది. కానీ, శుక్రవారం దాడులకు ముందు ఎలాంటి ముందస్తు హెచ్చరికలు జారీ చేయకుండానే దాడులకు పాల్పడినట్లు స్థానిక మీడియా పేర్కొంది.
Also Read: ట్రంప్ రెడ్ బుక్ రెడీ..! కెనడా ప్రధాని ట్రూడోకు కఠినమైన సవాళ్లు తప్పవా?
టైర్ ప్రాంతంలో మరణించిన వారిలో ఇద్దరు పిల్లలు ఉన్నారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. శనివారం ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో హిజ్బుల్లా, అమల్ తో సంబంధం ఉన్న రెస్క్యూ గ్రూపుకు చెందిన ఏడుగురు వైద్యులతో సహా 13 మంది మరణించారు. చారిత్రాత్మక నగరమైన బాల్‌బెక్ సమీపంలో తూర్పు మైదానాల్లో జరిగిన దాడుల్లో కనీసం 20 మంది మరణించినట్లు నివేదికలు తెలిపాయి. అయితే, టైర్, బాల్‌బెక్ ప్రాంతాల్లోని హిజ్బుల్లా మౌలిక సదుపాయాలు కలిగిన ప్రదేశాలు, ఫైటర్స్, ఆపరేషనల్ అపార్ట్‌మెంట్లు, ఆయుధాల దుకాణాలపై దాడి చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం పేర్కొంది. లెబనాన్ లో గతేడాది నుంచి ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. ఇందులో కనీసం 3,316 మంది మరణించగా.. 13,979 మంది క్షతగాత్రులుగా మారినట్లు లెబనాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.